డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా ఇప్పటంలో పర్యటించి, గతంలో తాను ఇచ్చిన మాట ప్రకారం ఇండ్ల నాగేశ్వరమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. నాగేశ్వరమ్మకు రూ. 50 వేలు, ఆమె దివ్యాంగ మనవడికి రూ. లక్ష ఆర్థిక సాయం అందించారు. తన ఎమ్మెల్యే జీతం నుంచి ప్రతి నెలా రూ. 5 వేలు వ్యక్తిగత సాయం ప్రకటించారు.
చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. టిప్పర్ ఓవర్ లోడే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని నిర్ధారించిన పోలీసులు, టిప్పర్ యజమాని లచ్చు నాయక్‌ను ప్రధాన నిందితుడిగా తేల్చి FIRలో పేరు చేర్చారు. ప్రమాద సమయంలో టిప్పర్‌లోనే ఉన్న ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
నాగర్‌కర్నూలు జిల్లా చారుకొండ సర్పంచ్ అభ్యర్థి లావణ్య గౌడ్ ఎన్నికల వ్యవస్థలోని లోపాలను ఎండగట్టారు. సర్పంచ్‌గా గెలవడానికి అభ్యర్థులు కోటి రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారని, ఆ డబ్బు రికవరీ కోసం నెలకు ఐదు లక్షల అవినీతికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నిజామాబాద్‌లోని పూజ ప్రైవేట్ ఆసుపత్రిలో రోహిత్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి ఓ నర్సుపై హత్యాచార యత్నానికి పాల్పడ్డారు. బాధితురాలు వారిని ప్రతిఘటించి, డయల్ 100కు సమాచారం ఇచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు. పోలీసులు నిందితుడు రోహిత్‌ను అరెస్ట్ చేశారు.
హన్మకొండ జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భీమదేవరపల్లి మండలంలోని శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. వచ్చే నెల 10వ తేదీ నుంచి 18 తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.
ఖమ్మం కవిరాజు నగర్‌లో విషాదం నెలకొంది. తల్లి మేరీ పద్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిసి, మనోవేదనకు గురైన 18 ఏళ్ల విద్యార్థిని సృజన ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. తండ్రి గతంలోనే మరణించగా.. హైదరాబాద్ ఆసుపత్రిలో ఉన్న తల్లి కోలుకోవడం కష్టమని వైద్యులు చెప్పడంతో సృజన ఈ దారుణానికి ఒడిగట్టింది.
ఆరేళ్ల ప్రేమ తర్వాత పెళ్లికి నిరాకరించడంతో ప్రియుడి ఇంటి ముందు ఓ యువతి న్యాయపోరాటానికి దిగింది. కైకలూరుకు చెందిన వరలక్ష్మి, జగ్గయ్యపేటలోని బాలు సత్యదేవ్ గత 13 ఏళ్లుగా స్నేహితులని, ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నామని ఆమె తెలిపింది. పెళ్లి చేసుకోమంటే సత్యదేవ్ మొహం చాటేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తూ, తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తోంది.
హైదరాబాద్ కూకట్‌పల్లిలోని రెయిన్‌బో విస్టా అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్లుగా పనిచేస్తూ గంజాయి విక్రయిస్తున్న బీహార్‌కు చెందిన ముగ్గురిని SOT పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి కిలో గంజాయి, గంజాయి చాక్లెట్లు, ఒక కారు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఏలూరు జిల్లా మోదెల గ్రామంలో విద్యుత్ లేని దుస్థితిపై బిగ్‌టీవీ కథనం అధికారులను కదిలించింది. పీఎం జన్‌మన్ పథకంలో భాగంగా 5 కిలోవాట్ల సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడంతో, 23 ఇళ్లకు తొలిసారి కరెంటు వచ్చింది. దశాబ్దాల తర్వాత వెలుగులు చూడటంతో గ్రామస్తులు నృత్యాలు చేస్తూ పండగ చేసుకున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారిని భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి. సింధు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబసభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీకాకుళం పట్టణంలోని మండల వీధిలో జడే కృష్ణ అనే పాల వ్యాపారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గత మూడు రోజులుగా ఇంటికి రాకుండా ఆవులు కట్టే పాకలోనే ఉంటున్న ఆయన, అక్కడే ఉరివేసుకుని విగతజీవిగా కనిపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను ప్రకటించాలని న్యాయవాదులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాజంపేట కోర్టు ప్రాంగణం నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు నిర్వహించిన ర్యాలీలో విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు. అన్ని వసతులు ఉన్న రాజంపేటనే జిల్లా కేంద్రంగా ప్రకటించాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు.
