బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. హైదరాబాద్ దుర్గం చెరువు ఆక్రమణపై హైడ్రా ఫిర్యాదుతో మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దాదాపు ఐదు ఎకరాల చెరువు ప్రాంతాన్ని మట్టితో నింపి, పార్కింగ్ దందాకు పాల్పడినట్లు గుర్తించారు. 2014 నుంచి ఈ ఆక్రమణలు జరుగుతున్నాయని హైడ్రా సర్వేలో తేలింది.
తెలంగాణ అసెంబ్లీలో యూరియా కొరతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ వచ్చింది.. రైతులను ముంచింది అంటూ నినాదాలు చేస్తూ, ప్లకార్డులతో సభలోకి ప్రవేశించారు. రైతులకు సకాలంలో యూరియా సరఫరా చేయాలని, ప్రభుత్వం తక్షణమే స్పందించి అన్నదాతలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతంలో దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో ప్రయాణం కష్టతరంగా మారింది. ముఖ్యంగా పాఠశాల బస్సుల రాకపోకల సమయంలో ప్రమాదాలు జరిగే ముప్పు ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాహనదారులు ఫాగ్ లైట్లు వాడుతూ, అతివేగాన్ని తగ్గించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తక్కువ దృశ్యమానత కారణంగా ఢిల్లీ-హైదరాబాద్ మధ్య నడవాల్సిన ఎయిర్ ఇండియా విమానాలు రద్దయ్యాయి. శంషాబాద్-తిరుపతి, తిరుపతి-శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు రావాల్సిన ఇండిగో విమానాలు ఆలస్యమయ్యాయి.
నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో భర్త మరణాన్ని తట్టుకోలేక ప్రసన్న అనే మహిళ తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో ప్రసన్నతో పాటు ఆమె కుమార్తె మరణించగా.. కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. భర్త లేని జీవితం భారమని భావించి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సూసైడ్ నోట్‌లో పేర్కొంది.
కామారెడ్డిలో ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసైన శ్రీకర్ అనే యువకుడు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసే అతడు, అప్పులు తీర్చలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మూడు కోట్ల బకాయిల నెపంతో ముందస్తు సమాచారం లేకుండా దుర్గగుడిలో విద్యుత్ నిలిపివేయడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యుడైన ఏడీఈపై బదిలీ వేటు పడింది. భక్తులు ఆందోళనకు గురైన ఈ ఘటనపై జనవరి 6న విద్యుత్తు, దేవదాయ శాఖ మంత్రులు కీలక సమీక్ష నిర్వహించి తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
నంద్యాల జిల్లా చాబోలు హైవే వద్ద నెల్లూరు నుంచి కర్నూలు వెళ్తున్న వేగ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు గాయపడగా.. వారిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాకినాడ జిల్లా కోనపాపపేటలో జనసేన ఫ్లెక్సీలను గుర్తుతెలియని దుండగులు చింపివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. నూతన సంవత్సరం సందర్భంగా జనసేన నేత బాపన్న దొర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన కార్యకర్తలు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.
శ్రీశైలం పాతాళగంగ మెట్ల మార్గంలోని ఓ నివాసంలోకి అర్ధరాత్రి చిరుతపులి ప్రవేశించింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో స్థానికులు, భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు అప్రమత్తమై, భక్తులు ఒంటరిగా వెళ్లరాదని మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
దువ్వాడ మాధురి ఫోన్ కాల్ ఇష్యూలో అప్పన్న అదృశ్యం సంచలనంగా మారింది. ఫిర్యాదు చేసి 24 గంటలు దాటినా ఆచూకీ లభించలేదు. మెళియాపుట్టి పోలీసులు స్పందించకపోవడంతోనే ఎస్పీని ఆశ్రయించానని బాధితుడి భార్య చంద్రకళ చెబుతుండగా.. ఆమె ఫిర్యాదు ఇవ్వలేదని పోలీసులు పేర్కొంటున్నారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం ఏడు గంటలైనా దారి కనిపించక హెడ్‌లైట్ల వెలుతురులో ప్రయాణించారు. ప్రజలు చలి నుంచి ఉపశమనం కోసం మంటలను ఆశ్రయించగా, ప్రకృతి ప్రేమికులు మాత్రం ఈ ఆహ్లాదకర వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.
నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన సోదరుడు రాము రిమాండ్ నేటితో ముగియనుంది. దీంతో పోలీసులు వారిని విజయవాడ, గుంటూరు జైళ్ల నుంచి కోర్టుకు తరలించనున్నారు. మూడు రోజుల కస్టడీ విచారణ ముగియడంతో.. పోలీసులు సేకరించిన ఆధారాల నేపథ్యంలో కోర్టు తదుపరి తీర్పు ఇవ్వనుంది.
బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలంలోని ఎన్ఎక్స్‌ఎల్ టెక్స్‌టైల్స్ ప్రాంగణంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గౌతమి స్కూల్ బస్సు ఢీకొన్న ఘటనలో ఓంకార్ అనే ఐదేళ్ల బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఉదయం స్కూల్ బస్సు విద్యార్థులను తీసుకెళ్లేందుకు రాగా.. సమీప దుకాణంలో తినుబండారాలు కొనుక్కుని వస్తున్న ఓంకార్‌ను బస్సు ఢీకొట్టింది. అప్పటివరకు తమ కళ్ల ముందే అడుకుంటున ఓంకార్ మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కీలక కమాండర్ బార్సె దేవా భూపాలపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులకు చిక్కారు. ఇటీవల హిడ్మా స్థానంలో బెటాలియన్-1 కమాండర్‌గా బాధ్యతలు చేపట్టిన దేవా, మిలిటరీ శిక్షణలో ఆరితేరిన వ్యక్తి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని స్పష్టం చేశారు. గతంలో చేయించుకున్న గుండె సంబంధిత సీటీ స్కాన్ పరీక్ష కేవలం ముందస్తు జాగ్రత్తలో భాగమేనని ఆయన వైద్యుడు వెల్లడించారు. ఆ పరీక్షల వల్ల తన ఆరోగ్యంపై అనవసర అనుమానాలు వచ్చాయని ట్రంప్ పేర్కొన్నారు.
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు కొనసాగుతున్నాయి. షరియత్‌పూర్ జిల్లా దాముద్యాలో ఖోకన్ చంద్ర దాస్ అనే హిందూ వ్యాపారిపై మతోన్మాద మూక మారణాయుధాలతో దాడి చేసింది. అనంతరం ఆయనపై పెట్రోలు పోసి నిప్పంటించగా.. సమీపంలోని చెరువులో దూకి ఆయన ప్రాణాలు దక్కించుకున్నారు.
డీఆర్‌డీవో 68వ వార్షికోత్సవం సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు కురిపించారు. ఆపరేషన్ సింధూర్ విజయానికి డీఆర్‌డీవో ఆయుధాలే కారణమని, రానున్న దశాబ్దంలో సుదర్శన చక్ర గగనతల రక్షణ వ్యవస్థను రూపొందించడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
2027 ప్రపంచకప్ తర్వాత వన్డే క్రికెట్ భవిష్యత్తు ప్రశ్నార్థకమని రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డారు. టీ20 లీగ్‌ల విస్తరణ వల్ల వన్డేల ప్రాధాన్యం తగ్గిందని, ఈ ఫార్మాట్‌పై తనకు ఆందోళనగా ఉందని పేర్కొన్నారు. వన్డేలకు ఆదరణ పెరగాలంటే రోహిత్, విరాట్ వంటి దిగ్గజ ఆటగాళ్లు దేశవాళీ టోర్నీల్లో ఆడాల్సిన అవసరం ఉందన్నారు.
టాలీవుడ్ నటి కృతి శెట్టి బాలీవుడ్ అరంగేట్రం చేయబోతోంది. టైగర్ ష్రాఫ్ సరసన దర్శకుడు మిలాప్ జవేరి రూపొందించే యాక్షన్ థ్రిల్లర్‌లో ఆమె కథానాయికగా ఎంపికైనట్లు సమాచారం. టీ-సిరీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరిలో ప్రారంభం కానుంది. ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కృతికి ఇది మొదటి హిందీ సినిమా కావడం విశేషం.