E-Paper
Advertisement

Top 20 News Today: తగ్గుతున్న బ్లోఅవుట్‌.. కవిత రాజీనామాను ఆమోదించిన మండలి చైర్మెన్

Top 20 News Today: తగ్గుతున్న బ్లోఅవుట్‌.. కవిత రాజీనామాను ఆమోదించిన మండలి చైర్మెన్

1. కవిత రాజీనామాను ఆమోదించిన మండలి చైర్మెన్

తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామాను మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ వేటు పడటంతో ఆమె గత సెప్టెంబర్‌లోనే తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం సభలో ఆమె భావోద్వేగంతో చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది.

2. తెలంగాణ శాసన సభ నిరవధిక వాయిదా

తెలంగాణ శీతకాల అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు సాగి నిరవధికంగా వాయిదా పడ్డాయి. కృష్ణా జలాలు, హిల్ట్ పాలసీ లాంటి కీలక అంశాలపై 40 గంటలకు పైగా చర్చలు జరిగాయి. 13 బిల్లులకు సభ ఆమోదం తెలపగా, విపక్ష బీఆర్ఎస్ నిరసనల మధ్య సభను బహిష్కరించింది. ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కీలక వివరణలు ఇచ్చింది.

3. నేటి నుంచి ప్రారంభం కానున్న ల్యాండ్ పూలింగ్

ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఏడు గ్రామాల్లోని 20,494 ఎకరాలను స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్డు వంటి కీలక ప్రాజెక్టుల కోసం సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశ విజయవంతం కావడంతో, రెండో దశను కూడా పారదర్శకంగా, యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు సీఆర్‌డీఏ సిద్ధమైంది.

4. నేడు చంద్రబాబు ఢిల్లీ టూర్

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీ పర్యటనకు బయలుదేరనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర సహకారం వంటి కీలక అంశాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో డిన్నర్ మీటింగ్‌లో చంద్రబాబు చర్చలు జరపనున్నారు.

5. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు

ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు సందర్శించనున్నారు. నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనులు వేగం పుంజుకుని 88 శాతానికి చేరుకున్నాయి. డయాఫ్రమ్ వాల్‌తో పాటు కీలక విభాగాలను పరిశీలించి ముఖ్యమంత్రి భవిష్యత్తు కార్యాచరణను దిశానిర్దేశం చేయనున్నారు.

6. అవినీతి జరుగుతోందన్న విపక్షాల ఆరోపణలను ఖండించిన ఉత్తమ్

హిల్ట్ పాలసీలో అవినీతి జరుగుతోందన్న విపక్షాల ఆరోపణలను తీవ్రంగా ఖండించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇప్పటివరకు ఈ విధానం కింద ఒక్క దరఖాస్తు కూడా రాలేదని, అలాంటప్పుడు కుంభకోణం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. టీఎస్ ఐపాస్ ద్వారా ఆన్‌లైన్‌లో అత్యంత పారదర్శకంగా దరఖాస్తులు స్వీకరిస్తామని, పరిశ్రమలను నగరం వెలుపలికి తరలించి కాలుష్య రహిత హైదరాబాద్‌ను రూపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.

7. తగ్గుముఖం పట్టిన బ్లోఅవుట్‌

కోనసీమ జిల్లా ఇరుసుమండలో జరిగిన గ్యాస్ బ్లోఅవుట్ 95 శాతం అదుపులోకి వచ్చింది. మంటల తీవ్రత తగ్గడంతో పునరావాస కేంద్రాల నుంచి ప్రజలు తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. ఓఎన్‌జీసీ నిపుణులు మరో నాలుగు రోజుల్లో బావిని పూర్తిగా సీల్ చేయనున్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

8. గ్రేట్ గ్రీన్ వాల్ నిర్మాణమే లక్ష్యం- డిప్యూటీ సీఎం పవన్

ఏపీ తీరప్రాంత రక్షణకు గ్రేట్ గ్రీన్ వాల్ నిర్మాణమే లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 50 శాతం పచ్చదనం సాధించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని, జనవరి నెలాఖరులోపు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అటవీ భూముల ఆక్రమణలను అడ్డుకుంటూ తీరప్రాంతాన్ని విపత్తుల నుంచి కాపాడడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమన్నారు.

9. తెలంగాణకు కొత్త పార్టీ అవసరం..

సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా కల్వకుంట్ల కవిత చేపట్టిన కార్యాచరణకు భారీ మద్దతు లభించింది. బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయానికి వివిధ ప్రజా, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు తరలివచ్చి ఆమెకు సంఘీభావం ప్రకటించాయి. తెలంగాణ అస్తిత్వం కోసం కొత్త పార్టీ అవసరమని పేర్కొన్న నేతలకు కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజల ఆకాంక్షల కోసం నిరంతరం పోరాడుతానన్నారు కవిత.

10. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ

కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ కిరణ్ కుమార్ 30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. కేసులో నిందితుడిని అరెస్టు చేయకుండా ఉండేందుకు, లేని సెక్షన్లు ఉన్నాయని భయపెట్టి డబ్బులు డిమాండ్ చేశారు. ఎస్సై నివాసం వద్ద నగదు తీసుకుంటుండగా అధికారులు వలపన్ని పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఏసీబీ అధికారులు.

11. మద్యం మత్తులో యువకులు బీభత్సం..

