E-Paper
Advertisement

Top 20 News Today: నీలోఫర్ కేఫ్ వద్ద బన్నీకి చేదు అనుభవం.. అసోం, త్రిపురలో భారీ భూకంపం

Top 20 News Today: నీలోఫర్ కేఫ్ వద్ద బన్నీకి చేదు అనుభవం.. అసోం, త్రిపురలో భారీ భూకంపం

1. శాసనసభలో నేడు సరికొత్త పాలసీపై చర్చ

తెలంగాణ శాసనసభ నేడు సరికొత్త హిల్ట్ పాలసీపై స్వల్పకాలిక చర్చ చేపట్టనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ఈ విధానంపై ఉభయ సభల్లో సమగ్ర చర్చ జరగనుంది. ఇప్పటికే కీలక బిల్లులు, ప్రాజెక్టులపై తీర్మానాలు ఆమోదం పొందిన నేపథ్యంలో, నేటి సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

2. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును నేడు విచారణకు హాజరు

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును విచారించేందుకు అనుమతి కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గతంలో చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్ఐఆర్‌ను తెలంగాణ హైకోర్టు క్వాష్ చేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ కేసులో తదుపరి పరిణామాలు ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

3. అసోం, త్రిపురలో భారీ భూకంపం

అసోంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.1గా నమోదైంది. మోరిగావ్‌కు 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అదేవిధంగా.. త్రిపురలోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. గోమతిలో రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.9గా నమోదైంది. దీని ప్రభావంతో మేఘాలయలోనూ పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది.

4. పోలవరం- నల్లమల్లసాగర్ లింక్‌పై సుప్రీం పోరు..

పోలవరం- నల్లమల్లసాగర్ ప్రాజెక్టుపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. ఏపీ ప్రభుత్వ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ ముంబైలో న్యాయవాది అభిషేక్ మను సింఘ్వితో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అత్యున్నత ధర్మాసనంలో బలమైన వాదనలు వినిపించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

5. కృష్ణా జలాల వివాదంపై త్వరలో వివరణ

కృష్ణా జలాల వివాదంపై త్వరలోనే స్పందిస్తానని అన్నారు ఏసీ సీఎం చంద్రబాబు నాయుడు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు రాష్ట్రాల ప్రయోజనాల దృష్ట్యా అన్ని విషయాలు సమగ్రంగా మాట్లాడతానని ఆయన స్పష్టం చేశారు.

6. సీతక్కకు కీలక బాధ్యతలు

మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పరిరక్షణకు ఏఐసీసీ ఎంజీఎన్ఆర్ఈజీఏ బచావో సంగ్రామ్ పేరుతో జాతీయ ఉద్యమాన్ని ప్రకటించింది. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయగా, అందులో తెలంగాణ మంత్రి సీతక్కకు కీలక బాధ్యతలు అప్పగించారు. అజయ్ మాకెన్ కన్వీనర్‌గా ఉన్న ఈ కమిటీ దేశవ్యాప్తంగా నిరసనలను సమన్వయం చేయనుంది.

7. కేటీఆర్‌పై ఫైర్ అయిన మహేష్ కుమార్ గౌడ్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఫైర్ అయ్యారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేటీఆర్ అహంకారంతో అసెంబ్లీ నుంచి పారిపోయారని, పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పినా తీరు మార్చుకోకపోతే తరిమికొడతారని, కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ బండారం బయటపడిందని విమర్శించారు.

8. కేసీఆర్‌పై మండిపడ్డ డీకే అరుణ

మాజీ సీఎం కేసీఆర్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కేవలం రాజకీయ లబ్ధి కోసమే వాడుకున్నారని, పదేళ్ల అధికారంలో ఒక్క ఎకరాకు నీళ్లివ్వలేదని విమర్శించారు. ప్రాజెక్టు డిజైన్ మార్పుతో ప్రజలకు అన్యాయం చేశారని, ప్రస్తుత ప్రభుత్వం కూడా పాత తప్పులు పునరావృతం చేయవద్దని హెచ్చరించారామె.

9. ఏపీ, తెలంగాణ సీఎంలు తోడు దొంగలు- అంబటి రాంబాబు

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఏపీ, తెలంగాణ సీఎంలు కుట్ర పన్నారని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు తోడు దొంగలని.. రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ చేపట్టిన ఈ ప్రాజెక్టును అడ్డుకోవడంపై చంద్రబాబు తక్షణమే సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

10. ముమ్మరంగా సాగుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

కొత్త ఏడాది వేడుకల అనంతరం కూడా హైదరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. జనవరి 2, 3 తేదీల్లో జరిపిన సోదాల్లో 327 మందిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారిలో అత్యధికంగా ద్విచక్ర వాహనదారులే ఉన్నారని.. మద్యం బాబుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.

11. పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. అరెంజ్ అలర్ట్ జారీ

తెలంగాణలో రాగల మూడు రోజులు దట్టమైన పొగమంచు, చలితీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర, మధ్య జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తెల్లవారుజామున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, తూర్పు గాలుల ప్రభావంతో రాష్ట్రం ఊటీని తలపిస్తోందని అధికారులు వెల్లడించారు.

12. ములుగు జిల్లాలో భక్తుల సందడి..

