పంచాయతీ ఎన్నికల తొలి విడత పోరు తుది దశకు చేరుకుంది. ఈనెల 11న తొలి విడత పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో ప్రచారం మరింత ఉధృతం చేశారు. బరిలో నిలిచిన అభ్యర్థులు ఇంటింటి ప్రచారం, గుర్తులతో ర్యాలీలతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. నేటితో తొలి విడత ప్రచారానికి ఎండ్ కార్డు పడనుంది. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు 48 గంటల ముందే ఎన్నిక ప్రచారాన్ని ముంగించాల్సి ఉండగా ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యులు ఎన్నికల ప్రచారానికి తెరదించాల్సి ఉంది.
ప్రజలకు కావాల్సిన ప్రభుత్వ సేవలన్నీ సంక్రాంతి నుంచి ఆన్‌లైన్‌లోనే అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. వాట్సాప్ గవర్నెన్స్‌పై విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. రిజిస్ట్రేషన్ల తర్వాత డాక్యుమెంట్లను నేరుగా ఇళ్లకే పంపించాలని సూచించారు. రైతులకు డ్రోన్ల వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు సీఎం చంద్రబాబు.
జిహెచ్ఎంసిలో 27 మున్సిపాలిటీల విలీనం పూర్తయింది. వార్డు రీ ఆర్గనైజేషన్‌పై స్టడీ చేసినట్టు స్పష్టం చేశారు జిహెచ్ఎంసి కమిషనర్. 300 వార్డులను నోటిఫై చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు. జిహెచ్ఎంసి సబ్మిట్ చేసిన రిపోర్టుకు ఆమోదం తెలిపింది ప్రభుత్వం.
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం విక్రయాలపై ఆంక్షలు విధించారు. తొలి విడత ఎన్నికలు డిసెంబర్ 11న జరగనున్నందున..నేటి సాయంత్రం 5 గంటల నుంచి డిసెంబర్ 11న ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఆయా మండలాల్లోని వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు మూతపడనున్నాయి. అలాగే.. డిసెంబర్ 14, 17 తేదీల్లో జరిగే ఎన్నికలకూ ఇదే తరహాలో మూడు విడతల్లో మద్యం నిషేధం అమలవుతుంది.
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 32 మంది డాక్టర్లను బురిడీ కొట్టించారు సైబర్ కేటుగాళ్లు. డాక్టర్లను టార్గెట్ చేసి వంద కోట్లు కొల్లగొట్టారు. వరంగల్‌లో జరిగిన ఈ మోసం సంచలనం సృష్టిస్తోంది. పెట్టుబడులతో భారీ లాభాలంటూ డాక్టర్లపై వల విసిరారు సైబర్ నేరగాళ్లు. ఓ యాప్ ద్వారా.. డబ్బులు పెట్టుబడి పెట్టాలని కోరారు. సైబర్ వలలో చిక్కుకుని.. కోట్లకు కోట్లు సమర్పించుకున్నారు డాక్టర్లు. ఒక్కో డాక్టర్ నుంచి దాదాపు మూడు కోట్ల రూపాయల చొప్పున వసూలు చేశారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో ఐదు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ, చన్వెల్లి పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. శంకర్‌పల్లి మండలంలో.. పర్వేద, కొత్తపల్లి పంచాయతీలు, షాబాద్ మండలంలోని చెర్లగూడ పంచాయతీ ఏకగ్రీవమైంది. ఏకగ్రీవమైన పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారి నియామక పత్రాలు అందజేశారు.
సిద్దిపేట జిల్లాలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేశారు పోలీసులు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్ పల్లి, మిట్టపల్లి సర్పంచ్ అభ్యర్థులపై కేసులు నమోదు చేశారు. ఓటర్లకు పంపిణీ చేయడానికి సిద్దంగా ఉంచిన 68 మద్యం బాటిల్స్, 39 మోటార్ సైకిల్స్ స్వాధీనం చేసుకున్నారు. 44 మందిపై కేసు నమోదు చేశారు త్రీ టౌన్ పోలీసులు.
సంగారెడ్డి జిల్లా మల్కాపూర్‌లో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తన భార్య గుండెపోటుతో చనిపోయిందంటూ.. మృతదేహాన్ని నారాయణఖేడ్ మండలంలోని మాద్వార్‌కు తీసుకెళ్లి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాడు భర్త శ్రీనివాస్. మృతురాలి మెడపై గాయాలు గమనించి అంత్యక్రియలు నిలిపివేశారు మృతురాలి బంధువులు. భర్త శ్రీనివాసే హత్యచేసి గుండెపోటుతో చనిపోయిందంటూ నాటకమాడుతున్నాడని పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కడప రోడ్డులోని ఓ ఇంటీరియర్ షాప్ లో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరగడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
సినీ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌కు పుదుచ్చేరిలో ఇవాళ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇటీవల కరూర్ తొక్కిసలాట ఘటన జరిగిన నేపథ్యంలో కొన్ని షరతులతో ఈ సభకు అనుమతి లభించింది. నేడు ఉప్పాలంలోని ఎక్స్‌పో గ్రౌండ్‌లో సభ జరగనుంది. అయితే పోలీసులు విధించిన షరతుల ప్రకారం విజయ్ సభా వేదికపై నుంచి కాకుండా ప్రచార రథంపై నుంచే మాట్లాడనున్నారు. సభకు 5 వేల మందికి మించి హాజరు కాకూడదని పోలీసులు షరతు విధించారు.
