E-Paper
Advertisement

Top 20 News: రైతులను ముంచేసిన ఏనుగులు…పదవి కోసం చంపారా?…దొంగ డాక్టర్ అరెస్ట్

Top 20 News: రైతులను ముంచేసిన ఏనుగులు…పదవి కోసం చంపారా?…దొంగ డాక్టర్ అరెస్ట్

1. ఆహ్వాన పత్రికతో మోడీ ని కలవనున్న సీఎం

డిసెంబర్‌ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో తెలంగాణ రైజింగ్‌-2025 సమ్మిట్‌ జరగనుంది. సదస్సును తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సదస్సుకు ప్రధానమంత్రి మోడీ సహా అన్ని రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు.

2. సీఎం సభను విజయవంతం చెయ్యండి: జూపల్లి కృష్ణారావు

రేపు ఆదిలాబాద్‌లో జరగనున్న సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలని ఉమ్మడి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు మంత్రి జూపల్లి కృష్ణారావు . పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహిస్తున్న సీఎం సభ ఏర్పాట్లను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు జూపల్లి.

3. రైతన్నలకోసం చంద్రబాబు

సీఎం చంద్రబాబు నేడు పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లకు వెళ్లనున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతన్న మీకోసం కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ఉదయం 10.30కు ఉండవల్లిలోని నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి నల్లజర్లలోని హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి నల్లజర్లలో వ్యవసాయ భూమి పరిశీలనకు వెళ్తారు.

4. హైస్పీడ్ రాకెట్ స్లెడ్ టెస్ట్ విజయవంతం

దేశీయ రక్షణ సాంకేతికతలో భారత్‌ మరో కీలక మైలురాయిని చేరుకుంది. DRDO యుద్ధవిమాన పైలట్‌ ఎస్కేప్‌ సిస్టమ్‌కు సంబంధించిన హై-స్పీడ్‌ రాకెట్‌-స్లెడ్‌ టెస్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విషయాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

5. రైతులను ముంచేసిన ఏనుగులు

తిరుపతి జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. చిన్నగొట్టిగల్లు మండలం తుమ్మచేనుపల్లిలో వరి పంట, కొబ్బరి తోటలను ధ్వంసం చేశాయి. ఏనుగుల దాడికి భారీగా పంట నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని.. అలాగే నష్ట పోయిన రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు రైతులు.

6. శ్రీలంకకు గడువు తీరిన మందులు, పనికిరాని ఆహారాన్ని పంపిన పాక్

దిత్వా తుపాను సహాయార్థం శ్రీలంకకు పాకిస్థాన్ పంపిన అత్యవసర సహాయంలో గడువు తీరిన వైద్య సామగ్రి, వినియోగానికి పనికిరాని ఆహార పొట్లాలు ఉన్నట్లు అక్కడి అధికారులు గుర్తించారు. తుపానుతో అతలాకుతలమైన శ్రీలంకకు భారత్‌తో పాటు పలు దేశాలు సహాయం అందించాయి. పాకిస్థాన్ కూడా సహాయం పేరుతో పంపిన వస్తువులు ఎక్స్‌పైర్డ్ అయ్యాయని శ్రీలంక అధికారులు చెప్పినట్లుగా అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

7. పదవి కోసం చంపారా?

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల వేళ విషాదం చోటుచేసుకుంది. ఫరూక్ నగర్ మండలం కంసాన్ పల్లి గ్రామంలో శేఖర్‌ అనే యువకుడు రైలు పట్టాలపై అనుమానస్పద రీతిలో మృతి చెందడం సంచలనంగా మారింది. కంసాన్‌ పల్లి నాలుగో వార్డు సభ్యుడు పదవికి అభ్యర్థిగా నామినేషన్ వేశారు శేఖర్‌. నాలుగు రోజులుగా గ్రామంలో కొందరు శేఖర్‌ను పోటీ నుంచి తప్పుకోవాలని…నామినేషన్ ఉపసంహరించుకోవాలని కొందరు వేధింపులకు గురిచేశారని గ్రామస్తులు చెబుతున్నారు.

