Indian Doctors: ఇండియన్ డాక్టర్లు, నర్సులకు యూకే ఇష్టమైన గమ్యస్థానంగా ఉండేది. నేషనల్ హెల్త్ సర్వీస్ లో మంచి కెరీర్, గుర్తింపు ఉండేది. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయి. పెరుగుతున్న ఖర్చులు, కఠినమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, ఉద్యోగ భద్రత లేకపోవడంతో భారతీయ వైద్యులు, నర్సులు యూకే నుంచి తిరిగి వస్తున్నారు. ఆర్థిక ఒత్తిడి, వలస విధానాలు, కెరీర్ భద్రత లేకపోవడంతో వైద్యుల్లో అసంతృప్తి పెరుగుతోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డేటాలో కూడా ఈ విషయాలను హైలెట్ చేసింది. భారతీయులకు జారీ చేసే హెల్త్ అండ్ కేర్ వర్కర్ వీసాల సంఖ్య దాదాపు 67% తగ్గిందని తెలిపింది. అదే సమయంలో, భారతీయ నర్సులకు జారీ చేసే వీసాలు దాదాపు 79% తగ్గాయి.
యూకేలో భారతీయ వైద్యులకు.. జీతం, పన్నులు, జీవన వ్యయాలు భారంగా మారుతున్నాయి. జీతంలో NHS కన్సల్టెంట్ 2% జాతీయ బీమాకు, 45% ఆదాయపు పన్నును చెల్లించాల్సి ఉంటుంది. 65,191 పౌండ్ల కంటే ఎక్కువ సంపాదించే వైద్యులు పెన్షన్ కోసం తమ జీతంలో దాదాపు 12.5%ని NHS పెన్షన్ పథకానికి జమ చేయాలి. దీంతో వైద్యులపై భారం పడుతోంది.
ఇతర యూరోపియన్ దేశాలలో అందించే జీతాలతో పోలిస్తే యూకేలో జీతాలు తక్కువగా ఉండటంతో చాలా మంది గ్రాడ్యుయేట్లు యూకేను వీడుతున్నారు. ఇటీవలి డేటా ప్రకారం, భారతీయ సంతతికి చెందిన ఆరోగ్య నిపుణులు మెరుగైన జీతం, ఉన్నత జీవన ప్రమాణాలు, తక్కువ పన్నులు ఉన్న దేశాల వైపు ఆకర్షితులవుతున్నారు.
ఆస్ట్రేలియా, కెనడా, సెంట్రల్ ఏసియాలోని కొన్ని దేశాల్లో మెరుగైన వేతనాలు, దీర్ఘకాలిక ప్రయోజనాలు లభిస్తుండడంతో వైద్యులు.. అటు వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు. ఒకప్పుడు ప్రపంచంలోని ప్రముఖ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలలో ఒకటిగా ఉన్న NHSకు ఇమేజ్ తగ్గుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొంతమంది బ్రిటిష్ ఇండియన్ వైద్యులు వృత్తిపరమైన అవకాశాల కోసం భారతదేశానికి తిరిగి వస్తున్నారు.
ఇంగ్లాండ్ NHSలో పనిచేసే రేడియాలజిస్ట్ సంజయ్ గాంధీ మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానం భారతీయ వైద్య నిపుణులకు ఆటంకంగా మారింది. అక్రమ వలసలను నియంత్రించడం కష్టం కావడంతో, NHSలో పనిచేసే వారితో సహా చట్టబద్ధమైన వలసదారులు తరచుగా ప్రభుత్వ నిర్ణయాల ప్రభావాన్ని ఎదుర్కొంటారు. స్థానికంగా వైద్యుల నుండి పోటీ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
యూకే వీసా నిబంధనలు కఠినతరం చేయడంతో వైద్యులు ఈ దేశం వైపు చూడడంలేదు. ప్రొఫెషనల్, లింగ్విస్టిక్ అసెస్‌మెంట్స్ బోర్డ్ పరీక్షల సంఖ్యను పరిమితం సమస్యలు తలెత్తున్నాయని నిపుణలు అంటున్నారు. ఈ పరీక్షలలో విజయవంతమైన అభ్యర్థులకు కూడా ఉద్యోగ అవకాశాలు లభించడంలేదు. UKలో వైద్యుడిగా వర్క్ చేయడం సవాలుగా మారిందని నిపుణులు చెబుతున్నారు. త్వరలో NHSలో భారతీయుల సంఖ్య మరింత తగ్గిపోయే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. గత మూడు సంవత్సరాలలో ఆస్ట్రేలియా లేదా న్యూజిలాండ్‌కు వైద్యులు మకాం మారుస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.