E-Paper
Advertisement

Top 20 News Today: ఈ ప్రభుత్వం పిరికిది.. ఏబీ వెంకటేశ్వరరావు, నింగిలోకి దూసుకెళ్ళేందుకు సిద్ధమైన మరో ఇస్రో

Top 20 News Today: ఈ ప్రభుత్వం పిరికిది.. ఏబీ వెంకటేశ్వరరావు, నింగిలోకి దూసుకెళ్ళేందుకు సిద్ధమైన మరో ఇస్రో

1. రేట్లు పెంచడం దారుణం

సినీ మాఫియా, ప్రభుత్వం కలిసి ప్రజలను లూఠీ చేస్తున్నారని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ నారాయణ తీవ్రంగా విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో మాట్లాడుతూ.. సిగ్గు లేకుండా సినిమా ఓనర్లు టిక్కెట్ల‌ రేట్లు పెంచాలని ప్రభుత్వాన్ని అడగడం, ప్రభుత్వం రేట్లు పెంచడం దారుణం అన్నారు.

2. ఈ ప్రభుత్వం పిరికిది.. ఏబీ వెంకటేశ్వరరావు

ఈ ప్రభుత్వం పిరికిది అన్నారు మాజీ నిఘా బాస్ ఏబీ వెంకటేశ్వరరావు. 2014- 19లోనే జగన్ నేరసామ్రాజ్యాన్ని కట్టడి చేయాల్సి ఉంది. కానీ, అలా చేయలేదని మండి పడ్డారు ఏబీవీ. జగన్ తన జమానాలో రాజధాని మహిళలను ఎంతో వేధించారు. అయినా సరే ఇప్పటి వరకూ జగన్ పై, ఆయన మనుషులపై ఎలాంటి చర్యల్లేవన్నారు ఏబీవీ.

3. రేణుక చౌదరి కీలక వ్యాఖ్యలు

విజయవాడలో జరిగిన గ్రేటర్ కమ్మ సంక్రాంతి సంబరాల్లో రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాలపై ఆమె స్పందించారు. కృష్ణా, గోదావరి నదుల జలాల పంపిణీ విషయంలో ఉన్న వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఇద్దరు ఒక్కచోట కూర్చుని చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పారు.

4. మోసం చేశారు

సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు మా గుండెలపై తన్ని మరీ మా ప్రాంతానికి వేల కోట్ల నష్టం వచ్చేలా చేశారని ఆరోపించారు.. రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఒక్కో కార్యాలయాన్ని ఇక్కడి నుంచి తరలిస్తుంటే మా గుండెల మీద తన్నినట్టుగా ఉందని అభిప్రాయపడ్డారు శ్రీకాంత్ రెడ్డి. మా బాధ మాటల్లో వర్ణించలేనిదని.. ఆవేదన వ్యక్తం చేశారాయన.

5. తన సమాధి తానే నిర్మించుకున్న వ్యక్తి

జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన నక్క ఇంద్రయ్య అసాధారణ వ్యక్తిత్వం చాటుకున్నారు. ఉపాధి కోసం దుబాయ్ వెళ్ళి కార్మికుడిగా మొదలై, స్వశక్తితో కంపెనీ స్థాపించి ఎంతో మందికి ఉపాధినిచ్చారు. మరణానంతరం తన పిల్లలకు భారం కాకూడదని 2009లోనే 8 లక్షలతో తన పొలంలో ఒక రాతి సమాధిని నిర్మించుకున్నారు. రోజూ ఆ సమాధిని సందర్శించి ధ్యానం చేసేవారు. అనారోగ్యంతో శనివారం మరణించారు ఇంద్రయ్య. ఆయన కోరిక మేరకు కుటుంబీకులు రాతి సమాధి వద్దే అంత్యక్రియలు నిర్వహించారు.

