E-Paper
Advertisement

Top 20 New: సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ.. , ప్రిన్సిపాల్ అరాచకం.. చితకబాదిన తల్లిదండ్రులు

Top 20 New: సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ.. , ప్రిన్సిపాల్ అరాచకం.. చితకబాదిన తల్లిదండ్రులు

1. సీఎం బిజీ షెడ్యూల్

సీఎం రేవంత్ రెడ్డి ఈ నెలాఖరులో బిజీ షెడ్యూల్‌తో గడపనున్నారు. ఈ నెల 18, 19 తేదీల్లో మేడారంలో పర్యటించి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం, నేరుగా దావోస్, అమెరికా పర్యటనలకు బయలుదేరనున్నారు. ఈ నెల 19 నుంచి ఫిబ్రవరి 1 వరకు సాగే ఈ విదేశీ పర్యటనలో భాగంగా పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయి రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా చర్చలు జరపనున్నారు.

2. సీఎం చంద్రబాబు  సమీక్ష

కోనసీమ జిల్లా ఇరుసుమండ బ్లోఅవుట్ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మంటలను అదుపు చేసేందుకు అవసరమైతే అంతర్జాతీయ నిపుణుల సాయం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు అండగా ఉండాలని, ముఖ్యంగా వందలాదిగా కాలిపోయిన కొబ్బరి చెట్లకు తగిన పరిహారం అందించాలని సూచించారు. హోంమంత్రి అనిత ప్రస్తుత భద్రతా చర్యలను సీఎంకు వివరించారు.

3. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ.. కిషన్ రెడ్డి

వరంగల్ కోట భూములను కాపాడాలని కోరుతూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. కోట పరిసరాల్లో ఆక్రమణలను తొలగించి, ఆ భూములను ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆస్తులుగా గుర్తించాలని కోరారు. ఆక్రమణల వల్ల చారిత్రక వారసత్వానికి ముప్పు కలుగుతోందని, రెవెన్యూ రికార్డులను సవరించి ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

4. అంతా సినిమా సెట్లే

రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై మాజీ సీఎం జగన్ తీరును మంత్రి నిమ్మల రామానాయుడు తప్పుబట్టారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అంతా గ్రాఫిక్స్, సినిమా సెట్లే తప్ప వాస్తవ అభివృద్ధి లేదని విమర్శించారు. కృష్ణా జలాలను రాయలసీమకు అందించిన ఘనత ఎన్టీఆర్, చంద్రబాబులదేనని.. జగన్ ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు.

5. కేసును చేధించిన పోలీసులు

మంచిర్యాల జిల్లా సుబ్బరాంపల్లి ఇటుక బట్టీలో జరిగిన వలస కూలీ జితేందర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. పని విషయంలో తలెత్తిన గొడవతో ముగ్గురు తోటి కూలీలు కలిసి జితేందర్‌ను కొట్టి, టవల్‌తో ఉరివేసి చంపినట్లు గుర్తించారు. నిందితులు రాజేందర్ భీమల్, శుభ్రత్ కుమార్, ధరమ్ సింగ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

6. కబడ్డీ పోటీలు ప్రారంభం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏడూళ్ల బయ్యారంలో ఈనెల 7 నుంచి జాతీయ స్థాయి అండర్-17 బాలుర కబడ్డీ పోటీలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో తొలిసారి జరుగుతున్న ఈ వేడుకలో 33 రాష్ట్రాల నుంచి టీమ్స్ పాల్గొంటున్నాయి. క్రీడాకారులకు ఐలాపురం ఆశ్రమ పాఠశాలలో వసతి కల్పించగా, మైదానంలో ఎల్ఈడీ స్క్రీన్లు, గ్యాలరీ పనులు తుది దశకు చేరుకున్నాయి.

7.  ఎన్‌ఎస్‌పీ కెనాల్‌లో జారిపడి మహిళ మృతి

ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం తనికెళ్ల గ్రామానికి చెందిన పొట్లపల్లి పార్వతి అనే మహిళ ఎన్‌ఎస్‌పీ కెనాల్‌లో జారిపడి మృతి చెందింది. మతిస్థిమితం సరిగా లేని ఆమె ప్రమాదవశాత్తు కాలువలో పడి కొట్టుకుపోగా.. మృతదేహం చింతకాని మండలం కోమట్లగూడెం లాకుల వద్ద లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

8. వైభవంగా శ్రీ దత్త అనఘా వ్రతం

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని కొమరం భీమ్ చౌరస్తా వద్ద గల మామిడి తోటలో శ్రీ దత్త అనఘా వ్రతం వైభవంగా జరిగింది. ధనుర్మాసం, సంకటహర చతుర్థి పుణ్యదినం సందర్భంగా 51 మంది మహిళలు సామూహికంగా ఈ వ్రతాన్ని ఆచరించారు. ఈ విశిష్ట రోజున వ్రతం చేయడం వల్ల పాపాలు తొలగి, కోరికలు నెరవేరుతాయని ఆర్యవైశ్య భక్తులు విశ్వసిస్తున్నారు.

9. ప్రిన్సిపాల్ అరాచకం .. చితకబాదిన తల్లిదండ్రులు

మేడ్చల్ జిల్లా చంద్రగిరి నగర్‌లోని నిస్సీ స్వాతి స్కూల్ ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ అరాచకం వెలుగులోకి వచ్చింది. పదో తరగతి విద్యార్థినితో అతను అసభ్యంగా ప్రవర్తించడంతో, ఆగ్రహించిన తల్లిదండ్రులు స్కూల్‌పై దాడి చేసి ప్రిన్సిపాల్‌ను చితకబాదారు. పాఠశాల ఫర్నీచర్‌ను ధ్వంసం చేయగా.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

10. పాఠశాల వద్ద ఉద్రిక్తత

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లోని కృష్ణవేణి ప్రైవేట్ పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఫీజులు చెల్లించలేదని విద్యార్థులను బస్సుల నుంచి దింపేయడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఆర్థిక లావాదేవీల కోసం పిల్లలను ఇబ్బంది పెట్టడంపై మండిపడుతూ, బాధ్యులైన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు.

