E-Paper
Advertisement

Top 20 News: గ్లోబల్ టెక్నాలజీ హబ్‌‌గా ఏపీ.. సీఎం చంద్రబాబు, వైసీపీ కార్యకర్త పై నారా లోకేష్ ఫైర్

Top 20 News: గ్లోబల్ టెక్నాలజీ హబ్‌‌గా ఏపీ.. సీఎం చంద్రబాబు, వైసీపీ కార్యకర్త పై నారా లోకేష్ ఫైర్

1. గ్లోబల్ టెక్నాలజీ హబ్‌‌గా ఏపీ.. సీఎం చంద్రబాబు

ఏపీని గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా మారుస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. విశాఖపట్నంలో గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుండగా..అమరావతిని క్వాంటం వ్యాలీగా, తిరుపతిని స్పేస్ సిటీగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. వికసిత్ భారత్ లక్ష్యంతో తెలుగు యువతను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దడమే ధ్యేయమన్నారు.

2. మంత్రి పార్థసారథి కీలక వ్యాఖ్యలు

మంత్రి నారా లోకేష్ సీఎం బాధ్యతలు చేపట్టే అంశంపై మంత్రి పార్థసారథి కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ మంచి విజన్ ఉన్న నాయకుడని, తన పనితీరుతో చంద్రబాబుకు తగ్గ వారసుడిగా నిరూపించుకున్నారన్నారు. లోకేష్ సీఎం పదవిపై పార్టీలో చర్చ జరుగుతోందని.. అయితే కూటమి సమన్వయంతోనే దీనిపై తుది నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.

3. వైసీపీ కార్యకర్త పై నారా లోకేష్ ఫైర్

శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలంలో గర్భిణి సంధ్యారాణిపై వైసీపీ కార్యకర్త అజయ్‌దేవ్ దాడి చేయడంపై మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. జగన్ పుట్టినరోజు వేడుకల వేళ టపాసులు కాల్చవద్దని కోరినందుకు ఆమె గొంతు పట్టుకుని, కడుపుపై తన్నడం పైశాచికత్వమని విమర్శించారు.

4. ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి

కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. కాయిత్ తండాకు చెందిన ఒక కుటుంబం మొక్కు తీర్చుకునేందుకు ట్రాక్టర్‌పై వెళ్తుండగా, అది బోల్తా పడి గణేష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. పలువురికి తీవ్ర గాయాలు కాగా.. రెండు మేకలు కూడా చనిపోయాయి.

5. మానవత్వం చాటుకున్న కవిత

యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మానవత్వం చాటుకున్నారు. జాగృతి జనంబాటలో భాగంగా నారపల్లి మీదుగా వెళ్తుండగా.. ఆమెకు అభివాదం చేసే క్రమంలో బైక్ అదుపుతప్పి తండ్రీకూతుళ్లు కింద పడిపోయారు. వెంటనే కవిత తన వాహనాన్ని ఆపి తన కాన్వాయ్‌లోనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

6. బంద్‌కు పిలుపు

శంషాబాద్ ప్రాంతాన్ని ప్రభుత్వం వెంటనే ప్రత్యేక జోన్‌గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ స్థానిక జేఏసీ బంద్‌కు పిలుపునిచ్చింది. జేఏసీ పిలుపు మేరకు శంషాబాద్‌లోని పలు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు స్వచ్ఛందంగా పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించాయి.

7. దర్శనాలు నిలిపివేత

ములుగు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మేడారంలో రేపు సమ్మక్క-సారలమ్మల దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు తెలిపారు. క్షేత్రంలో గోవిందరాజులు, పగిడిద్ద రాజుల గద్దెల ప్రతిష్ఠాపన కార్యక్రమాలె, గద్దెల విస్తరణ పనులు జరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

8. ఆర్టీవో కార్యాలయంపై ఏసీబీ మెరుపు దాడులు

మహబూబ్‌నగర్ జిల్లా ఆర్టీవో కార్యాలయంపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో కార్యాలయంలోని అన్ని విభాగాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అధికారులు, అనధికార వ్యక్తుల ప్రమేయం, నగదు లావాదేవీలపై ఆరా తీస్తున్నారు.

9. ఆసుపత్రిని సీజ్ చేయాలంటూ కుటుంబ సభ్యులు డిమాండ్

హైదరాబాద్ చైతన్యపురిలోని మంజుసుధ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గర్భిణీ సునీత మృతి చెందిందంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అబార్షన్ కోసం అక్రమంగా ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు ఇవ్వడం వల్లనే ఆమె ప్రాణాలు కోల్పోయిందన్నారు. బాధ్యులైన డాక్టర్లపై చర్యలు తీసుకుని, ఆసుపత్రిని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

10. బహిరంగంగా నడిపిస్తూ…

విజయవాడలో రౌడీషీటర్ KTM పండుకు పెనమలూరు పోలీసులు వినూత్నంగా బుద్ధి చెప్పారు. డబ్బు విషయంలో శివకుమార్ అనే వ్యక్తిపై దాడి చేసిన పండును, అతని అనుచరులను పోరంకి రోడ్లపై కిలోమీటరు మేర బహిరంగంగా నడిపిస్తూ కోర్టుకు తరలించారు.

