మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖసంతోషాలు కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పవన్ ట్వీట్ చేశారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‌మెన్ కృష్ణచైతన్య ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. హయత్‌నగర్‌లోని తన నివాసంలో గన్‌తో కాల్చుకోగా.. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతోంది.
మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డికి తన చెల్లెలు షర్మిల జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగింపును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. సిద్దిపేటలో జిల్లా అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో బీజేపీ కుట్రలపై మండిపడ్డారు. గాంధీ పేరును తొలగించడం సామాన్యుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయం చేస్తే హీరోయిజంలా ఉండాలంటూ హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. పంచాయతీ ఎన్నికల్లో కొందరు కక్కుర్తి పడి.. వేరే పార్టీలతో చేతులు కలిపారన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మూడు రంగుల జెండాను ఓడించేందుకు పని చేశారని ఫైరయ్యారు.
మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. వికలాంగుల కాలనీ వెనుక ఉన్న అటవీప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకుని గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న జువెలరీ షాపు షట్టర్లు పగలగొట్టి సుమారు 34 తులాల బంగారం, 16 కిలోల వెండి, లక్ష రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
నిర్మల్ జిల్లా భైంసాలో పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో పట్టణం చెత్తాచెదారంతో నిండిపోయింది. మూడు రోజులుగా పనులు నిలిచిపోవడంతో మార్కెట్లు, బస్టాండ్ పరిసరాలు దుర్వాసన వెదజల్లుతున్నాయి. తమ డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె ఆపేది లేదని కార్మికులు భీష్మించుకూర్చోగా, అంటువ్యాధులు ప్రబలకముందే అధికారులు స్పందించాలని పట్టణ ప్రజలు వేడుకుంటున్నారు.
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని పత్తి మిల్లులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌లో తలెత్తిన లోపం వల్ల మంటలు చెలరేగి.. నిల్వ ఉన్న పత్తితో పాటు ట్రాక్టర్ పూర్తిగా దగ్ధమైంది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మూడు అగ్నిమాపక వాహనాలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంలో మిల్లుకు భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేసింది.
పోలియో రహిత సమాజం కోసం ఐదేళ్లలోపు పిల్లలందరికీ రెండు చుక్కల మందు వేయించాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిలుపునిచ్చారు. సాలూరులో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె.. జిల్లావ్యాప్తంగా 905 కేంద్రాల ద్వారా సుమారు లక్ష మంది పిల్లలకు మందు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
కాకినాడలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సమర్థించారు. రాష్ట్రాన్ని అరాచక శక్తుల నుంచి కాపాడేందుకు ఏపీలో యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అవసరమని ఆయన పేర్కొన్నారు. అవినీతిని అంతం చేసి, రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్ర ప్రదేశ్‌గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.
కృష్ణా జిల్లా కంకిపాడు పోలీసులు అంతరాష్ట్ర దొంగ పున్నాన రాంబాబును అరెస్ట్ చేసి, 409 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి.. కుటుంబ సభ్యులపైనే అనుమానం వచ్చేలా దొంగతనం చేసేవాడు. గతంలో 50కి పైగా కేసులు ఉన్న ఇతనిని సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ సందీప్ చాకచక్యంగా పట్టుకున్నారు.
అనంతపురం ఎస్‌కే యూనివర్సిటీ హాస్టల్‌లో ఎంఎస్సీ విద్యార్థిని మాధుర్య మృతి చెందింది. ఫిట్స్ రావడంతో ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. చర్మవ్యాధికి వాడుతున్న మందులు ఓవర్ డోస్ కావడం వల్లే ఫిట్స్ వచ్చినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు
శ్రీ సత్యసాయి జిల్లా పంతుల చెరువులో వైసీపీ నేత రమణారెడ్డి ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. చెరువుకు చెందిన 1.30 ఎకరాల భూమిని తన పొలంలో కలుపుకునేందుకు ఆయన చదును చేశారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని.. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాలో ఒక పులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వెకోలి నైగావ్ బొగ్గు గని పరిధిలోని శివాలయం సమీపంలో పులి కళేబరాన్ని స్థానికులు గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్, వివాదాస్పద యువనేత షరీఫ్ ఉస్మాన్ హాదీ అంత్యక్రియల్లో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు. హాదీ ఆదర్శాలను.. ఆయన అందించిన మంత్రాన్ని తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని యూనస్ ప్రకటించడం అంతర్జాతీయంగా ఆందోళన రేకెత్తిస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోనియా గాంధీకి బహిరంగ లేఖ రాశారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయకుండా సీఎంను అభినందించడం ప్రజలను వంచించడమేనని విమర్శించారు. హామీలు నెరవేర్చకుంటే ప్రజలు అభయహస్తాన్ని భస్మాసుర హస్తంగా మారుస్తారని.. వెంటనే వాగ్దానాలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
పుణె పుస్తక మహోత్సవంలో విదేశాంగ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ.. శ్రీకృష్ణుడు, హనుమంతుడు ప్రపంచంలోనే గొప్ప దౌత్యవేత్తలని కొనియాడారు. రామాయణ, మహాభారతాల్లోని రాజనీతిని విదేశీయులు గుర్తించాలని.. వారి వ్యూహాలే నేటికీ ఆదర్శమని పేర్కొన్నారు.
టీ20 ప్రపంచకప్ జట్టులో శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కకపోవడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. గాయం కారణంగా దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరమైన అతనికి.. జట్టు ప్రకటనకు ముందే బీసీసీఐ ఫోన్ చేసి విషయం తెలిపిందని సమాచారం. న్యూజిలాండ్ సిరీస్, ప్రపంచకప్ కోసం సిద్ధమవుతున్న తరుణంలో సెలెక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయం గిల్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.
ఆది సాయికుమార్ నటించిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ శంబాల ట్రైలర్‌ను హీరో నాని విడుదల చేశారు. యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అర్చన అయ్యర్ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న విడుదల కానుంది.