పంజాబ్ కాంగ్రెస్ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ క్రికెటర్, కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ సతీమణి నవజ్యోత్ కౌర్ సిద్ధూను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ ప్రకటించారు. పదే పదే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తాజాగా ఈ చర్యలు తీసుకుంది.
కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు ఎంపీలు బ్రిజ్‌లాల్, బాలగోస్వామి. ఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. ఇటీవల పార్లమెంటు సమావేశాలకు హాజరైన రేణుక.. పార్లమెంట్‌కు తనతో పాటు కారులో శునకాన్ని తీసుకొచ్చారు. శునకం గురించి మీడియా ఆమెని ప్రశ్నించింది. రోడ్డుపై యాక్సిడెంట్ జరిగితే డాగ్‌ని తీసుకొచ్చానని అన్నారు. అంతటితో ఆగకుండా.. ఇది కరవదని, కరిచే వాళ్లు లోపల ఉన్నారంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. రేణుక వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ ఎంపీలు.. రేణుకపై ప్రివిలేజ్ నోటీసులకు సిద్ధం అయ్యారు.
విమాన సర్వీసుల అంతరాయంపై వివరణ ఇవ్వాల్సిందిగా DGCA జారీ చేసిన షోకాజ్ నోటీసుకు విమానయాన సంస్థ ఇండిగో స్పందించింది. తాము చేసిన పొరపాటుకు క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపింది. ఈ మొత్తం గందరగోళానికి గల కచ్చితమైన కారణాలను గుర్తించేందుకు మరికొంత సమయం కావాలని కోరింది ఇండిగో. ప్రస్తుతానికి కొన్ని ప్రాథమిక కారణాలను DGCA ముందుంచింది. సీఈవో, సీఓఓ సంతకాలతో కూడిన ఈ వివరణను డీజీసీఏకు ఇండిగో సమర్పించింది.
వందేమాతర గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. వందేమాతరం 50 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పుడు బ్రిటీష్ బానిస పాలనలో బతికాం.. 100 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పుడు ఎమర్జెన్సీ పాలనలో బతికాం.. అదే 150 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రస్తుత కాలంలో పునర్వైభవం దిశగా ముందుకు సాగుతున్నామని అన్నారు. దీంతో మోడీ వ్యాఖ్యలపై సభలో ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి.
ఇండిగో సంక్షోభంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్‌పై పూర్తిస్థాయిలో విచారించేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఇండిగో సంక్షోభంపై అత్యవసరంగా విచారించాలంటూ పిటిషన్ దాఖలైంది. అత్యవసరంగా విచారించలేమని సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం దానిపై చర్యలు తీసుకుంటోందని.. ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. వందేమాతరం 150వ వార్షికోత్సవాలను పురస్కరించుకొని ఆ గేయంపై నిన్న లోక్‌సభలో ప్రత్యేక చర్చ జరిగింది. ఇవాళ రాజ్యసభలో వందేమాతరంపై చర్చను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభిస్తారు. ఆయన తర్వాత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రసంగిస్తారు.
జపాన్‌ను భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.6గా నమోదైంది. శక్తివంతమైన ఈ ప్రకంపనల కారణంగా ఉత్తర ప్రాంతంలోని ఆమోరి, హొక్కైడో తీరంలో 3 మీటర్ల వరకు సునామీ అలలు విరుచుకుపడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ కొత్త సినిమా షూటింగ్‌లో తీవ్ర గాయపడ్డారు. కొత్త సినిమా షూటింగ్‌లో భాగంగా నవంబర్ 25న యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా ఆయన కాలికి గాయమైనట్లు తెలుస్తోంది. మేడ్చల్ సమీపంలో జరుగుతున్న షూటింగ్‌లో రాజశేఖర్‌కు కుడి కాలి మడమ దగ్గర బలమైన ఇంజ్యూరీ అయిందని ఆయన సన్నిహితులు వెల్లడించారు.
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ గెలిచిన టీమిండియా..అదే ఊపులో టీ20 సిరీస్‌ను దక్కించుకోవాలని సిద్ధమైంది. ఈ క్రమంలో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి టీ20 కటక్ వేదికగా జరగనుంది. ఆసియా కప్ తో పాటు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ గెలుచుకొని టీమిండియా కాన్ఫిడెంట్ గా బరిలోకి దిగుతోంది. మరోవైపు సౌతాఫ్రికా టీమిండియాకు సొంతగడ్డపై షాక్ ఇవ్వాలని చూస్తోంది.
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వ్యాఖ్యలపై మాజీ సీఎం కేజ్రీవాల్ ఫైరయ్యారు. ఢిల్లీలో వాయుకాలుష్యం ఉన్నచోట వాటర్ స్ప్రే చేస్తున్నామని.. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ టెంపరేచర్ లాంటిదని సీఎం చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఎయిర్ మానిటర్లు లేకుండా చేసిన కాలుష్య డేటాను ప్రభుత్వం దాస్తుందని ఆరోపించారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉష్ణోగ్రతగా ఎప్పుడు మారిందని సెటైర్ వేస్తూ ట్వీట్ చేశారు.