భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్‌లో క్రీడారంగంపై జరిగిన ప్యానల్ డిస్కషన్‌లో ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు పాల్గొన్నారు. ప్యానల్ డిస్కషన్‌లో తన సందేశాన్ని ఇచ్చారు. దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలువబోతోందన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో మార్ఫింగ్ చేసి పోస్ట్ చేసిన వైసీపీ పేటీఎం బ్యాచ్‌పై జనసేన నాయకుడు కిరణ్ రాయల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ సోషల్ మీడియా హద్దు దాటుతోందని, ఇష్టానుసారం పోస్టులు పెడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ధర్మారావుపేటలో ఐదేళ్ల బాలుని మిస్సింగ్ ఘటనలో విషాదం నెలకొంది. రాకేష్‌ను ట్రాక్టర్‌పై తీసుకెళ్లే క్రమంలో ప్రమాదవశాత్తు టైరు కింద పడి మృతి చెందాడు. డ్రైవర్ గంపల శంకర్ మృతదేహాన్ని సమీపంలోని సింగరేణి ఓసి- 3 డంపు యార్డ్‌లో పడేశాడు. డంప్ యార్డ్‌లో కూరుకుపోయిన బాలుడి మృతదేహాన్ని జేసీబీ సాయంతో బయటకు తీశారు పోలీసులు.
వికారాబాద్ జిల్లా కోట్పల్లి మండలం బార్వాద్ గ్రామంలోని సర్వే నంబర్ 333లో రైతు ఎర్రోళ్ల పెంటయ్య పంట పొలంలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పత్తితో అంతరపంటగా సాగు చేస్తున్న 108 గంజాయి మొక్కలు, కిలోన్నర ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం బీబీగూడెంలోని బాలాజీ సిమెంట్ బ్రిక్స్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. అధిక ఒత్తిడితో హైడ్రాలిక్ ప్రెషర్ ట్యాంక్ పేలింది. తెల్లవారుజాము కావడంతో, ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణ నష్టం తప్పింది.
తిరుపతి జిల్లా కోట మండలం చిట్టెడు వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దంపతులు బైక్‌పై వెళ్తుండగా ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్య లావణ్య మృతి చెందగా.. భర్తకు తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు 108 ద్వారా క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం గుండుమల కేజీబీవీలో అక్రమాలు, నిర్లక్ష్యంపై ఫిర్యాదులు అందడంతో, కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. భోజన వసతి, శుభ్రతలో తీవ్ర లోపాలను గుర్తించారు. నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ప్రిన్సిపల్ చాందినితో సహా పలువురు సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో మొక్కజొన్న వ్యాపారి పులగం వీర వెంకటరెడ్డి రైతులకు సుమారు కోటిన్నర రూపాయల వరకు బాకీ పడ్డాడు. వ్యాపారి వెంకటరెడ్డి 50 లక్షలకు ఐపీ పెట్టడంతో, రైతులకు కోర్టు నోటీసులు అందాయి. దీంతో నష్టపోయిన రైతులు న్యాయం చేయాలని స్థానిక మంత్రి గుమ్మడి సంధ్యారాణిని కలిసి విజ్ఞప్తి చేశారు.
అనంతపురం జిల్లా గుమ్మఘట్ట పూలకుంట క్రాస్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం అరకొరగా అందించడాన్ని నిరసిస్తూ 169 మంది విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. డీఈఓ మల్లారెడ్డి విచారణ చేపట్టగా, హెచ్ఎం బషీర్ అహ్మద్ విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తారని ఫిర్యాదు అందింది. నివేదికను కలెక్టర్‌కు అందిస్తామని డీఈఓ తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు కూటమి పాలనపై విమర్శలు చేశారు. కూటమి పాలనలో రైతులు కుదేలవుతున్నారని, మార్కెట్ యార్డు ఛైర్మన్ లేకపోవడం దుర్మార్గమని అన్నారు.
