E-Paper
Advertisement

Top 20 News: సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి విమర్శలు, రిజర్వాయర్‌ని వ్యతిరేకిస్తూ.. గ్రామస్తుల నిరాహారదీక్ష

Top 20 News: సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి విమర్శలు, రిజర్వాయర్‌ని వ్యతిరేకిస్తూ.. గ్రామస్తుల నిరాహారదీక్ష

1. క్రమశిక్షణ కలిగిన వారే విజయం సాధిస్తారు.. మంత్రి వివేక్

క్రమశిక్షణ కలిగిన వారే జీవితంలో విజయం సాధిస్తారని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్‌ వాసవి భవన్‌లో కేసీ పుల్లయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణ పూర్తి చేసుకున్న 710 మంది విద్యార్థులకు ఆయన సర్టిఫికెట్లు అందజేశారు. 2035 నాటికి 1.50 లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యమని ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.

2. వైకుంఠ ఏకాదశి వేడుకలకు సర్వం సిద్ధం

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం వైకుంఠ ఏకాదశి వేడుకలకు సర్వం సిద్ధమైంది. రేపు తెప్పోత్సవం, ఎల్లుండి ఉత్తర ద్వార దర్శనం కోసం అధికారులు హంస వాహనం ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఈవో దామోదర్ తెలిపారు.

3. చిరస్మరణీయం

కూకట్‌పల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, మాజీ మంత్రి జనార్దన్ రెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ ఆధ్వర్యంలో కేపీహెచ్‌బీ కాలనీలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి.. పీజేఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. పేదల పక్షపాతిగా పీజేఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని నేతలు కొనియాడారు.

4. కాంగ్రెస్ నాయకుల నిరసన

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చడం పట్ల నిరసిస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకుల గాంధీ ఫొటోలతో నిరసన తెలిపారు.

5. రిజర్వాయర్‌ని వ్యతిరేకిస్తూ.. గ్రామస్తుల నిరాహారదీక్ష

నాగర్ కర్నూల్ జిల్లా చారగొండ మండలం ఎర్రవెల్లి గ్రామ సమీపంలో డిండి నార్లాపూర్ ఎత్తిపోతల రిజర్వాయర్‌ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు, భూ నిర్వాసితులు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. ఈ నిరాహారదీక్షకు జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతు ప్రకటించి సంఘీభావం తెలిపారు.

6. గాంధీ విగ్రహానికి ఘన నివాళులు

మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి గాంధీ విగ్రహానికి నివాళులర్పించి.. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర్య పోరాటంలో కాంగ్రెస్ పాత్ర అమోఘమని, దేశాభివృద్ధికి పార్టీయే వెన్నెముక అని కొనియాడారు.

7. సిరిసిల్ల జిల్లాలో భూ వివాదం..

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో భూవివాదం ఘర్షణకు దారితీసింది. మాజీ సర్పంచ్ భర్త కోల నర్సయ్య, అల్లె శ్రీనివాస్‌ల మధ్య పాత కక్షలతో.. దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన పలువురికి తీవ్ర గాయాలు కావడంతో.. వారిని చికిత్స నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

8. కృషి చేయాలి

మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నివాసం వద్ద డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖ పార్టీ జెండాను ఆవిష్కరించారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పుట్టిన కాంగ్రెస్‌తోనే దేశాభివృద్ధి సాధ్యమని, రాబోయే రోజుల్లో కేంద్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శ్రేణులంతా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

9. జెండా ఆవిష్కరణ

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 13వ వార్డులో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఎమ్మెల్యే మురళి నాయక్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటాలు చేసిన కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు.

10. కాంగ్రెస్ శ్రేణుల భారీ నిరసన

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ శ్రేణులు భారీ నిరసన చేపట్టాయి. మహాత్మా గాంధీ పేరును తొలగించడం పేదలను, గాంధీజీ ఆశయాలను అవమానించడమేనని నాయకులు మండిపడ్డారు.

11. రిమాండ్

సంగారెడ్డి జిల్లా సిగాచీ పరిశ్రమ సీఈవో అమిత్ రాజ్ సిన్హాను సంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్ 30న పాశమైలారంలోని ఈ పరిశ్రమలో జరిగిన భారీ పేలుడులో 54 మంది కార్మికులు మరణించారు. ఈ ఘటనపై విచారణలో జాప్యంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. ఆరు నెలల తర్వాత పోలీసులు యాజమాన్యంపై చర్యలు తీసుకుని అమిత్ రాజ్‌ను రిమాండ్‌కు తరలించారు.

