E-Paper
Advertisement

Top 20 News: సంగారెడ్డి జిల్లాలో పశువులతో ర్యాలీ, యూరియా కోసం రైతులు పరుగులు

Top 20 News: సంగారెడ్డి జిల్లాలో పశువులతో ర్యాలీ, యూరియా కోసం రైతులు పరుగులు

1. మంత్రి స్పందన

మంత్రి గుమ్మడి సంధ్యారాణి తనపై, తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేయడం తగదని ఆమె హితవు పలికారు. పోలీసు విచారణలో తమపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని తేలిపోయిందని, అందుకే తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారని స్పష్టం చేశారు.

2. అంతరాష్ట్ర ముఠా అరెస్ట్

చిన్నారులను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ నుంచి పిల్లలను తెచ్చి హైదరాబాద్, మంచిర్యాల ప్రాంతాల్లో ఒక్కొక్కరిని రూ. 4 నుంచి 5 లక్షలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ ముఠాలోని 20 మందిని అదుపులోకి తీసుకోగా, వారిలో సృష్టి ఫెర్టిలిటీ కేసులో బెయిల్‌పై వచ్చిన నిందితులు కూడా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.

3. యూరియా కోసం రైతులు పరుగులు

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు తెల్లవారుజాము నుంచే భారీగా క్యూ కట్టారు. యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో, గత రబీలో ఎదురైన ఎరువుల కొరతను దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా నిల్వ చేసుకునేందుకు రైతులు పరుగులు తీస్తున్నారు. గంటల తరబడి నిరీక్షించాల్సి రావడంతో రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

4. ఉద్రికత్త

మహబూబాబాద్ జిల్లా బొడ మంచ్య తండాలో భూక్య వీరన్న హత్య ఉద్రిక్తతకు దారితీసింది. వీరన్న భార్య విజయకు, అదే గ్రామానికి చెందిన బాలుతో ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని గ్రామస్తులు ఆమెపై దాడి చేశారు. హంతకులకు సహకరించాడనే కోపంతో ఆర్.ఎం.పి డాక్టర్ భరత్ బైక్‌ను, నివాసాన్ని ధ్వంసం చేశారు.

5. ఆర్టీవో అధికారి అరెస్ట్

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మహబూబ్‌నగర్ ఆర్టీవో అధికారి కిషన్ నాయక్‌ను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఆయన వద్ద పనిచేసే ప్రైవేట్ డ్రైవర్ శివశంకర్ ప్రధాన బినామీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. శివశంకర్ పేరుతో భారీ నగదు, స్థలాలు, విలాసవంతమైన కార్లు ఉన్నట్లు గుర్తించిన అధికారులు, పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నారు.

6. విచారణ వాయిదా

తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి నియామక ఉత్తర్వుల రద్దుకు హైకోర్టు నిరాకరించింది. రెండు వారాల్లోగా డీజీపీల ప్యానెల్‌ లిస్టును UPSCకి పంపాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ మేరకు ప్యానెల్‌ లిస్టు ఉండాలని, UPSCకి ప్యానెల్‌ లిస్టు పంపిన తర్వాత కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణ వచ్చే నెల 20కి వాయిదా వేసింది

7. నలుగురు అరెస్ట్

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ విలాసాలకు అలవాటు పడి, అడ్డదారిలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను చిక్కడపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఐటీ ఇంజనీర్ సుష్మిత తన ప్రియుడు ఇమాన్యుయెల్‌తో కలిసి సాగిస్తున్న డ్రగ్స్ దందాను గుర్తించి నలుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 4 లక్షల విలువైన MDMA, LSD బ్లాట్స్, OG కుష్‌ను స్వాధీనం చేసుకుని విచారణ ముమ్మరం చేశారు.

8. సంగారెడ్డి జిల్లాలో పశువులతో ర్యాలీ

సంగారెడ్డి జిల్లా దోమడుగులో హెటేరో పరిశ్రమ వల్ల నల్లచెరువు కాలుష్యమవడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు పశువులతో ర్యాలీ నిర్వహించారు. ఆ దారిలో వెళ్తున్న మాజీ మంత్రి హరీష్ రావు నిరసనకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జలవనరులను కలుషితం చేస్తున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను డిమాండ్ చేశారు.

9. అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

జీహెచ్‌ఎంసీ పరిధిలో విలీనమైన 27 మున్సిపాలిటీల అభివృద్ధిపై కమిషనర్ కర్ణన్ ప్రత్యేక దృష్టి సారించారు. నగరానికి అనుసంధానంగా ఉన్న అప్రోచ్ రోడ్లపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. శివారు ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణానికి రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని ఆయన స్పష్టం చేశారు.

