సంక్రాంతి సందర్భంగా కోడిపందేల నిర్వహణ నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జంతు హింస నిరోధక చట్టం-1960, ఏపీ జూద నిరోధక చట్టాలను కఠినంగా అమలుచేయాలని గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అన్ని జిల్లాల కలెక్టర్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ముదనష్టపు మాంజా వల్ల మరో గొంతు తెగింది. మేడ్చల్ జిల్లా ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. మాంజా కారణంగా తీవ్రంగా గాయపడ్డాడు ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఉప్పల్ మెట్రో స్టేషన్ సమీపంలో బైక్‌పై వెళ్తున్నాడు సాయి వర్ధన్ రెడ్డి. మధ్యలో చైనా మంజా అడ్డు రావడంతో మెడపై లోతైన గాయం అయ్యింది. సాయి వర్దన్ ఘటనలో తీవ్రంగా గాయపడటంతో.. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందన్నారు వైద్యులు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. సంక్రాంతి వరుస సెలవుల హైదరాబాద్ నుంచి రాజమండ్రి, భీమవరం, వైజాగ్ మీదుగా వెల్తున్న వారు మార్గం మధ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దీంతో అన్ని క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి.
సంక్రాంతి పండుగకు ఊరెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు. ఇంట్లో విలువైన వస్తువులు, నగలను భద్రపరుచుకోవాలని, సోషల్ మీడియాలో ప్రయాణ వివరాలను పంచుకోవద్దని హెచ్చరించారు. గతంలో దొంగతనాలు జరిగిన ప్రాంతాలను ‘హాట్‌స్పాట్’లుగా గుర్తించి, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. దొంగలు నిరంతరం గమనిస్తూ ఉంటారని, అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న AEO అభ్యర్థులు పరీక్ష రాసే విధానంపై అనుమానంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పరీక్ష రాసిన అభ్యర్థిని విచారిస్తే లీకేజీ తతంగం మొత్తం బయటపడింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీనటులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ నటి అరుణ, నటుడు బాబీ సింహ, చిత్ర దర్శకుడు గోపీచంద్ మలినేని, డాన్స్ మాస్టర్ బాబా భాస్కర్‌లు వేరువేరుగా కుటుంబసభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుపతిలో స్వామి వివేకానంద 168వ జయంతి పురస్కరించుకుని బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో 5 కిలోమీటర్ల యూత్ మారథాన్ ఘనంగా జరిగింది. ఎయిర్ బైపాస్ రోడ్డు నుంచి మెడికల్ కాలేజ్ వరకు సాగిన ఈ పరుగులో శ్రీరమ్యానంద భారతీ స్వామిజీ, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, క్రీడాకారిణి నైనా జైస్వాల్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ రద్దీతో హైదరాబాద్-విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారి వాహనాలతో నిండిపోయింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట సమీపంలోని చిల్లకల్లు టోల్ గేట్ వద్ద వాహనాలు బారులు తీరాయి. పంతంగి, కోర్లపహాడ్ వద్ద కూడా రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రయాణం నెమ్మదిగా సాగుతోంది.
మచిలీపట్నంలో వీర్నాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 3K రన్ ఉత్సాహంగా సాగింది. జడ్పీ సెంటర్ నుంచి కోనేరు సెంటర్ వరకు జరిగిన ఈ పరుగును ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. ముగింపు వేడుకల్లో ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు విజేతలకు బహుమతులు అందజేశారు. సంక్రాంతి క్రీడా స్ఫూర్తిని నింపిన ఈ కార్యక్రమాన్ని అతిథులు అభినందించారు.
హనుమకొండ జిల్లా శాయంపేట, ఆరేపల్లి గ్రామాల్లో సుమారు 200 కుక్కలను గ్రామ పంచాయతీ సిబ్బంది హతమార్చడం తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనపై స్వచ్ఛంద సంస్థల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేవలం వ్యాధిబారిన పడిన కుక్కలను మాత్రమే చంపామని సర్పంచ్‌లు చెబుతున్నారు. పశువైద్యాధికారులు పాతిపెట్టిన కుక్కల శవాలను వెలికితీసి, నమూనాలను సేకరించారు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనాలను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అడ్డుకున్నారు. తెలంగాణ నుంచి కడప జిల్లా పులివెందులకు ఎటువంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న కంటైనర్లు, లారీలను ఆమె పట్టుకున్నారు. ఒక్కో వాహనంలో సుమారు 70కి పైగా గోవులను అత్యంత దారుణంగా కుక్కి తరలిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్న వ్యక్తుల వివరాలను పోలీసులు బయట పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
విజయవాడలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బిజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన యూత్ మారథాన్ ఘనంగా జరిగింది. రాఘవయ్య పార్క్ నుంచి ప్రారంభమైన ఈ పరుగులో ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పాల్గొని.. వివేకానంద విగ్రహానికి నివాళులర్పించారు. యువత వివేకానందుని విలువలను ఆదర్శంగా తీసుకుని, భారతీయ సంస్కృతిని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.
