కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చాలని తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పై కోపం ఉంటే నేరుగా తిట్టాలని, కానీ పేదల పొట్టగొట్టేలా పథకాల పేర్లు మార్చడం సరికాదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గెలిచిన బీజేపీ సర్పంచ్‌లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సన్మానించారు. కేంద్ర నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి సాధ్యమవుతోందని, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం బీజేపీతోనే సాధ్యమని రామచంద్రరావు పేర్కొన్నారు.
సచివాలయంలో కలెక్టర్లతో మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జనవరిలో జరిగే రోడ్ సేఫ్టీ మాసం కార్యక్రమాలపై చర్చించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు విద్యార్థులు, ఉద్యోగులను భాగస్వామ్యం చేస్తూ అవగాహన సదస్సులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు, డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు. బనగానపల్లెను ప్లాస్టిక్ రహిత పట్టణంగా మార్చేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌కు నిరసన సెగ తగిలింది. తమను ఓడించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పక్కన పెట్టుకున్నందుకు నిరసనగా నాలుగు పంచాయతీల సర్పంచ్‌లు ఎమ్మెల్యే సన్మానాన్ని నిరాకరించారు. ఎమ్మెల్యే నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకుండా వారు సభ నుండి వెనుతిరిగారు.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ 8 పోలీస్ వాహనాలు, 2 డ్రోన్లను పోలీసులకు అందజేశారు. కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజల అనంతరం ఎస్పీ సతీష్ కుమార్‌తో కలిసి జెండా ఊపి వీటిని ప్రారంభించారు. క్రైమ్ రేటును తగ్గించేందుకు పోలీసులకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ప్రముఖ సినీ నటి ఆమని హైదరాబాద్‌లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో అధికారికంగా పార్టీలో చేరారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రధాని మోదీ నాయకత్వం, బిజెపి సిద్ధాంతాల పట్ల ఆకర్షితురాలై ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆమని తెలిపారు.
రామేశ్వరంలో టికెట్ లేని 300 మంది యాత్రికులు రైల్వే అధికారుల తనిఖీలను తప్పించుకునేందుకు వినూత్నంగా ప్రవర్తించారు. జరిమానా భయంతో ‘జై హో’ అంటూ నినాదాలు చేస్తూ స్టేషన్ నుండి గుంపుగా పరుగులు తీశారు. అధికారులు 100 మంది నుంచి 25 వేల రూపాయల జరిమానా వసూలు చేయగా, మిగిలిన వారు అధికారుల కళ్లుగప్పి తప్పించుకున్నారు.
మహబూబాబాద్ జిల్లా ఇటుకాలగడ్డ తండాలోని అంగన్వాడీ కేంద్రంలో చైత్ర, నిత్య అనే ఇద్దరు చిన్నారులు అస్వస్థతకు గురై మృతి చెందిన విషయం తెలిసిందే. వారి మృతిపై జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ స్పందించారు. విచారణలో భాగంగా సీడీపీవో ఎల్లమ్మ, సూపర్‌వైజర్ రాణికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
జగిత్యాల కొండగట్టు ఆలయ పరిధిలోని భూ వివాదం నేపథ్యంలో అటవీ, దేవస్థానం అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేశారు. సుమారు 6 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమిలో ఆలయ కార్యాలయం, హరిత హోటల్ ఉన్నట్లు గుర్తించి మార్కింగ్ చేశారు.
ఆదిలాబాద్ జిల్లా చిన్నబుగ్గారంలో ఎన్నికల వివాదం ముదిరి పోలీసులపై గ్రామస్థుల దాడికి దారితీసింది. గెలిచిన, ఓడిన సర్పంచ్ అభ్యర్థుల మధ్య గొడవను ఆపేందుకు వచ్చిన పోలీసులు, ఓడిన అభ్యర్థి కుమారుడిని కొట్టారన్న ఆరోపణలతో ఉద్రిక్తత నెలకొంది.
శ్రీకాకుళం జెడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. వైసీపీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు.. కూటమి ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ విక్రాంత్, జెడ్పీ ఛైర్మన్ విజయ జోక్యంతో ఇరువర్గాలు శాంతించాయి.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని మున్సిపల్ కాంప్లెక్స్ ఆవరణలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడంపై వ్యాపారులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వెంటనే ఈ ప్రాంతం నుంచి చెత్తను తరలించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో రెసైటర్ మొరారీ బాపు, తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ సుద్దాల చలపతిరావు, ఎక్సైజ్ కమీషనర్ ముఖేష్ కుమార్ మీనా లు వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ టీటీడీ ఆస్తుల పరిరక్షణపై స్పందించారు. భూదేవి కాంప్లెక్స్‌లో వైసీపీ నాయకుడు సురేష్ మద్యం సేవించినట్లు వస్తున్న వీడియోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మార్ఫింగ్ వీడియో కాదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈవో, ఎస్పీలను కోరారు.
బ్రౌన్ యూనివర్సిటీ, మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలలో జరిగిన తుపాకీ కాల్పుల ఘటనల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. గ్రీన్‌కార్డ్ లాటరీ కార్యక్రమాన్ని నిలిపివేశారు. నిందితుడు ఈ కార్యక్రమం ద్వారానే అమెరికాకు వచ్చినట్లు గుర్తించడంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
జర్మనీ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బెర్లిన్‌లోని మేధావులతో సమావేశమై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యం అంటే కేవలం పాలన మాత్రమే కాదని, అది నిరంతర జవాబుదారీతనమని ఆయన స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు అధికారం ముఖ్యమైతే, తమకు సత్యమే ప్రధానమని పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వెనక్కి మళ్లింది. పొగమంచు వల్ల తాహెర్‌పుర్ వద్ద ల్యాండింగ్‌కు వీలుకాకపోవడంతో పైలట్ తిరిగి కోల్‌కతాకు చేర్చారు. దీంతో ప్రధాని తన షెడ్యూల్ మార్చుకుని, విమానాశ్రయం నుంచే వర్చువల్‌గా కార్యక్రమంలో పాల్గొన్నారు.
2026లో భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును అధికారికంగా ప్రకటించింది బీసీసీఐ. ఈ మెగా టోర్నీకి స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు.
రామ్ పోతినేని కథానాయకుడిగా నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిసెంబర్ 25 నుంచి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి రానుంది.