8. డిజిటల్ ఇన్వెస్ట్‌మెంట్ కేసులో ట్విస్ట్

ఫాల్కన్ డిజిటల్ ఇన్వెస్ట్‌మెంట్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మనీ లాండరింగ్‌ కేసులో సీజ్‌ చేసిన జెట్‌ విమానాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వేలం వేయనుంది. ఈ నెల 9న మెటల్‌ స్రాప్‌ ట్రేట్‌ కార్పొరేషన్‌ ద్వారా ఈ విమానాన్ని వేలం వేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఫాల్కన్‌ ఇన్వాయిస్‌ డిస్కౌంటింగ్‌ పేరుతో అమర్దీప్‌సింగ్‌ మోసాలకు పాల్పడ్డాడు. అతడిని అరెస్ట్‌ చేయడంతోపాటు అతని వద్ద ఉన్న హకర్‌ 800ఏ జెట్‌ విమానాన్ని గతంలో శంషాబాద్‌లో పోలీసులు సీజ్‌ చేశారు.

9. విత్తన చట్టం ముసాయిదాపై సమీక్ష: రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అధ్యక్షతన విత్తన చట్టం-2025 ముసాయిదాపై సమీక్ష జరిగింది. కేంద్రం తెస్తున్న ఈ చట్టం బహుళజాతి విత్తన కంపెనీలకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుందని, రైతులపై భారంగా మారుతుందని నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. విత్తనాల ధరల నియంత్రణ లేకపోవడం, కంపెనీలకు సెల్ఫ్ సర్టిఫికేషన్ అనుమతి ఇవ్వడం, రైతులకు నష్టపరిహారం చెల్లింపులో అస్పష్టతపై ఆందోళన వ్యక్తం చేశారు.

10. పంచాయతీ నామినేషన్ల జోరు

తెలంగాణ గ్రామ పంచాయతీల రెండో విడత ఎన్నికల్లోనూ నామినేషన్ల పర్వం జోరుగా సాగింది. రెండో విడతకు నామినేషన్ల గడువు నిన్నటితో ముగిసింది. 193 మండలాల్లోని 4,332 గ్రామ పంచాయతీలు, 38,342 వార్డులకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ రాత్రి పొద్దుపొయేవరకు కొనసాగింది. రెండో విడతకు సంబంధించి…డిసెంబరు ఒకటో తేదీకే సర్పంచి పదవులకు 12,479 నామినేషన్లు, వార్డు సభ్యుల పదవులకు 30,040 నామినేషన్లు వచ్చాయి.

11. గురజాడ ఇంటిపై దాడి, సాహితీ సంఘాలు ఆవేదన

మహాకవి గురజాడ ఇంటిపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి. రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విజయనగరంలోని గురజాడ నివాసంలో చొరబడి తలుపులు, లైట్లు, ఇతర సామగ్రి ధ్వంసం చేశారు. గురజాడ ఇంటిపై తరచూ దాడులు జరుగుతున్నా జిల్లా అధికారులకు, ఆర్కియాలజీ డిపార్టుమెంట్‌కు గానీ పట్టకపోవడంతో…కవులు, సాహితీవేత్తలు, పలు సాహితీ సంఘాలు ఆవేదన చెందుతున్నారు.

12. దొంగ డాక్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

నకిలీ డాక్టర్ దాసరి యాదగిరిని మేడ్చల్ మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉప్పల్, లక్ష్మీనారాయణ కాలనీలో సరైన రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్లు లేకుండా సంజీవని ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నడుపుతున్నాడు యాదగిరి. పోలీసులు ఒక ప్రిస్క్రిప్షన్ బుక్, స్టెతస్కోప్, బీపీ మిషన్‌ను స్వాధీనం చేసుకుని, ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.

13. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ తీరాల మీదుగా వాయుగుండం

ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల మీదుగా వాయుగుండం కొనసాగుతోంది. గంటకు 3 కిలోమీటర్ల వేగంతో దక్షిణ-నైరుతి దిశగా నెమ్మదిగా కదిలి చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 40 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఈశాన్యంగా 120 కిలోమీటర్లు, నెల్లూరుకి దక్షిణ-ఆగ్నేయంగా 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

14. టికెట్ రేట్ల పెంపు వల్లే ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుడుతున్నారు: సీపీఐ నేత నారాయణ

కళామ్మతల్లిని సామాన్య ప్రజానీకానికి దూరం చేయడం వల్లనే… ఐ బొమ్మ రవి లాంటి వాళ్లు పుడుతున్నారని సీపీఐ నేత నారాయణ అన్నారు. టికెట్‌ రేట్ల పెంపుతో సామాన్య ప్రజల్ని సినిమాలకు దూరం చేస్తున్నారని ఆరోపించారు.ఐ బొమ్మ రవి లాంటి వాళ్లు పుడుతూనే ఉంటారని చెప్పారు. కాబట్టి రవిని అరెస్ట్‌ చేసే నైతిక హక్కు ప్రభుత్వానికి లేదని విమర్శించారు నారాయణ.

