E-Paper
Advertisement

Top 20 News Today: ఇంద్రకీలాద్రిపై అధికారుల నిర్లక్ష్యం.. హింసాత్మకంగా మారుతున్న ఇరాన్..

Top 20 News Today: ఇంద్రకీలాద్రిపై అధికారుల నిర్లక్ష్యం.. హింసాత్మకంగా మారుతున్న ఇరాన్..

1. వ్యవసాయాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో వ్యవసాయాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో ఎరువుల కొరత లేకుండా చూడాలని, రైతులు క్యూలైన్లలో నిలబడే పరిస్థితి రాకూడదని ఆదేశించారు. ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని, నర్మేట ఫ్యాక్టరీని త్వరలోనే ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. ప్రతి ఇంటికీ పాడి గేదె ఉండేలా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని, పశువుల టీకాలు, సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

2. శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచ్

శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్మరి బస్తీలో చైన్ స్నాచింగ్ జరిగింది. జయమ్మ అనే మహిళ తన ఇంటి ముందు వాకిలి ఊడుస్తుండగా గుర్తుతెలియని దుండగుడు ఒక్కసారిగా ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు పుస్తెల తాడును తెంపాడు. ఆ పెనుగులాటలో తాడు అక్కడే పడిపోగా, దానికి ఉన్న పుస్తెలను మాత్రం ఎత్తుకెళ్లి పరారయ్యాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

3. ఇంద్రకీలాద్రిపై మరోసారి అధికారుల నిర్లక్ష్యం

ఇంద్రకీలాద్రిపై మరోసారి అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఉచిత ప్రసాద వితరణ కేంద్రం దగ్గర భక్తులకు కరెంటు షాక్ కొట్టింది. భక్తులకు కరెంటు షాక్ కొట్టడంతో.. ప్రసాదం పంపిణీ నిలిపి వేశారు అధికారులు.

4. మాజీ మంత్రి కాకాణి హౌస్ అరెస్ట్

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. కాకాణితో పాటు పలువురు ఇంఛార్జ్‌లను హౌస్ అరెస్ట్ చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వివాదం నేపధ్యంలో.. సోమశిల ప్రాజెక్టు సందర్శనకు పిలుపునిచ్చింది వైసీపీ. పోలీసులు మాత్రం సందర్శనకు అనుమతి లేదంటున్నారు. సోమశిల జలాశయం దగ్గర కూడా పోలీసులు భారీగా మోహరించారు.

5. రహదారులపై మొదలైన సంక్రాంతి సందడి..

ఎన్టీఆర్ జిల్లా నందిగామ జాతీయ రహదారిపై సంక్రాంతి సందడి మొదలైంది. సెలవులు ప్రారంభం కావడంతో పట్టణాల నుంచి ప్రజలు పల్లెలకు తరలుతుండటంతో రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద రద్దీ విపరీతంగా పెరిగింది.

6. కలకలం రేపుతున్న సెల్ఫీ సూసైడ్!

విజయనగరం జిల్లాలో కలకలం రేపుతోంది తాటిపూడి మత్స్యశాఖ అధికారి సంతోష్ సెల్ఫీ వీడియో. రైవాడ జలాశయంలో చేప పిల్లలు వేస్తే మత్స్యకారులు తనను కొడుతున్నారంటూ సెల్ఫీ వీడియో తీసారు సంతోష్. ఇలా దాడి చేయడం రెండోసారి అంటూ వాపోయాడు. మత్స్యశాఖ అడిషనల్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డికి.. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.

7. ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో ఒకరు మృతి

పల్నాడు జిల్లా వినుకొండలోని చెక్కవాగు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీ కొని ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బొల్లాపల్లి మండలం వడ్డెంగుంట గ్రామానికి చెందిన వేముల అశోక్‌గా గుర్తించారు. బైక్‌పై ఇద్దరు యువకులు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బైక్ నడిపే వ్యక్తి మృతి చెందగా..వెనుక కూర్చున్న యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

8. ఆదివాసీలకు నిత్యావసరాల పంపిణీ..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బురుగుపాడులో శ్రీ త్రిదండి దేవనాథ్ రామానుజ జీయర్ స్వామికి ఆదివాసీలు కొమ్ము నృత్యాలతో ఘనస్వాగతం పలికారు. సంక్రాంతి సందర్భంగా వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఆదివాసీలకు రూ. 1.50 లక్షల విలువైన నిత్యావసరాలు, దుస్తులను జీయర్ స్వామి పంపిణీ చేశారు. కల్మషం లేని ఆదివాసీల ప్రేమ ఎనలేనిదని, సమాజ సేవలో వికాస తరంగిణి కృషి స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు.

9. కరీంనగర్ జిల్లా కోతుల బెడదకు వినూత్న ప్రయత్నం

తెలంగాణ పంచాయతీ ఎన్నికల హామీ మేరకు కరీంనగర్ జిల్లా బేతిగల్ సర్పంచ్ సరమ్మ కోతుల సమస్య పరిష్కారానికి నడుం బిగించారు. గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉండటంతో, సుమారు 30 వేల రూపాయలు వెచ్చించి ఒక కొండెంగను తీసుకువచ్చారు. సర్పంచ్, వార్డు సభ్యులు కలిసి ఆ కొండెంగను గ్రామంలో తిప్పుతూ కోతులను తరిమివేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే కాకుండా, వినూత్న పద్ధతిలో సమస్యను పరిష్కరిస్తుండటం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

10. సార్థ సప్త శనేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు.. పోటెత్తిన భక్తుల

నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం నందివడ్డేమాన్ గ్రామంలో శనివారం పర్వదినాన్ని పురస్కరించుకుని సార్థ సప్త శనేశ్వర స్వామికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శని దోష నివారణ కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. తైలాభిషేకం నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు.

