GHMCలో 27 మున్సిపాలిటీల విలీనంపై తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ఆర్డినెన్స్ జారీ చేయనుంది. ఇవాళ గవర్నర్ దగ్గరి నుంచి ఫైల్ రాగానే… GHMCలో 27 మున్సిపాలిటీల విలీనంపై చట్ట సవరణ చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనుంది. పురపాలక సంఘాల చట్టం, GHMC చట్ట సవరణ చేస్తూ… రెండు ఆర్డినెన్స్‌లు జారీ అయ్యే అవకాశం ఉంది.
సీపీఎం నేత పెంచలయ్య హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న అరవ కామాక్షిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న గంజాయి కేసులో అరవ కామాక్షిని అరెస్టు చేశారు. అయితే పెంచలయ్య హత్యలో అరవ కామాక్షి పాత్ర కీలకం కావడంతో ఆమెను పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. పెంచలయ్యను హతమార్చడంలో అరవ కామాక్షికి మరో కీలక వ్యక్తి సహాయ, సహకారాలు అందించారని పోలీసులు పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం కొత్త అన్నసముద్రంలోని ఎస్సీ పాలెంలో తీవ్ర విషాదం నెలకొంది. రానున్న క్రిస్మస్ పండుగ వేడుకలో భాగంగా స్టార్‌ను ఏర్పాటు చేస్తుండగా ఐదు మంది విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి CPR చేయడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు.
శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో 14 ఏళ్ల మైనర్ బాలిక గర్భం దాల్చింది. పెంపుడు తండ్రి, అతని బావమరిది అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. నెలల తరబడి మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. బాలికను బెదిరించి అత్యాచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి. అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన బాలికకు ట్రీట్ మెంట్ చేస్తుండగా ఐదు నెలల గర్భం బయటపడింది.
తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడికి చేసిన సర్జరీలో వైద్యులు సర్జికల్ బ్లేడ్‌ను లోపలే వదిలేశారు. ఈ బాధ్యతారాహిత్యానికి గాను, ఆర్థోపెడిక్ డాక్టర్ సత్యసాగర్, నర్సు పద్మావతిలను సస్పెండ్ చేస్తూ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. నొప్పి పెరగడంతో ఎక్స్‌రే తీయగా బ్లేడ్ ఉన్నట్టు తేలింది. ఈ ఘటనపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసి విచారణకు ఆదేశించారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో అధికారులు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం కారణంగా జలాశయాలు నిండుగా ఉన్నాయి. కృష్ణపట్నం పోర్టులో 3వ ప్రమాద సూచిక ఎగురవేశారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని మంత్రులు ఆదేశించారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఉద్యోగుల సెలవులు రద్దు చేశారు.
బీఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. సరిహద్దులను, ప్రజలను రక్షించే ధైర్యవంతులైన సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క అత్యున్నత త్యాగాలు, అచంచల ధైర్యం, నిబద్ధత ప్రతిరోజూ మాకు స్ఫూర్తినిస్తాయి అని రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ జై హింద్ అన్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ రేపు మరోసారి బ్రేక్‌ఫాస్ట్ మీట్‌లో కలుస్తున్నారు. సీఎం సిద్ధరామయ్యను డీకే శివకుమార్ తన నివాసానికి ఆహ్వానించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పుపై వస్తున్న ఊహాగానాలకు ఈ తరహా తరచు సమావేశాల ద్వారా చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరుకు చెందిన కరుణ అంధుల మహిళల T20 ప్రపంచకప్‌లో దేశానికి స్వర్ణ పతకం సాధించి గర్వకారణంగా నిలిచింది. కొలంబోలో ఆరు దేశాలతో పోటీపడి విజయం సాధించిన ఈ క్రీడాకారిణికి గన్నవరం ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌లను కలిసేందుకు ఆమె విజయవాడ బయలుదేరి వెళ్లారు.
సంతబొమ్మాలి మండలం తాళ్లవలస గ్రామంలో డయేరియా విజృంభిస్తోంది. ఈ వ్యాధి కారణంగా ఒక వ్యక్తి మృతి చెందగా, అదే గ్రామానికి చెందిన ఐదుగురు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు ఉదయం మరో రెండు కొత్త కేసులు నమోదు కావడంతో బాధితులను టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్రమత్తమైన అధికారులు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి, పారిశుధ్య పనులపై దృష్టి సారించారు.