ఏపీలో పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల టెండర్లకు స్పందన కరువైంది. ఆదోని కాలేజీకి మాత్రమే కిమ్స్ బిడ్ వేయగా, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల కాలేజీలకు ఏ సంస్థా ముందుకు రాలేదు. తాము అధికారంలోకి వస్తే ఈ ఒప్పందాలను రద్దు చేస్తామన్న వైసీపీ అధినేత జగన్ హెచ్చరికల వల్లే పెట్టుబడిదారులు వెనకడుగు వేసినట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
గుంటూరు వెంగళాయపాలెం రహదారిలో డివైడర్‌కు గుర్తుతెలియని వ్యక్తులు జనసేన పార్టీ రంగులు వేయడం చర్చనీయాంశమైంది. ప్రజాధనంతో నిర్మించిన రోడ్లపై పార్టీ రంగులు వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది కార్యకర్తల పనా లేక దురుద్దేశపూర్వక చర్యనా అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై అటు అధికారులు, ఇటు జనసేన నాయకులు ఇంకా స్పందించలేదు.
ఏపీ గ్రామీణ ప్రాంత ప్రజలకు సంక్రాంతి కానుక అందించనుంది కూటమి ప్రభుత్వం. అన్న క్యాంటీన్లను పల్లె ముంగిటకు తీసుకెళ్లేలా రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 70 కొత్త క్యాంటీన్లను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేస్తూ.. జనవరి 13-15 మధ్య సంక్రాంతి పండుగ వేళ వీటిని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
అమెరికా నౌకాదళాన్ని శక్తిమంతం చేసేందుకు ట్రంప్ శ్రేణి యుద్ధనౌకలను నిర్మించనున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గోల్డెన్ ఫ్లీట్ లో భాగంగా వచ్చే ఇవి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనవిగా, శక్తిమంతమైనవిగా ఉంటాయన్నారు. హైపర్సోనిక్ క్షిపణులు, లేజర్ ఆయుధాలతో కూడిన వీటిలో మొదటి నౌకకు యూఎస్‌ఎస్ డెఫియంట్ అని పేరు పెట్టనున్నారు.
ఇస్రో సాధించిన అద్భుత విజయంపై ప్రశంసల వర్షం కురిపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అమెరికాకు చెందిన బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహాన్ని LVM3-M6 రాకెట్ ద్వారా విజయవంతంగా కక్ష్యలోకి చేర్చడం భారత అంతరిక్ష చరిత్రలో ఒక గొప్ప మైలురాయి అని ఆయన కొనియాడారు.
తమిళనాడు రాజకీయాల్లో విజయ్ పార్టీ ఆవిర్భావంతో సమీకరణలు వేగంగా మారుతున్నాయి. కరూర్ ఘటన నేపథ్యంలో విజయ్ రాజకీయ ఒత్తిడి ఎదుర్కొంటుండగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్వయంగా ఫోన్ చేసి సంఘీభావం తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. జాతీయ నేత మద్దతుతో విజయ్ రాజకీయంగా మరింత బలపడే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.
రెండు నెలల క్రితం వరకు జట్టులో సుస్థిర స్థానం లేక ఇబ్బంది పడిన జెమీమా రోడ్రిగ్స్, నేడు భారత క్రికెట్ సూపర్ స్టార్‌గా ఎదిగారు. 2025 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై ఆమె ఆడిన 127 పరుగుల ఇన్నింగ్స్ చరిత్ర సృష్టించింది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను డబ్ల్యూపీఎల్ కెప్టెన్‌గా నియమించడం ఆమె కెరీర్‌లో మరో మైలురాయి.
ది గర్ల్‌ఫ్రెండ్ తర్వాత రష్మిక మందన నాయికా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మైసా. నేడు ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో ఆదిలాబాద్‌లోని ‘గోండు’ తెగల నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. నా బిడ్డ ఊపిరి మోయలేక అగ్గే బూడిదైంది. నా బిడ్డను సంపలేక.. ఆఖరికి సావే సచ్చిపోయింది అనే డైలాగులు ఆసక్తి కలిగిస్తున్నాయి.