11. వాహనాల రద్దీని పరిశీలించిన ఎస్పీ నరసింహ

సూర్యాపేట ఎఫ్‌సీఐ గోడౌన్ వద్ద NH-65 పై వాహనాల రద్దీని జిల్లా ఎస్పీ నరసింహ స్వయంగా పరిశీలించారు. హైదరాబాద్ – విజయవాడ మార్గంలో వాహనాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. జంక్షన్ల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.

12. భక్తులతో కిక్కిరిసిన వాడపల్లి ఆలయం

కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం భక్తజనంతో కిక్కిరిసింది. తెల్లవారుజాము నుంచే స్వామివారికి మేలుకొలుపు, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఐశ్వర్య హోమం, నిత్య కళ్యాణం వంటి కార్యక్రమాలను అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఏడు వారాల నోము పూర్తి చేసుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

13. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు నేతలు

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని సినీ నటుడు తనికెళ్ల భరణి, మాజీ మంత్రి కర్మూరి వేంకట నాగేశ్వర రావు, మాజీ MLA పెద్దారెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, తెలంగాణ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు కుటుంబ సభ్యులతో కలసి వేరువేరుగా దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి, శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

14. హన్మకొండ జిల్లా మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు..

హన్మకొండ జిల్లా ఐనవోలులో మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 13 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్, దేవాదాయ శాఖ జె.సి. రామకృష్ణ ఏర్పాట్లను పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు తాగునీరు, రవాణా, క్యూలైన్లలో ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

15. దివ్యాంగురాలు కవిత హత్య కేసులో నిందితుడు అరెస్ట్

చిత్తూరులో దివ్యాంగురాలు కవిత హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కవితను దివ్యాంగుల క్రికెటర్ గణేష్ హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. కొన్నాళ్లుగా గణేష్, కవిత మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. డిసెంబర్ 31 నుంచి కనిపించకుండా పోయిన కవిత..గణేష్‌తో వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు లాస్ట్ మెస్సేజ్ పంపింది. దీని ద్వారా విచారణ చేపట్టిన చిత్తూరు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

16. టోల్ ఛార్జీల మినహాయింపు- టీడీపీ ఎంపీ సానా సతీష్

సంక్రాంతి వేళ 65వ నెంబర్‌ జాతీయ రహదారిపై రద్దీని నివారించేందుకు టోల్ ఛార్జీలను మినహాయించాలని విజ్ఞప్తి చేశారు టీడీపీ ఎంపీ సానా సతీష్. ఇదే విషయంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేశారాయన. ప్రయాణికులకు ఇలా చేయడం ద్వారా ఎంతో సమయం ఆదా అవుతుందన్నారు సానా సతీష్.

17. భారత్‌లోకి చైనా మహిళ..

భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ చైనా మహిళను అరెస్టు చేశారు పోలీసులు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలోని ఇండో-నేపాల్ సరిహద్దు వద్ద తచ్చాడుతున్న చైనా మహిళను సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద సరైన వీసా, పాస్‌పోర్ట్ పత్రాలు లేకపోవడంతో పోలీసులకు అప్పగించారు. ఆమె భారత్‌కు ఎందుకు వచ్చిందనే విషయంపై విచారణ కొనసాగుతోందన్నారు పోలీసులు.

18. హింసాత్మకంగా మారుతున్న ఇరాన్..

ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతోన్న నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. టెహ్రాన్‌లోని ఆరు ఆసుపత్రుల్లోనే ఇప్పటివరకు 217 మంది ప్రాణాలు కోల్పోయారని ఓ వైద్యుడు టైమ్ మ్యాగజైన్‌కు వెల్లడించారు. భద్రతా దళాలు మెషీన్ గన్లతో జరిపిన కాల్పుల్లో చనిపోయిన వారిలో ఎక్కువ మంది యువకులే ఉన్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చని తెలుస్తోంది.

19. బాబు వారసుడొచ్చాడు..

మహేష్ బాబు సోదరుడు రమేష్ తనయుడు జయకృష్ణ హీరోగా నటిస్తోన్న మూవీ శ్రీనివాస మంగాపురం. తాజాగా ఈ సినిమా నుంచి జయకృష్ణ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశాడు మహేష్ బాబు. ఈ సందర్భంగా ఆయన.. జయకృష్ణకు, మేకర్స్‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు. దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి రాషా తడాని కథానాయికగా నటిస్తుండగా.. GV ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.

20. మొదటి మ్యాచ్‌లో శుభారంభం

మహిళల ప్రిమియర్ లీగ్ మొదటి మ్యాచ్‌లో శుభారంభం చేసింది ఆర్సీబీ. ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. 155 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. నదైన్ డి క్లార్క్63 పరుగులతో అద్భుత ప్రదర్శన కనబరిచింది. అరుంధతి రెడ్డి 20, గ్రేస్ హారిస్ 25, స్మృతి మంధాన 18 రన్స్ చేశారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×