మేడారం మహాజాతర వేళ ములుగు జిల్లాలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం లక్షలాది మంది తరలిరావడంతో మేడారం మినీ జాతరను తలపించింది. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి, గద్దెలపై సమ్మక్క-సారలమ్మలకు భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.

13. రైల్వే స్టేషన్‌లో యువకుడు హల్‌చల్

శ్రీకాకుళం జిల్లా సోంపేట రైల్వే స్టేషన్‌లో ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. భువనేశ్వర్-తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలుపైకి ఎక్కి బెంగాల్‌కు చెందిన యువకుడు వీరంగం సృష్టించడంతో.. ప్రయాణికులు చాకచక్యంగా వ్యవహరించి అతడిని కిందకు దించి దేహశుద్ధి చేశారు. నిందితుడికి మతిస్థిమితం లేదని గుర్తించిన రైల్వే పోలీసులు, అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తృటిలో పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

14. మేడ్చల్ జిల్లాలో మెరుపు దాడి

మేడ్చల్ జిల్లా దుండిగల్‌లోని హ్యాష్ ఆయిల్ స్థావరంపై మెరుపు దాడి నిర్వహించారు ఎస్ఓటీ పోలీసులు. గండి మైసమ్మలోని ఓ ఇంట్లో రహస్యంగా తయారు చేస్తున్న కిలో హ్యాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 8 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా.

15. సినీ నటుడు అల్లు అర్జున్‌కు షాకింగ్ అనుభవం

సినీ స్టార్స్ కనిపిస్తే చాలు.. ఫ్యాన్స్ ఎగబడుతుంటారు. వారితో మాట్లాడేందుకు, సెల్ఫీలు కోసం తెగ ఇబ్బందిపెడుతుంటారు. తాజాగా సినీ నటుడు అల్లు అర్జున్‌కు కూడా అలాంటి అనుభవం ఎదురైంది. హైటెక్‌లోని నిలోఫర్ కేఫ్‌కు వెళ్లిన అల్లు అర్జున్ దంపతులను చుట్టుముట్టారు అభిమానులు. సెల్ఫీల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్‌ను తప్పించుకుని బయటకు రావడానికి బన్నీ దంపతులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. అతికష్టం మీద కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు అల్లు అర్జున్.

16. ఎన్డీఏ విజయం తథ్యం- అమిత్ షా

తమిళనాడులో అవినీతి, నిరంకుశ డీఎంకే పాలనను అంతం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. తిరుచిరాపల్లి కోర్ గ్రూప్ సమావేశంలో పాల్గొన్న ఆయన, వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి బూత్‌లో బీజేపీ కార్యకర్తలు శక్తివంచన లేకుండా పనిచేసి కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కేవలం ఎన్డీఏతోనే సాధ్యమని స్పష్టం చేశారు అమిత్ షా.

17. భారత్‌లో ఒలింపిక్స్!

భారత క్రీడారంగం ప్రపంచ స్థాయికి చేరుతోందని, 2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం ముమ్మరంగా కృషి చేస్తున్నామన్నారు ప్రధాని మోదీ. వారణాసిలో జాతీయ వాలీబాల్ పోటీలను ప్రారంభించిన ఆయన, 2030 కామన్వెల్త్ గేమ్స్ కూడా భారత్‌లోనే జరుగుతాయని ప్రకటించారు. సమష్టి కృషితోనే విజయాలు సాధ్యమని క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చారు.

18. ఎక్స్‌ కీలక ప్రకటన

ఎలాన్‌ మస్క్‌కు చెందిన ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌ కీలక ప్రకటన చేసింది. చట్టవిరుద్ధమైన, అశ్లీల కంటెంట్‌ను అప్‌లోడ్ చేసే ఖాతాలను శాశ్వతంగా సస్పెండ్ చేస్తామని ‘ఎక్స్‌’ ప్రకటించింది. ముఖ్యంగా ఏఐ ద్వారా సృష్టించిన అసభ్యకర చిత్రాలపై భారత ప్రభుత్వం నోటీసులు జారీ చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. .

19. ఇర్ఫాన్ అసహనం

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు మహ్మద్ షమిని ఎంపిక చేయకపోవడంపై ఇర్ఫాన్ పఠాన్ అసహనం వ్యక్తం చేశారు. దేశవాళీలో 200 ఓవర్లు వేసి ఫిట్‌నెస్‌ నిరూపించుకున్నా షమికి చోటు దక్కకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఐపీఎల్‌లో రాణిస్తే షమి పునరాగమనాన్ని ఎవరూ అడ్డుకోలేరని పఠాన్ అభిప్రాయపడ్డారు.

20. ది రాజాసాబ్ నుంచి మరో సాంగ్ రిలీజ్.

ప్రభాస్-మారుతి కాంబోలో వస్తున్న ది రాజాసాబ్ సంక్రాంతి కానుకగా ఈనెల 9న విడుదల కానుంది. చిత్ర ప్రచారంలో భాగంగా నచ్చే నచ్చే అనే రీమిక్స్ సాంగ్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. థమన్ సంగీతం అందించిన ఈ ఫుల్ సాంగ్‌ను నేడు విడుదల చేయనున్నారు. వింటేజ్ ప్రభాస్‌ను గుర్తుచేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×