ములుగు జిల్లాలోని గట్టమ్మ తల్లి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో మేడారం వెళ్లే భక్తులు, ఆనవాయితీ ప్రకారం ముందుగా గట్టమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో మార్మోగుతున్నాయి. మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వెళ్లే ప్రయాణికుల రద్దీతో రహదారులన్నీ భక్తజనంతో సందడిగా మారాయి.
నంద్యాల జిల్లా తూర్పు ప్రాతకోటలోని గంగా–పార్వతి నాగేశ్వర స్వామి ఆలయంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పెళ్లికొడుకుగా స్వామివారి శోభాయాత్ర, 14న కళ్యాణం, 15న విశేషమైన రథోత్సవం జరగనున్నాయి. కుజదోష నివారణ పూజల కోసం వేలాదిగా భక్తులు తరలివస్తుండటంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో మార్మోగుతోంది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో జాతీయ స్థాయి పడవ పందాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, కలెక్టర్ మహేష్ కుమార్ ఉత్సవాలను ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో కేరళ తరహా డ్రాగన్ బోట్ పోటీలు, స్విమ్మింగ్, రంగోలి, కైట్ ఫెస్టివల్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఢిల్లీ రవాణా వ్యవస్థను మెరుగుపరుస్తూ సీఎం రేఖా గుప్తా 3,330 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నారు. వీటిలోని 7 మీటర్ల మినీ బస్సులు ఇరుకైన వీధుల్లోనూ ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. కాలుష్యాన్ని తగ్గించి, మెరుగైన కనెక్టివిటీని అందించడమే ఈ ప్రతిష్టాత్మక నిర్ణయం యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కుటత్తిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పాలక్కాడ్‌లోని ఒక హోటల్ నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. ఇటీవల ఓ యువతి అతడిపై అత్యాచార ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ అరెస్టు చోటుచేసుకుంది.
నోబెల్ శాంతి బహుమతిపై డొనాల్డ్ ట్రంప్ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. తనకంటే అర్హులు ఎవరూ లేరని, ఒబామాకు ఏమీ చేయకపోయినా పురస్కారం దక్కిందని విమర్శించారు. ఎనిమిది పెద్ద యుద్ధాలను, ముఖ్యంగా భారత్-పాకిస్థాన్ మధ్య పెను ఘర్షణను ఆపి లక్షలాది ప్రాణాలు కాపాడానని, తన సేవలను గుర్తించలేదని ఆయన వైట్‌హౌస్ సమావేశంలో వాపోయారు.
మన శంకరవరప్రసాద్ గారు మూవీ ప్రమోషన్స్‌లో దర్శకుడు అనిల్ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టార్ హీరోలైన బాలకృష్ణ, వెంకటేష్, చిరంజీవిలతో సినిమా చేశానని అన్నాడు. మరో స్టార్ నాగార్జునతో మూవీ ఎప్పుడంటూ అందరూ అడుగుతున్నారని, తనకు ఆయనతో పనిచేయాలని ఉందని తెలిపాడు. నాగ్‌తో మూవీ చేస్తే నలుగురు అగ్ర హీరోలతో వర్క్ చేసిన ఈతరం దర్శకుడిగా రికార్డు నాదే అవుతుందన్నారు అనిల్.
టీమ్ ఇండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్.. శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ లాంటి యువ క్రికెటర్లను తీర్చిదిద్దడంలో ఎంత కీలక పాత్ర పోషించాడు. వీరిలో శుభ్‌మన్ భారత జట్టుకు టెస్టులు, వన్డేల్లో కెప్టెన్‌గా ఎదిగాడు. అభిషేక్ శర్మ టీ20 జట్టులో ఓపెనర్‌గా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పుడు సంజు శాంసన్ సైతం యువీ నుంచి చిట్కాలు తీసుకుంటుండడం విశేషం. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్, ఆ తర్వాత జరిగే టీ20 ప్రపంచకప్‌నకు సంజు సన్నద్ధమవుతున్నాడు.