10. అమీన్ పూర్ చెరువులో హైడ్రా సర్వే

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పెద్ద చెరువులో హైడ్రా, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా సర్వే చేపట్టారు. చెరువు తూములు మూసివేసినట్లు వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన అధికారులు, నాలుగు నాలాలకు గానూ కేవలం ఒకటి మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. మూడు మీటర్లు ఉండాల్సిన నాలా, ఆక్రమణల వల్ల కేవలం నాలుగు అడుగులకే పరిమితమైనట్లు సర్వేలో తేలింది.

11. గాలింపు చర్యలు

అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఇద్దరు కూతుళ్లను తండ్రి కాలువలో తోసి చంపిన ఘటనపై ఇంకా మిస్టరీ వీడలేదు. పెద్ద కూతురు అనసూయ ఆచూకీ కోసం పోలీసులు కాలువలో గాలిస్తున్నారు. భార్యపై అనుమానమే ఈ దారుణానికి కారణమని అనుమానిస్తున్నప్పటికీ, ఇతర కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

12. పురోగతిపై సమీక్ష

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతాన్ని పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సీఈఓ యోగేష్ పైతాన్కర్ నేతృత్వంలోని బృందం పరిశీలించింది. ప్రాజెక్టులో కొనసాగుతున్న డయాఫ్రం వాల్, గ్యాప్–1, గ్యాప్–2 ప్రాంతాల్లో నిర్మాణ పనులను అధికారులు ప్రత్యక్షంగా తనిఖీ చేశారు. అనంతరం అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.

13. మడకశిర పర్యటన

శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత MS రాజు మొదటిసారిగా మడకశిర పర్యటనకు విచ్చేశారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కాన్వాయ్‌తో మడకశిరలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు, అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.

14. రుషికొండ ప్యాలెస్

విశాఖలోని రుషికొండ ప్యాలెస్ వినియోగంపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. నెలకు రూ. 25 లక్షల నిర్వహణ ఖర్చు అవుతుండటంతో, దీనిని ప్రజా ప్రయోజనాలకు వాడాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్యాలెస్‌ను లగ్జరీ హోటల్‌గా మార్చడం లేదా అత్యాధునిక ఆసుపత్రిగా వినియోగించడంపై మంత్రులు సుదీర్ఘంగా చర్చించారు.

15. తప్పిన ప్రమాదం

సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం ఎన్.ఎస్.గేట్ రైల్వే ట్రాక్ మీద సడన్‌గా ఆగిపోయింది ఓ ఆర్టీసీ బస్. వెంటనే అప్రమత్తమైన స్థానికులు బస్సును పట్టాల నుంచి తప్పించారు. బస్ ఇంజన్‌లో ప్రాబ్లం ఉండటంతో సడన్‌గా రైలు పట్టాలపై ఆగింది. ఆ సమయంలో ట్రైన్ రాకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు.

16. రాజకీయ ప్రకంపనలు

బంగ్లాదేశ్‌లో యువనేత ఉస్మాన్ హాదీ హత్య రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ హత్యలో తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ కీలక వ్యక్తుల ప్రమేయం ఉందని హాదీ సోదరుడు సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికలు రద్దు చేసేందుకే ఈ కుట్ర పన్నారని, న్యాయం జరగకపోతే యూనస్ కూడా దేశం విడిచి పారిపోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

17. రాహుల్ గాంధీ ఆరోపణలు

బీజేపీ విధానాలు చిన్న వ్యాపారులను, ముఖ్యంగా వైశ్య వర్గాన్ని దెబ్బతీస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. వైశ్య వ్యాపారులతో భేటీ అనంతరం, జీఎస్టీ, గుత్తాధిపత్య సంస్థల వల్ల వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకైన ఈ వర్గానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని అన్నారు.

18. ఢిల్లీ కాలుష్యంపై మంత్రి నితిన్ ఆందోళన

ఢిల్లీ కాలుష్యంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. మూడు రోజులుగా ఢిల్లీలో ఉండటంతో తనకు అలర్జీ వచ్చిందని ఆయన వెల్లడించారు. రవాణా రంగం వల్లే 40 శాతం కాలుష్యం వస్తోందని, శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి ఎలక్ట్రిక్, హైడ్రోజన్ వాహనాలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

19. చరిత్ర సృష్టించిన సూర్యవంశీ

విజయ్ హజారే ట్రోఫీలో బిహార్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. అరుణాచల్ ప్రదేశ్‌పై కేవలం 36 బంతుల్లోనే శతకం బాది, లిస్ట్-ఏ క్రికెట్‌లో రెండో వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. మొత్తం 84 బంతుల్లో 190 పరుగులు చేసి తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు.

20. తీవ్ర అసహనం.. నటుడు నరేష్

విమాన ప్రయాణికుల పట్ల ఇండిగో ఎయిర్‌లైన్స్ అనుసరిస్తున్న తీరుపై సినీ నటుడు నరేష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విమానం వద్దకు తీసుకెళ్లే బస్సుల్లో ప్రయాణికులను పశువుల్లా కుక్కుతున్నారని, వృద్ధులు నిలబడలేని స్థితిలో ఉన్నా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×