ఖమ్మం తెల్దారిపల్లి ఆర్చ్ వద్ద అర్ధరాత్రి యువకులు మద్యం మత్తులో బీభత్సం సృష్టించారు. కర్రలు, బీరు బాటిళ్లతో పరస్పర దాడి చేసుకున్నారు. పాత కక్షలతో జేఎన్‌టీయూ విద్యార్థిపై కొందరు దాడి చేయడం.. గ్యాంగ్‌ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు వచ్చేసరికి బైకులు ధ్వంసమయ్యాయి.

12. విషాదం.. ఒక ప్రేమ.. ఇద్దరి ప్రాణాలు బలి..

తిరుపతి మారుతీ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. సోమశేఖర్ అనే వ్యక్తి తనతో వివాహేతర సంబంధం ఉన్న సాంబలక్ష్మి అనే మహిళను గొంతు కోసి చంపేశాడు. అనంతరం తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య తలెత్తిన వివాదమే ఈ ఘాతుకానికి కారణమని తెలుస్తోంది.

13. అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి..

కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన ముత్యాల మదన్ కళ్యాణ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. స్థానిక పశువుల సంత వద్ద విగతజీవిగా పడి ఉన్న యువకుడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మరణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

14. వరుస చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్..

సిద్దిపేట జిల్లా రాయపోల్ పరిధిలో వరుస వైర్ల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. రైతుల వ్యవసాయ బావుల వద్ద సర్వీస్ వైర్లు దొంగిలించి, కాపర్ విక్రయిస్తున్న ఐదుగురిని పట్టుకున్నామన్నారు గజ్వేల్ ఏసీపీ నర్సింలు. ప్రత్యేక బృందాలతో గాలించి నిందితులను పట్టుకొని, రిమాండ్‌కు తరలించడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.

15. కుక్కను తప్పించబోయి రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం అలీంపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కొమురవెల్లి మల్లన్నను దర్శించుకుని కారులో తిరిగి వస్తుండగా, కుక్కను తప్పించబోయి బోల్తా పడింది. ఈ ఘటనలో కొడకండ్ల గ్రామానికి చెందిన మహేష్ అనే భక్తుడు అక్కడికక్కడే మరణించగా.. ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

16. వైభవంగా జరగనున్న సోమనాథ్ స్వాభిమాన్ ఉత్సవం

గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నేతృత్వంలో జనవరి 8 నుంచి 11 వరకు సోమనాథ్ స్వాభిమాన్ ఉత్సవం వైభవంగా జరగనుంది. ప్రధాని మోదీ స్ఫూర్తితో రత్నాకర్ సాగర్ తీరాన నిర్వహించే ఈ వేడుక, వెయ్యేళ్ల భారతీయ అచంచల చైతన్యానికి ప్రతీకగా నిలవనుంది. 140 కోట్ల భారతీయుల్లో కొత్త విశ్వాసాన్ని నింపేలా ఈ పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

17. 6 నుంచి 8 చదువుతున్న విద్యార్థుల కోసం బ్యాగ్‌లెస్ డేస్

కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ జాతీయ విద్యా విధానంలో భాగంగా 6 నుంచి 8వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం 10 బ్యాగ్‌లెస్ డేస్ అనే వినూత్న పథకాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా విద్యార్థులు పుస్తకాల భారం లేకుండా కుండల తయారీ, కళలు వంటి స్థానిక నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు. సమగ్ర శిక్ష నిధులతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే 2.2 కోట్లకు పైగా విద్యార్థులు ప్రయోజనం పొంది, విద్యను ఆనందదాయకంగా అభ్యసిస్తున్నారు.

18. టారిఫ్‌లతో 600 బిలియన్ డాలర్ల ఆదాయం

ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్‌ల ద్వారా అమెరికాకు త్వరలో 600 బిలియన్ డాలర్ల ఆదాయం రానుందని ట్రంప్ ప్రకటించారు. అయితే, టారిఫ్‌లు విధించేందుకు అధ్యక్షుడికి ఉన్న అధికారంపై అమెరికా సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. తీర్పు ఏదైనా తాము సిద్ధమని వైట్‌హౌస్ స్పష్టం చేసింది.

19. ఈ సినిమాల టిక్కెట్ ధరల పెంపుపై సందిగ్ధం

సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ చిత్రాల టిక్కెట్ ధరల పెంపు, అదనపు షోలపై సందిగ్ధం నెలకొంది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ నిర్మాతలు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. అత్యవసర విచారణకు కోర్టు నిరాకరించగా, నేడు ఈ పిటిషన్లపై విచారణ జరగనుంది. ప్రభాస్, చిరంజీవి సినిమాల భారీ బడ్జెట్ దృష్ట్యా రాయితీలు కోరుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.

20. వన్డే సిరీస్‌కు సిద్దమవుతున్న రోహిత్ శర్మ

జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్ కోసం రోహిత్ శర్మ సిద్ధమవుతున్నారు. ఇటీవల ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానానికి చేరిన ఆయన.. అఫ్రిది పేరిట ఉన్న అత్యధిక వన్డే సిక్సర్ల రికార్డును అధిగమించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 20 వేల పరుగుల మైలురాయిని దాటిన రోహిత్, తాజాగా విజయ్ హజారే ట్రోఫీలో సెంచరీతో మెరిశారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×