6. అన్నదమ్ములపై దాడి

కడప జిల్లా బద్వేల్‌లో ఇద్దరు అన్నదమ్ములపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. దుండగుల దాడిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వ్యక్తిని కడప రిమ్స్ హాస్పిటల్‌కు స్థానికులు తరలించారు. ఇద్దరు అన్నదమ్ములు కలసపాడుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు.. దాడికి పాల్పడింది ఎవరనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

7. చైనా మాంజా విక్రయిస్తున్న వ్యక్తిపై పోలీసుల ఉక్కుపాదం

మేడ్చల్ మల్కాజ్‌గిరి గాజులరామారంలో నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్న లక్ష్మణ్ అనే వ్యక్తిని SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 23 మాంజా బాబిన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అనంతరం కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కోసం నిందితుడిని జగద్గిరిగుట్ట పోలీసులకు అప్పగించారు. పక్షులకు, మనుషులకు ప్రమాదకరమైన చైనా మాంజా వాడితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

8. మావోయిస్ట్ లొంగుబాటు

పోలవరం జిల్లా చింతూరులో సీపీఐ మావోయిస్ట్ పార్టీ సభ్యురాలు మడకం మూడే.. ఓఎస్డీ పంకజ్ కుమార్ మీనా ఎదుట లొంగిపోయారు. ఎటపాక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాకు చెందిన ఈమె, 2022లో ఇంద్రావతి ఏరియా కమిటీ 32వ ప్లాటూన్ సభ్యురాలిగా చేరి పలు దాడుల్లో పాల్గొన్నారు. పార్టీలో వివక్ష, ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితురాలై ఆమె లొంగిపోయినట్లు ఓఎస్డీ తెలిపారు.

9. చోరీ కేసు ఛేదన

ఉయ్యూరులోని శ్రీ కృష్ణసాయి జ్యూవెలర్స్ షాపులో గత నెల జరిగిన చోరీని పోలీసులు ఛేదించారు. పశ్చిమ గోదావరికి చెందిన అంతర్రాష్ట్ర దొంగ గొర్రెల సత్యనారాయణను అరెస్ట్ చేసి, అతని వద్ద నుండి రూ. 12 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ చలసాని శ్రీనివాస్ తెలిపారు. నిందితుడిపై తెలుగు రాష్ట్రాల్లో 30కి పైగా కేసులు ఉన్నాయని, యజమానుల దృష్టి మళ్లించి నగలు దోచుకోవడం ఇతని శైలి అని డీఎస్పీ తెలిపారు.

10. సిద్దిపేట జిల్లాలో విషాదం

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. చేపలు పట్టేందుకు వెళ్లిన కిరాని కుమార్, బిర్జు కుంటలో పడగా.. వారిని రక్షించబోయిన తల్లి ఉమాదేవి కూడా నీట మునిగి మృతి చెందారు. బీహార్‌కు చెందిన ఈ వలస కూలీల కుటుంబం పొట్టకూటి కోసం వచ్చి ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

11. ఎడ్ల పందాలు

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో సంక్రాంతి సందర్భంగా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఎడ్ల పందాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్ వంటి ప్రముఖులు పాల్గొన్న ఈ పోటీల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 22 జతల ఎద్దులు తలపడుతున్నాయి. నాలుగు రోజుల పాటు సాగే ఈ క్రీడా సంబరం నియోజకవర్గంలో ముందస్తు పండుగ వాతావరణాన్ని నింపింది.

12. కిటకిటలాడుతున్న జాతీయ రహదారి

సంక్రాంతికి వెళ్లే వాళ్లతో 65వ నెంబర్ జాతీయ రహదారి కిటకిటలాడుతోంది. మహా నగరం నుంచి విజయవాడ, నల్గొండ వైపు వెళ్లే వాహనాలతో రోడ్డుపై విపరీతమైన రద్దీ నెలకొంది. దీంతో.. వాహనాలు మెల్లగా కదులుతున్నాయి. సాధారణ రోజుల్లో గంటలో వెళ్లే దూరానికి ప్రస్తుతం మూడు గంటల వరకు పడుతోందని చెబుతున్నారు వాహనదారులు.