15. ఉద్యోగానికి ఆశ పడి మోసపోవద్దు

కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉద్యోగాల పేరిట టోకరా వేసిన రాజమండ్రి కేంద్రంగా పనిచేస్తున్న నెట్‌వర్క్‌ను పోలీసులు చేధించారు. డేటా ఎంట్రీ, టెలికాలింగ్ ఉద్యోగాలు ఇస్తామంటూ నిరుద్యోగుల నుంచి దాదాపు 75 లక్షల రూపాయల వరకు దోచుకున్నారు. ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు 8 మందిని అరెస్టు చేసి వారి నుంచి ల్యాప్‌టాప్‌లు, నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిరుద్యోగులు మోసపూరిత ప్రకటనలకు దూరంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.

16. టిప్పర్ లారీ బీభత్సం

హైదరాబాద్‌లోని మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముసరాంబాగ్ క్రాస్ రోడ్డు TV టవర్ వద్ద ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన టిప్పర్ అదుపుతప్పి డివైడర్‌ను దాటి సిగ్నల్ వద్ద ఆగి ఉన్న లారీ, ఆర్టీసీ బస్సు, ఒక కారును ఢీకొంది. ఈ ఘటనలో నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయి. బ్రేక్ ఫెయిల్ లేదా మద్యం మత్తు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

17. ఐరోపా యుద్ధం కోరుకుంటే మేం సిద్ధమే: రష్యా

ఐరోపా ఖండం యుద్ధం కోరుకుంటే తాము అందుకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌తో వివాదంపై ఒక అంగీకారం కుదరకుండా ఐరోపా నేతలు అడ్డు తగులుతున్నారని ఆయన ఆరోపించారు. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం అంతానికి చర్చలు జరిపేందుకు అమెరికా రాయబారి స్టీవ్‌ విట్కాఫ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అల్లుడు జేర్డ్‌ కుష్నర్‌లు మాస్కోకు వచ్చి తనతో సమావేశమైన తరుణంలో పుతిన్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

18. ఆపరేషన్ సిందూర్ డ్రోన్లు ఇంకా వస్తున్నాయి

అత్యవసర నిబంధనల కింద అదనంగా హెరాన్‌ మార్క్‌-2 డ్రోన్లను కొనుగోలు చేయడానికి భారత్‌ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇజ్రాయెల్‌ రక్షణ పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఆపరేషన్‌ సిందూర్‌ భారత సైనిక దళాలకు ఇవి బాగా ఉపయోగపడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి.

19. బీసీసీఐ షరతుకు అంగీకరించిన కోహ్లీ

అంతర్జాతీయ మ్యాచ్‌లు లేనపుడు ఫిట్‌నెస్, ఫామ్‌ కాపాడుకునేందుకు దేశవాళీ టోర్నీల్లో ఆడాలన్న బీసీసీఐ షరతుకు స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి సరే అన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 24 నుంచి జరిగే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీకి తాను అందుబాటులో ఉంటానని తన రాష్ట్ర జట్టు దిల్లీకి అతను సమాచారం ఇచ్చాడు. ఈ విషయాన్ని ఢిల్లీ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు రోహన్‌ జైట్లీ ధ్రువీకరించారు.

20. శివ నిర్వాణ తో రవితేజ

హిరో రవితేజ సినిమాల విషయంలో జోరు చూపిస్తున్నారు. ఇటీవలే ‘మాస్‌ జాతర’తో ప్రేక్షకుల్ని పలకరించిన ఆయన.. సంక్రాంతి బరిలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో సందడి చేయనున్నారు. ఈలోగానే మరో కొత్త సినిమాని పట్టాలెక్కించేశారు. శివ నిర్వాణ దర్శకత్వంలో ముస్తాబవుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×