తెలంగాణలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఎలక్షన్ల నిర్వహణకు ప్రభుత్వం స్పీడ్ పెంచింది. ప్రస్తుతం తుది ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్ల ఖరారు, పోలింగ్ సామగ్రిని సమకూర్చుకోవడం లాంటి అంశాలపై అధికారులు ఫోకస్ పెట్టారు. తెలంగాణ మున్సిపాలిటీ చట్టం– 2019లోని సవరించిన సెక్షన్ 195–ఎ ప్రకారం మున్సిపల్ వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాను 12వ తేదీలోగా తప్పనిసరిగా ప్రచురించాలని సూచించారు.
తెలంగాణలో ఐపీఎస్ అధికారుల భారీ బదిలీలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో కీలక నియామకాలు జరిగాయి.
రాజమహేంద్రవరం మెడికల్ కాలేజీ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. వైసీపీ హయాంలో అరకొర వసతులతో ఉన్న కాలేజీని కూటమి ప్రభుత్వం పది కోట్లతో చక్కదిద్దిందని అన్నారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా హాస్టల్ భవనాలు నిర్మిస్తున్నామని, వైసీపీ నేతలు మానసిక స్థితి కోల్పోయి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఘాటుగా విమర్శించారు.
ఇరుసుమండ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎప్పుడో మూసేసిన ONGC బావి తిరిగి ఓపెన్ చేశారనీ.. నిబంధనలకు విరుద్ధంగా డీప్ ఇండస్ట్రీకి ఇరుసుమండ బావిని అప్పగించారంటూ ప్రధాన ఆరోపణ వినిపిస్తోంది. ఈ విషయంపై సంచలన ఆరోపణ చేశారు స్థానిక ఎమ్మెల్యే దేవ వరప్రసాద్.
రంగారెడ్డి జిల్లా మోకిలలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. మృతుల్లో సూర్యతేజ, సుమిత్, శ్రీ నిఖిల్ BBA థర్డ్ ఇయర్ చదువుతున్నారు. రోహిత్ అనే మరో విద్యార్థి MGITలో చదువుతున్నాడు. ఈ ప్రమాదంలో గాయపడిన అమ్మాయి నక్షత్ర BBA థర్డ్ ఇయర్ స్టూడెంట్. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారును తొలగించి మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పీఎస్ పరిధిలో హ్యాష్ ఆయిల్ రూపంలో ఉన్న గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉట్‌పల్లి శ్రీకృష్ణ హాస్పిటల్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా.. వారి వద్ద హ్యాష్ గంజాయి లభ్యమైంది. వారి వద్ద నుంచి రెండు బాటిళ్ల హ్యాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
నిర్మల్ జిల్లా కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలో జట్టక్కను తరిమికొట్టే కార్యక్రమాన్ని గ్రామస్తులు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి పాత బట్టలు చీపురు, చాట తీసుకొని ఒకరినొకరు చీపురులతో కొట్టుకుంటూ జట్టక్కపో అంటూ ఊరేగింపు నిర్వహించారు. ప్రతి ఎటా ఇలా చేస్తే ఊర్లో ఉన్న అరిష్టాలు పోయి, శుభం కలుగుతుందని ప్రజల ప్రగాఢ నమ్మకం. గ్రామంలో ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు.
బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్‌లో జరిగిన చోరీని 24 గంటల్లోనే ఛేదించారు. నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగిన బంగారు నల్లపూసల దొంగతనం కేసును ఛేదించారు చీరాల జీఆర్‌పీ పోలీసులు. సాంకేతిక పరిజ్ఞానంతో చీరాల రామనగర్‌కు చెందిన రోజా అనే మహిళను అరెస్ట్ చేశారు. 2లక్షల 16 వేల రూపాయలు విలువైన సుమారు 36 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని తలారి చెరువు గ్రామంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. గ్రామానికి సమీపంలోని ఆదాని సిమెంట్ ఫ్యాక్టరీ మైన్స్ ఏరియాలో చిరుత సంచరిస్తుండటాన్ని గమనించిన సెక్యూరిటీ గార్డులు.. దానిని తన మొబైల్‌లో ఫోటో తీసి పోలీసులకు సమాచారం అందించారు.