12. వీడియో విడుదల

అనంతపురం జిల్లా పెద్దవడుగూరుకు చెందిన టీడీపీ కార్యకర్త విజయ్ కుమార్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డిపై తాను చేసిన విమర్శలు వైసీపీ ప్రలోభాల వల్లే చేశానని, తనను క్షమించాలని కోరుతూ ఆయన మరో వీడియో విడుదల చేశారు. ఈ పరిణామంతో తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

13. క్షేత్రస్థాయిలో వైద్యం అందుబాటు

గుంటూరు హౌసింగ్ బోర్డ్ కాలనీలో కొత్త అర్బన్ హెల్త్ సెంటర్‌ను కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో వైద్యం అందుబాటులోకి రావడం వల్ల జీజీహెచ్‌పై భారం తగ్గుతుందని మంత్రి అన్నారు.

14. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి విమర్శలు

నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. కూటమి ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణంపై అసత్య ప్రచారాలు చేస్తోందని, వైసీపీ హయాంలో నిర్మించిన ఇళ్లను తమ ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన స్వార్థం కోసం అసెంబ్లీని వాడుకుంటున్నారని విమర్శిస్తూ.. ఇప్పటికైనా అబద్ధాలు మానుకుని ప్రజలకు మేలు చేయాలని కాకాణి డిమాండ్ చేశారు.

15. రోడ్డు ప్రమాదం

ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం రంగాపురం గన్నేపల్లి గ్రామాల మధ్య లారీ, బైకు ఢీకొన్నాయి. ఈ ఘటనలో గన్నేపల్లి గ్రామానికి చెందిన షేక్ రసూల్, షేక్ ఖాసింలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం ఒంగోలుకు తరలించారు. గాయపడ్డ వారిలో ఖాసిం పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వైద్యులు వెల్లడించారు.

16. పెను సంచలనం

పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్ సైన్యం బంకర్లలో దాక్కున్నారని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

17. 2025 విజయాలు..

ప్రధాని మోదీ 129వ మన్‌ కీ బాత్‌లో 2025 విజయాలను కొనియాడారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ తన రక్షణ సత్తాను చాటిందని.. వందేమాతరం 150 ఏళ్ల వేడుకలు స్ఫూర్తినిచ్చాయని పేర్కొన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ, మహిళల వన్డే ప్రపంచ కప్ విజయాలతో పాటు, అంతరిక్షంలో శుభాన్షు శుక్లా సృష్టించిన చరిత్రను దేశానికి గర్వకారణంగా ఆయన అభివర్ణించారు.

18. జలాంతర్గామిలో రాష్ట్రపతి

దేశ ప్రథమ పౌరురాలు, త్రివిధ దళాల సుప్రీం కమాండర్‌ ద్రౌపదీ ముర్ము జలాంతర్గామిలో ప్రయాణించారు. కర్ణాటకలోని కార్వార్‌ నౌకాదళ స్థావరం నుంచి కల్వరి శ్రేణి జలాంతర్గామి ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్‌లో ఆమె బయలుదేరారు. రాష్ట్రపతి వెంట నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కె.త్రిపాఠి ఉన్నారు.

19. టీ 20 సిరీస్ కోసం జట్టు ప్రకటన

శ్రీలంకతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన పాకిస్థాన్ జట్టును పీసీబీ ప్రకటించింది. సల్మాన్ అలీ అఘా కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది, మహమ్మద్ రిజ్వాన్, హరీస్ రౌఫ్‌లకు చోటు దక్కలేదు.

20. చివరి చిత్రం.. విజయ్

కోలీవుడ్ నటుడు విజయ్ తన రిటైర్మెంట్‌ను అధికారికంగా ప్రకటించారు. కౌలాలంపూర్‌లో జరిగిన జన నాయగన్ ఆడియో వేడుకలో మాట్లాడుతూ.. ఇదే తన చివరి చిత్రమని స్పష్టం చేశారు. మూడు దశాబ్దాల పాటు ఆదరించిన అభిమానులకు రాజకీయాల ద్వారా సేవ చేయడానికే సినిమాలకు స్వస్తి పలుకుతున్నట్లు విజయ్ వెల్లడించడంతో అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×