విశాఖలోని కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జిను ప్రారంభించారు ఎంపీ భరత్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ. ఏడు కోట్లతో ఇండియాలోనే అతిపెద్ద గ్లాస్ బ్రిడ్జ్ కైలాసగిరిపై ఏర్పాటు చేశామని వారు తెలిపారు. 55 మీటర్ల పొడవు మూడు మీటర్ల వెడల్పుతో 1020 అడుగుల సముద్రపు ఎత్తులో నిర్మాణం చేపట్టామన్నారు. ఒక్కొక్కరికి టికెట్ 300గా నిర్ణయించారు నిర్వహణ సంస్థ వారు. నేటి నుంచి కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ అందుబాటులోకి రానుంది.
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూర్ మండలం మస్తీపూర్ కి చెందిన రాజశేఖర్(26) శ్రీ కృష్ణ లాడ్జిలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లిలోని నవోదయ కాలనీలో నివాసం ఉంటున్న మాధురి అనే వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మాధురికి రాజేష్ నాయుడుతో కులాంతర వివాహం జరిగిన మాధురి భర్త వేధింపుల కారణంగానే చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల్లో నేటి నుంచి మద్యం అమ్మకాలు మొదలవుతాయి. ఒక్కో దరఖాస్తు ధరను రూ.3 లక్షలకు పెంచడం ద్వారా ప్రభుత్వ ఖాజానాకు కోట్ల ఆదాయం సమకూరింది. ఈ కొత్త షాపులు రెండేళ్ల పాటు కొనసాగనున్నాయి.
ఐ-బొమ్మ రవి బెయిల్ పిటిషన్ ఈ రోజు విచారణకు రానుంది. ఇప్పటికే అతడిని 8 రోజుల పాటు కస్టడీలో విచారించారు సైబర్ క్రైమ్ పోలీసులు. బెయిల్ విచారణతో పాటు, పోలీసులు అతడిని మరో మూడు కేసుల్లో నాంపల్లి కోర్టు ముందు హాజరుపరచనున్నారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ డివిజన్‌లో 3500 హెక్టార్లలో సాగు చేసిన పెసర పంటను ప్రభుత్వం ఇప్పటివరకు కొనుగోలు చేయలేదు. క్వింటాకు రూ.8768 మద్దతు ధర ఉన్నా, కొనుగోలు లేకపోవడంతో పంట పుచ్చిపోతోంది. రైతులు మార్కెట్లో రూ.5000కే అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం ఇప్పుడైనా మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అంతరిక్షం నుంచి వ్యవసాయం వరకు వివిధ రంగాల్లో భారత్ సాధిస్తోన్న తాజా విజయాల వెనక యువతదే కీలక పాత్ర అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో మోదీ పాల్గొని మాట్లాడారు. యువత అంకిత భావమే వికసిత్ భారత్‌కు అతి పెద్ద బలమని చెప్పారు.
అపార ప్రతిభ గల భారతీయుల నియామకం ద్వారా అమెరికా ప్రయోజనం పొందిందన్నారు టెస్లా అధినేత ఎలాన్ మస్క్. H-1B వీసా దుర్వినియోగం, ముఖ్యంగా ఔట్‌సోర్సింగ్ కంపెనీల ద్వారా జరుగుతోందని, ఇది వలస వ్యతిరేక భావనకు కారణమవుతుందని పేర్కొన్నారు. ప్రతిభావంతులకు అధిక జీతాలు ఇవ్వడం, సమాజానికి మేలు చేయడంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.
2025 ఆఖరిలో ప్రేక్షకులకు వినోదం పంచేందుకు పలు సినిమాలు సిద్ధమయ్యాయి. ‘అఖండ 2: తాండవం’తో డిసెంబరు తొలి వారం నుంచే బాక్సాఫీసు వద్ద పండగ వాతావరణం నెలకొననుంది. క్రిస్మస్ సందర్భంగా నాలుగో వారంలో మీడియం రేంజ్ సినిమాల హవా ఉండనుంది.
రాంచీలో దక్షిణాఫ్రికాపై జరిగిన వన్డేలో టీమ్ఇండియా దిగ్గజాలు రోహిత్ శర్మ (57), విరాట్ కోహ్లీ (135) జోడీ అదరగొట్టింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 109 బంతుల్లో 136 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. రో-కో ద్వయం బ్యాటింగ్ విన్యాసాల కారణంగానే టీమ్ఇండియా 349 పరుగుల భారీ స్కోరు చేసి విజయం సాధించింది. వీరిద్దరూ మరోసారి టీమ్ఇండియాకు కుడి భుజం, ఎడమ భుజంగా నిలిచారు.