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం జబ్బార్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. విజయవాడకు చెందిన హర్షిత్ అనే విద్యార్థి రూమ్‌లో ఉంటూ ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకుంటున్నాడు. రూములో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న హర్షిత్ మృతదేహాన్ని చూసిన రూమ్‌మేట్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలలో గత నెల 30న తెరుచుకున్న శ్రీవారి వైకుంఠ ద్వారం ఇవాళ అర్ధరాత్రి 12 గంటలకు మూసివేయనున్నారు. ఇంతటితో వైకుంఠ ద్వార దర్శనాలు పూర్తి కానున్నాయి. మొత్తం 10 రోజుల్లో మొదటి 3 రోజులకు ఈ-డిప్ ద్వారా టోకెన్లు జారీ చేశారు. మిగతా 7 రోజుల్లో సర్వదర్శనానికి వచ్చిన భక్తులకు అవకాశం కల్పించారు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న ట్రావెల్స్ బస్సు చింతకొమ్మదిన్నె వద్ద అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తూ వారంతా సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించి హెల్మెట్ , సిట్ బెల్ట్, వాహనాల పేపర్లు కలిగి ఉన్న వారికి ఒక చాక్లెట్‌తో పాటు పూలు అందించి ప్రశంసించారు ఎస్సై స్వాతి. అనంతరం ట్రాఫిక్‌పై అవగాహన కల్పించారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలుకు ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి బళ్లారి వైపు వెళ్తున్న గూడ్స్ రైలు రన్నింగ్‌లో ఉండగానే.. అకస్మాత్తుగా బోగీలు విడిపోయాయి. ఇంజన్ డ్రైవర్ ఇది గమనించకుండా సుమారు ఒక కిలోమీటర్ దూరం ముందుకు వెళ్లగా.. అప్రమత్తమైన గార్డు వాకీ టాకీ ద్వారా లోకో పైలట్‌ను అప్రమత్తం చేశారు. వెంటనే ఇంజన్‌ను వెనక్కి తీసుకువచ్చి, ఊడిపోయిన హెయిర్ పంప్ కప్లింగ్‌ను సరిచేసి 20 నిమిషాల్లో బోగీలను తిరిగి జోడించారు.
అమెరికా మిన్నియాపోలీస్‌లో మళ్లీ కాల్పులు జరిగాయి. ఇమ్రిగేషన్ అధికారులు ఓ మహిళపై కాల్పులు జరపగా.. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. 37 ఏళ్ల రెనీ నికోల్ గుడ్ కారులో వెళ్తుండగా ICE ఏజెంట్ కాల్పులు జరిపారు. మిన్నియాపోలీస్‌లో అక్రమ వలసదారులపై సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
వీధి కుక్కల వివాదంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల రక్షణపై పెద్ద మొత్తంలో పిటిషన్‌లు దాఖలు అవుతుండడంపై అసహనం వ్యక్తం చేసింది. అందరూ కుక్కల గురించే ఆలోచిస్తుంటే..ఇతర జంతువుల జీవితాల సంగతేంటి? కోళ్లు, మేకల గురించి ఎందుకు మాట్లాడరు? వాటివి ప్రాణాలు కావా అని ఈ కేసులో కుక్కల రక్షణపై వాదించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్‌ను ప్రశ్నించింది.
దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ ట్రైను జనవరి 17న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. గువాహటి- కోల్కతా రూట్లో 18 నుంచి పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి వస్తాయి. 16 కోచ్లు, 823 సీట్లు కలిగిన ఈ ట్రైన్లో విమాన తరహా సౌకర్యాలు, ఆటోమేటిక్ డోర్లు, మెరుగైన భద్రతా వ్యవస్థలు ఉన్నాయి. గంటకు 180 KM వేగంతో దూసుకెళ్లనుంది.
వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో నిర్బంధం తర్వాత లాటిన్ అమెరికాలోని మెక్సికో, క్యూబా, కొలంబియాలను ఉద్దేశిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంలో ట్రంప్ తాజాగా తన స్వరాన్ని మార్చారు. కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
తమిళ హీరో విజయ్ కథానాయకుడిగా నటించిన జన నాయగన్ సినిమా విడుదల వాయిదా పడింది. కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా విడుదలను వాయిదా వేస్తున్నట్లు కేవీఎన్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని వెల్లడిస్తామని పేర్కొంది.
మలేసియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ప్రిక్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21-13, 22-20తో సుంగ్ షువో యున్ పై విజయం సాధించింది.