13. లారీ డీజిల్ ట్యాంక్ పగిలి.. భారీ ట్రాఫిక్

మార్కాపురం జిల్లా దోర్నాల-శ్రీశైలం ఘాట్ రోడ్డులోని తుమ్మలబైలు వద్ద ఇసుక లారీ డీజిల్ ట్యాంక్ పగిలి నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మూలమలుపు వద్ద లారీ ఆగిపోవడంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీనివల్ల ఆర్టీసీ, టూరిస్ట్ బస్సుల్లోని ప్రయాణికులు, ముఖ్యంగా చిన్న పిల్లలు ఆకలితో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అప్రమత్తమైన అధికారులు దోర్నాల చెక్ పోస్ట్ వద్ద వాహనాలను నిలిపివేసి, పోలీసులు లారీని పక్కకు తొలగించారు.

14. నింగిలోకి దూసుకెళ్ళేందుకు సిద్ధమైన మరో ఇస్రో

ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని షార్ నుంచి పీఎస్‌ఎల్వీ సీ-62 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లేందుకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 10:17 గంటలకు ఈ ప్రయోగం జరగనుండగా, ప్రస్తుతం కౌంట్‌డౌన్ ప్రక్రియ కొనసాగుతోంది.

15. నిందితుడు అరెస్ట్

విశాఖపట్నంలో యువతితో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్పష్టమైన ఆధారాలు లేనప్పటికి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల క్రితం జగదాంబ సెంటర్‌లో వెళ్తున్న యువతిపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేశాడు. అంతేకాకుండా యువతిని అసభ్య పథజాలంతో దూషించాడు. అయితే తనకు జరిగిన చేదు అనుభవం గురించి సోషల్ మీడియాలో యువతి పోస్ట్ చేసింది. దీంతో పోలీసులు చర్యలు చేపట్టారు.

16. పవన్‌కు పురస్కారం

మార్షల్ ఆర్ట్స్ లోనూ ప్రావీణ్యం పొందిన పవన్ కళ్యాణ్, ఓ అరుదైన ఘనత తన ఖాతాలో వేసుకున్నారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన కెంజుట్సు లో అధికారికంగా ప్రవేశించడం ద్వారా అంతర్జాతీయ గౌరవాన్ని సాధించారు. మూడు దశాబ్దాలకు పైగా ఆయన చేసిన సాధన, పరిశోధన, మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న అంకితభావానికి నిదర్శనంగా ఈ గుర్తింపు లభించింది.

17. వరుస కాల్పులు.. ఆరుగురు మృతి

అమెరికాలోని తూర్పు మిసిసిపీలో జరిగిన వరుస కాల్పుల ఘటనల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వెస్ట్‌ పాయింట్‌లోని అలబమా సరిహద్దు సమీపంలో జరిగిన మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు అధికారులు.

18. మోదీ సంచలన వ్యాఖ్యలు

సోమనాథ్ ఆలయ చరిత్రను తుడిచిపెట్టేందుకు గత ప్రభుత్వాలు ప్రయత్నించాయని అన్నారు ప్రధాని మోదీ. బానిస మనస్తత్వంతో దాని ప్రాముఖ్యతను విస్మరించారని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మోదీ విమర్శలు చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సర్దార్ పటేల్ చేసిన ఆలయ పునర్నిర్మాణ ప్రయత్నాలను అడ్డుకున్నారని విమర్శించారు. మూడు రోజుల గుజరాత్‌ పర్యటన సందర్భంగా సోమనాథ్‌ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారుప్రధాని మోదీ.

19. మరో రికార్డు.. విరాట్ కోహ్లీ

మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ. న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో బరిలోకి దిగిన కోహ్లీ.. భారత్ తరఫున 309 వన్డేలు పూర్తి చేసుకున్నాడు. దీంతో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 308 మ్యాచ్‌ల రికార్డును బ్రేక్ చేశాడు. మొత్తంగా భారత్ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన ప్లేయర్ల జాబితాలో 5వ స్థానానికి చేరుకున్నాడు. సచిన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

20. కొత్త జంటకు కంగ్రాట్స్

రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా హీరోయిన్ నుపుర్ సనన్ పెళ్లి చేసుకుంది. తన ప్రియుడు, సింగర్ స్టెబిన్ బెన్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఉదయ్‌పూర్‌లో ఇరుకుటుంబాలు, సన్నిహితుల మధ్య వారి పెళ్లి జరిగింది. ఈ కొత్త జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు నెటిజన్స్.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×