11. ప్రకాశం జిల్లాలో అగ్ని ప్రమాదం

ప్రకాశం జిల్లా గిద్దలూరులోని ఒక టిఫిన్ హోటల్‌లో గ్యాస్ పైపు లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, వారు వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 50 వేల రూపాయల విలువైన సామాగ్రి కాలిపోయినట్లు యజమాని తెలిపారు.

12. అభ్యుదయ సైకిల్ యాత్ర

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో పోలీసులు డ్రగ్స్ వద్దు బ్రో అంటూ వినూత్నంగా అభ్యుదయ సైకిల్ యాత్ర నిర్వహించారు. అచ్యుతాపురం నుంచి నీలమణి దుర్గ అమ్మవారి ఆలయం వరకు సాగిన ఈ ర్యాలీలో గంజాయి, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు.

13. కారు, బైక్ ఢీ.. దంపతులు మృతి

కృష్ణాజిల్లా కోమటిగుంట లాకుల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు ప్రాణాలు కోల్పోయారు. విజయవాడ-గుడివాడ రహదారిపై వెళ్తున్న బైకును కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పాలెపు వెంకన్న, గృహలక్ష్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

14. తప్పుడు ఆరోపణలు

ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఏ, కుమారుడిపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని పోలీసులు స్పష్టం చేశారు. నిందితులు త్రివేణి, దేవిశ్రీ కలిసి ఫేక్ వాట్సప్ స్క్రీన్‌షాట్లు సృష్టించి నాటకమాడారని ఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు. కుట్రను ఛేదించిన పోలీసులు.. తప్పుడు ఆరోపణలు చేసినందుకు త్రివేణి సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు.

15. చిన్నయి ట్వీట్

దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన ఘాటు వ్యాఖ్యలకు సింగర్ చిన్మయి సోషల్ మీడియా వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శివాజీ వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని చిన్మయి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

16. ఉద్యోగులకు గుడ్‌న్యూస్

అమెరికాలో పనిచేస్తున్న హెచ్-1బీ ఉద్యోగులకు గూగుల్ శుభవార్త చెప్పింది. రెండేళ్లుగా నిలిపివేసిన గ్రీన్ కార్డ్ స్పాన్సర్‌షిప్ ప్రక్రియను 2026 నుంచి పెద్ద ఎత్తున తిరిగి ప్రారంభించనుంది. అయితే, ఈ సౌకర్యం కేవలం ఆఫీసు నుంచి పనిచేసే వారికి మాత్రమే వర్తిస్తుందని అంతర్గత మెమోలో స్పష్టం చేసింది.

17. మంచు దుప్పటి

సౌదీ అరేబియాలోని తబుక్ ప్రావిన్స్‌లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా సున్నా డిగ్రీలకు పడిపోయాయి. పర్వత శ్రేణులు, ముఖ్యంగా 2,600 మీటర్ల ఎత్తులో ఉన్న ట్రొజెనా ప్రాంతం మంచు దుప్పటిని కప్పుకుంది. మేఘాలు, చల్లని గాలుల సంఘర్షణ వల్ల ఈ అరుదైన మార్పులు సంభవించాయని సౌదీ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ అద్భుత దృశ్యాలను చూసేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు.

18. హిందూ సంఘాలపై పోలీసుల లాఠీ చార్జ్

ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బంగ్లాలో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా వీహెచ్‌పీ, హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. హైకమిషన్‌ ఆఫీస్‌లోకి వెళ్లేందుకు యత్నించిన హిందూ సంఘాలను అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేశారు. బారికేడ్లు తోసుకుని వెళ్లేందుకు ప్రయత్నించడంతో.. పోలీసులు లాఠీ చార్జ్ చేస్తూ ఆందోళనకారులను చెదరగొట్టారు.

19. ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో తలపడనున్నారు. బుధవారం బెంగళూరులో ఆంధ్రతో జరిగే మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున ఆయన బరిలోకి దిగనున్నారు. అయితే, క్రిస్మస్ సెలవుల దృష్ట్యా భద్రతా కారణాలతో ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించవద్దని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది.

20. కలరిపయట్టు శిక్షణ

రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం వారణాసి కోసం మహేశ్‌ బాబు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో రుద్ర అనే పవర్‌ఫుల్ పాత్ర కోసం ఆయన ప్రాచీన భారత యుద్ధ కళ కలరిపయట్టు నేర్చుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ట్రైనర్ హరికృష్ణ వద్ద గత ఏడాది నుంచి ఆయన శిక్షణ పొందారు. బాడీ ఫ్లెక్సిబిలిటీ కోసం ఈ విద్యను అభ్యసించారని, మహేశ్‌ క్రమశిక్షణ తనను ఆశ్చర్యపరిచిందని హరి వెల్లడించారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×