తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలు తెల్లవారుజామున 1.30 గంటల నుంచి ప్రారంభమయ్యాయి. రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకొని ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చారు.
హైదరాబాద్‌లోని పర్వత్ నగర్‌లో 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు టీపీసీసీ ఉపాధ్యక్షులు బండి రమేష్, అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం. సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సుంకన్న ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారు స్పష్టం చేశారు.
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు నిఘా పెంచారు. ప్రతిరోజూ రాత్రి 9 నుంచి అర్థరాత్రి ఒంటిగంట వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మైనర్లు పట్టుబడితే తల్లిదండ్రులపై చర్యలు తప్పవని, పట్టుబడిన వారికి 10 వేలు జరిమానా, జైలు శిక్ష లేదా లైసెన్స్ రద్దు ఉంటుందన్న సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అధికారులు, పోలీసులు భక్తులకు పటిష్ట ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్ శివారులో తీవ్ర విషాదం నెలకొంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సన్ సిటీలో ఒక అపార్ట్మెంట్ లిఫ్ట్ ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. శుభకార్యానికి వచ్చిన చోటే ఒక వృద్ధురాలు మృతి చెందడం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్ మల్లాపూర్‌లో ఒంటరిగా ఉంటున్న సుజాత అనే వృద్ధురాలిని ఆమె ఇంట్లోనే అద్దెకు ఉంటున్న క్యాబ్ డ్రైవర్ అంజిబాబు బంగారం కోసం హత్య చేశాడు. తన స్నేహితుల సహాయంతో మృతదేహాన్ని కోనసీమ జిల్లాకు తరలించి గోదావరిలో పడేశాడు. నాచారం పోలీసులు మిస్సింగ్ కేసును దర్యాప్తు చేసి.. నిందితుడిని అదుపులోకి తీసుకోవడంతో ఈ దారుణం బయటికొచ్చింది.
సంగారెడ్డిలోని రాంమందిర్‌లో ముక్కోటి ఏకాదశి వేడుకల్లో భాగంగా గరుత్మంతుని సేవ ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొని భక్తి పాటలు పాడి భక్తులను ఆకట్టుకున్నారు.
భూపాలపల్లి ఎస్సీ బాలికల హాస్టల్‌లో విద్యార్థినిపై అమానుషంగా దాడి చేసిన హాస్టల్ వార్డెన్‌పై సస్పెన్షన్ వేటు పడింది. వార్డెన్ భవానిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు జిల్లా కలెక్టర్. అలాగే ఆమెపై పలు ఆరోపణలు రావడంతో పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్‌ను ఆదేశించారు.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ATM చోరీ యత్నం కలకలం రేపింది. ఆల్విన్ కాలనీలో ఉన్న SBI బ్యాంక్ ఏటీఎంలో చోరికి ప్రయత్నించారు దుండుగులు. ఏటీఎంను తెరిచేందుకు కేబుల్స్‌ను తగలపెట్టారు. అటుగా వస్తున్న పోలీసులను చూసి జారుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పటాన్ చెరు పోలీసులు.
మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని దుంపలకుంట చౌరస్తాలో గుర్తు తెలియని దొంగలు షట్టర్ల తాళాలు పగలగొట్టి బీభత్సం సృష్టించారు. మొబైల్, బట్టలు, మెడికల్, కిరాణా దుకాణాల్లో సుమారు 2.65 లక్షల నగదు, సెల్‌ఫోన్లు, వెండి గొలుసును అపహరించారు. ఎస్ఐ మొహియుద్దీన్ ఘటనా స్థలాన్ని పరిశీలించి.. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఇసుక దందా మామూళ్ల వసూళ్ల ఆడియో కలకలం రేపుతోంది. ఒక్కో ట్రాక్టర్‌కు నెలకు రూ. 2 వేలు ఇవ్వాలని.. ఓ కాంగ్రెస్ నేత వాట్సాప్ గ్రూపులో పెట్టిన సందేశం వైరల్‌గా మారింది. ఈ వసూళ్ల వెనుక ఉన్నది ఎవరనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతుండగా.. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న హెరిటేజ్ పాల కంటైనర్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. క్రేన్ సహాయంతో కంటైనర్‌ను తొలగించారు.
అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల ఆటకట్టించేందుకు పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ పర్యవేక్షణలో వీరబల్లి మండలం దేవదాశి చెరువు వద్ద పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు.
మంగళగిరిలోని హాయ్ లాండ్ అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో డిసెంబర్ 31న న్యూఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరగనున్నాయి. అమిగోస్ మీడియా ఆధ్వర్యంలో జరగనున్న ఈ మెగా ఈవెంట్‌లో ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అలరించనున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామలోని భీమేశ్వర స్వామి ఆలయ సమీపంలో అపచారం జరిగింది. ముక్కోటి ఏకాదశి పర్వదినాన పురాతన కపిలేశ్వర ఘట్టంలోని శివలింగాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నాలుగేళ్లుగా సాగుతున్న యుద్ధానికి తెరదించేలా శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు రష్యా, ఉక్రెయిన్ ప్రస్తుతం మునుపెన్నడూ లేనంత చేరువగా వచ్చాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. డాన్‌బాస్ ప్రాంతం వంటి కొన్ని అంశాలపై సంప్రదింపులు సంక్లిష్టంగా ఉన్నాయని.. చర్చలు విఫలమయ్యే అవకాశాలను ఇప్పటికీ కొట్టిపారేయలేమని పేర్కొన్నారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బీఎన్‌పీ అధినేత్రి ఖలీదా జియా కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఢాకాలోని ఆస్పత్రిలో చేరిన ఆమె.. తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. రెండుసార్లు ప్రధానిగా పనిచేసిన ఆమె, బంగ్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు.
దేశంలోనే అత్యంత పురాతనమైన ఆరావళి పర్వతాలకు సరికొత్త నిర్వచనం ఇస్తూ గత నవంబరు 20వ తేదీన ఇచ్చిన తన సొంత తీర్పును సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది. ఆరావళి పర్వతాల ఎత్తు, శ్రేణిపై ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదికలోనూ.. దానిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోనూ మరింత స్పష్టత అవసరమని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సెలవు కాల ధర్మాసనం అభిప్రాయపడింది.
భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఓ రికార్డ్‌కు అడుగు దూరంలో ఉంది. ఆమె మరో 62 పరుగులు చేస్తే 2025లో అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచే అవకాశముంది. అలాగే ఆమె ఈ విషయంలో టీమ్‌ఇండియా బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌ను సైతం అధిగమించే ఛాన్స్ ఉంది.
రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న సినిమా పెద్ది. ఈ కాంబినేషన్‌పై తొలి నుంచి ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కీలక పాత్రల లుక్స్ బయటకు రావడంతో సినీ అభిమానుల్లో ఆసక్తి రెట్టింపు అవుతోంది.