11. జీతాలు అందక ఆందోళన

మంచిర్యాల జిల్లా చెన్నూరు కోర్టు హౌస్‌కీపింగ్ సిబ్బంది ఎనిమిది నెలలుగా జీతాలు అందక ఆందోళన చేపట్టారు. ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి వద్ద రూ. 95,000 వసూలు చేసిన సాయి తేజ వర్మ ఏజెన్సీ ప్రతినిధులపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు తక్షణమే బకాయిలు చెల్లించి, వసూలు చేసిన సొమ్మును తిరిగి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

12. కఠిన చర్యలు

తిరుపతిలో జరిగిన తుక్కు స్కామ్ నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ జోన్ టాక్స్ కమిషనర్ ఆనంద కుమార్ హెచ్చరించారు. 40 లక్షల రూపాయల ఆదాయం దాటిన వారు తప్పనిసరిగా జీఎస్టీ చెల్లించాలని, పన్ను ఎగవేతదారులను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జీఎస్టీపై అవగాహన కల్పిస్తూనే, పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచి దేశాభివృద్ధికి సహకరిస్తామన్నారు.

13. అన్నదమ్ముల మధ్య ఘర్షణ..

పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం అచ్చంపేటలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ రక్తపాతానికి దారితీసింది. మందలించినందుకు కోపంతో తమ్ముడు సైదా వలిపై అన్న భాష గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో సైదా వలి తలకు, ముక్కుకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

14. అధికారుల సర్వే

కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని వైసీపీ జిల్లా కార్యాలయ భవనానికి మున్సిపల్ అధికారులు కొలతలు వేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు భవన అనుమతులు, ప్లాన్ ఉల్లంఘనలు, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ అంశాలను పరిశీలించేందుకు ఈ సర్వే చేపట్టినట్లు కమిషనర్ బాపిరాజు తెలిపారు. మాజీ మంత్రి పేర్ని నాని సమక్షంలోనే టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఈ కొలతలు నిర్వహించారు.

15. కీలక పాత్ర

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గోవాలో ICGS సముద్ర ప్రతాప్ నౌకను ప్రారంభించారు. గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన తొలి కాలుష్య నియంత్రణ నౌక ఇది. భారత రక్షణ రంగ శక్తికి ఇది నిదర్శనమని, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడంలో, సముద్ర సవాళ్లను ఎదుర్కోవడంలో ఈ నౌక కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.

16. విచిత్రమైన చోరీ

రాజస్థాన్‌లోని కోటా నగరం బోర్ఖేడా ప్రాంతంలో ఒక విచిత్రమైన చోరీ ఉదంతం చోటుచేసుకుంది. రాజస్థాన్ కోట నుంచి ఒక కుటుంబం ఖాటు శ్యామ్ జీ దర్శనానికి వెళ్ళింది. దొంగలు ఇంట్లోకి వెనుక నుంచి ప్రవేశించారు. ఒక దొంగ ఎగ్జాస్ట్ హోల్‌లో చిక్కుకున్నాడు. కుటుంబం తిరిగి వచ్చి పోలీసులకు ఫోన్ చేయగా.. వారు వచ్చి దొంగను ఎగ్జాస్ట్ హోల్ నుంచి బయటకు తీశారు. నిందితుడు పవన్ ఒక పోలీసు అధికారి కారు నడుపుతున్నాడు.

17. ట్రంప్ ప్రకటన

వెనిజుయెలాలో ప్రస్తుతానికి ఎన్నికలు నిర్వహించబోమని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. నికోలస్ మదురో బందీ అయిన తర్వాత, ఆ దేశ బాధ్యతను తానే చూసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. ముందుగా మౌలిక సదుపాయాలు, ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించి, అమెరికా ఆయిల్ కంపెనీల ద్వారా పెట్టుబడులు పెడతామని తెలిపారు. ఈ ప్రక్రియకు దాదాపు 18 నెలల సమయం పడుతుందని ట్రంప్ వెల్లడించారు.

18. సీబీఐ నోటీసులు

కరూర్ తొక్కిసలాట ఘటనపై నటుడు, టీవీకే అధినేత విజయ్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 27న జరిగిన ఈ విషాదంలో 41 మంది మృతి చెందగా.. కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణ చేపట్టింది. ఈ నెల 12న ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి హాజరుకావాలని ఆదేశించింది. సిట్ విచారణను సవాల్ చేస్తూ టీవీకే ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

19. మెరుపు ఇన్నింగ్స్‌

విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. పొగమంచు కారణంగా 33 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో ముంబయి 9 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ ఫామ్ చూస్తుంటే న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు అతని ఫిట్‌నెస్ లైన్ క్లియర్ అయినట్లే కనిపిస్తోంది.

20. సెన్సార్ పూర్తి

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న హారర్ ఫాంటసీ ది రాజాసాబ్ సెన్సార్ సర్టిఫికెట్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా రన్‌టైమ్ 3 గంటల 9 నిమిషాలుగా ఖరారైంది. ఇందులో తల నరికే సన్నివేశంతో పాటు కొన్ని హింసాత్మక దృశ్యాలకు సెన్సార్ బోర్డు కట్స్ చెప్పింది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 9న విడుదల కానుంది.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×