ఏపీ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. కొడాలి పిచ్చేశ్వరరావు తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. క్రీడాకారుల వయసు ధ్రువీకరణ, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై తాను పటమట పోలీసులకు ఆధారాలు చూపించినట్లు తెలిపారు.
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్త చోడిపిల్లి ప్రసాద్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మత్స్యకారుల సమావేశం అనంతరం, ప్రసాద్ సోషల్ మీడియా వేదికగా ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ పవన్‌ను విమర్శించారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం బాలికల వసతిగృహం నుంచి పదో తరగతి విద్యార్థిని అదృశ్యమైన ఘటనలో ప్రిన్సిపాల్ డి.శారద, ఉపాధ్యాయినీ లోవ కుమారిలను విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. దీనిని నిరసిస్తూ విద్యార్థినులు తరగతులు బహిష్కరించి, రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని నాదెండ్ల మండలం గణపవరంలో CCI కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తనిఖీ చేశారు. అధిక వర్షాల కారణంగా పత్తిలో 5% క్వాలిటీ డిఫెక్ట్ వచ్చిందని ఆయన తెలిపారు. రైతుల నష్టాన్ని గుర్తించి, నిబంధనలు సడలించాలని ఎమ్మెల్యే కోరగా, కలెక్టర్ కృత్తిక శుక్లా CCI బయ్యర్‌కు తెలిపారు. పత్తిని రిజెక్ట్ చేయకుండా కొనుగోలు చేయాలని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని పుల్లారావు అన్నారు.
పల్నాడు జిల్లా నరసరావుపేట ASI మలమంచి శ్రీనివాసరావుపై బదిలీ వేటు పడింది. ఈ నెల 4న చిలకలూరిపేటలో ‘బ్రేక్ ఇన్‌స్పెక్టర్’ అంటూ ASI కుమారుడు వెంకట నాయుడు లారీని ఆపడం వల్లే ఐదుగురు విద్యార్థులు మృతి చెందారని ఆరోపణలు వచ్చాయి.
ఆగ్నేయాసియా దేశాలైన థాయ్‌లాండ్, కంబోడియాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఇరు దేశాల మధ్య కాల్పులతో ప్రారంభమైన ఘర్షణ.. వైమానిక దాడులకు దారితీసింది. తాజా ఉద్రిక్తతల్లో ఓ థాయ్ సైనికుడు, నలుగురు కంబోడియా పౌరులు మృత్యువాతపడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తొలుత ఉల్లంఘించింది మీరంటే మీరేనంటూ ఇరు దేశాలు పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నాయి.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ సవరణను సవాల్ చేస్తూ, దాని నిర్వహణలో ఎదురవుతోన్న పరిస్థితులపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగింది.
ఇండిగో విమాన కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నట్లు సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్ వెల్లడించారు. లక్షలాది మంది ప్రయాణికులకు వారి రీఫండ్‌లను చెల్లించినట్లు తెలిపారు. చాలావరకు లగేజీలను సైతం వారి ఇళ్లకు డెలివరీ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వంతో పూర్తి సహకారంతో పని చేస్తూనే ఉంటామన్నారు.
శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా, ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కిన ఛాంపియన్ డిసెంబర్ 25న విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా సల్లంగుండాలే.. అనే రెండో పాటను విడుదల చేశారు. చంద్రబోస్ లిరిక్స్ అందించిన ఈ సాంగ్‌ను రితేశ్, మనీషా ఆలపించారు. ఈ సినిమాలోని గిర గిర గింగిరాగిరే.. పాట ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉంది.
ఆసియా కప్ తర్వాత మైదానంలోకి వస్తున్న క్రికెటర్ హార్దిక్ పాండ్యా, తన గర్ల్‌ఫ్రెండ్ మహికా శర్మకు ఎదురైన ఇబ్బందిపై ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించాడు. బాంద్రాలో కొందరు ఫొటోగ్రాఫర్లు గోప్యతకు భంగం కలిగించేలా, ఇబ్బందికరమైన కోణాల్లో ఫొటోలు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు కనీస మర్యాద ఇవ్వాలని హార్దిక్ కోరాడు.