E-Paper
Advertisement

Top 20 News Today: దారుణం.. విద్యార్థికి అట్లకాడతో వాతలు పెట్టిన ట్యూషన్ టీచర్, తిరుపతి జిల్లాలో ఏనుగుల బీభత్సం

Top 20 News Today: దారుణం.. విద్యార్థికి అట్లకాడతో వాతలు పెట్టిన ట్యూషన్ టీచర్, తిరుపతి జిల్లాలో ఏనుగుల బీభత్సం

1. గ్లోబల్ సమ్మిట్ అద్భుతం-సీఎం రేవంత్ రెడ్డి

గ్లోబల్ సమ్మిట్ అద్భుతంగా జరిగిందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సమ్మిట్ ఎంతటి విజయం సాధించిందో సోనియా, ఖర్గే, రాహుల్, ప్రియాంకకు వివరించానని అన్నారు ముఖ్యమంత్రి. తెలంగాణ విజన్ అంటే ఏంటో ఈ సమ్మిట్ ద్వారా ప్రపంచానికి తెలిసిందని అన్నారు. తెలంగాణలో విద్యారంగానికి విశేష ప్రాధాన్యతనిస్తున్నట్టు చెప్పారు. సంప్రదాయ విద్య కాకుండా.. నైపుణ్యంతో కూడిన విద్యను అందించడానికి కూడా తాము ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి

2. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా

తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. గురువారం జరిగిన తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలుపుకొని అధికార కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారులు 2,383 సర్పంచి స్థానాల్లో విజయదుందుభి మోగించారు. సిద్దిపేట మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది.

3. పాపం.. అట్లకాడతో విద్యార్థికి వాతలు పెట్టిన టీచర్..

హైదరాబాద్ ఫిలింనగర్‌లో ఓ ట్యూషన్ టీచర్ దారుణానికి పాల్పడింది. చదవడం లేదనే కారణంతో ఓయూ కాలనీకి చెందిన ఒకటో తరగతి విద్యార్థిపై దాడి చేసింది టీచర్ శ్రీమానస. అట్లకాడతో బాలుడి చేతులు, కాళ్లు, ముఖంపై సహా శరీరంపై ఎనిమిది చోట్ల వాతలు పెట్టింది. దీంతో బాలుడు సరిగా నడవలేక తీవ్రంగా ఇబ్బందిపడుతున్నాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో మానసపై ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం గోల్కొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తమ కొడుకును విచక్షణారహితంగా కాల్చిన ట్యూషన్ టీచర్ మానసపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బాలుడు తల్లిదండ్రులు.

4. ముగిసిన తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికలు..

తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికలు సాఫీగా ముగిశాయి. 84.28 శాతం ఓటింగ్‌ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. మొదటి దశకు మొత్తం 53,57,277 మంది ఓటర్లు ఉండగా, వారిలో 45,15,141 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. మహిళా ఓటర్లు 84.40%, పురుష ఓటర్లు 84.16%, ఇతరులు 41.27 % ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88%, అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 71.79% ఓటింగ్‌ నమోదైంది.

5. చనిపోయిన అభ్యర్థి విజయం

మహబూబాబాద్ జిల్లా నడివాడ గ్రామ పంచాయతీలో విచిత్రం చోటు చేసుకుంది. కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ బరిలో నిలిచిన బుచ్చిరెడ్డి.. పోలింగ్‌కు రెండు రోజుల ముందు డిసెంబర్ 9న గుండెపోటుతో మరణించారు. ఎన్నికల అధికారులు ఆయనకు బ్యాట్ గుర్తు కేటాయించగా.. తొలి విడత పోలింగ్‌లో ఓటర్లు.. మరణించిన అభ్యర్థికి మద్దతు తెలుపుతూ 165 ఓట్లు వేశారు.

6. పుట్‌బాల్ మ్యాచ్ పై సమీక్ష..

మేడ్చల్ జిల్లా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 13న జరగనున్న ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. భద్రతా విషయంలో తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు ఆయన సూచించారు. ఈ సమావేశంలో రాచకొండ సీపీ సుధీర్ బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

7. తెలంగాణను వణికిస్తున్న చలిపులి..

తెలంగాణను చలి గజగజ వణికిస్తోంది. చలి తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతున్నారు. గత కొన్ని రోజుల నుంచి చలి తీవ్రత పెరిగింది.కోల్డ్ వేవ్, సివియర్ కోల్డ్ వేవ్ కండిషన్స్ నమోదవుతున్నాయి.25 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కు పడిపోయాయంటే చలి తీవ్రత ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. మిగిలిన 8 జిల్లాల్లో కూడా 12 డిగ్రీల్లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

8. అయ్యయ్యో.. దివ్వెల మాధురి బర్త్‌డే పార్టీని భగ్నం చేసిన పోలీసులు..

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ది పెంట్‌డెంట్ ఫామ్‌హౌస్‌పై రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు మెరుపుదాడి నిర్వహించారు. ఈ దాడుల్లో దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలు దివ్వెల మాధురి బర్త్‌డే పార్టీని పోలీసులు భగ్నం చేసినట్లు సమాచారం అందుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం సేవించి పార్టీ నిర్వహించారనే పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు.

9. విశాఖలో రెండు భారీ ప్రాజెక్టులు

విశాఖ అభివృద్ధిలో కీలక మైలురాళ్లుగా నిలిచే రెండు భారీ ప్రాజెక్టులకు నేడు శ్రీకారం చుట్టనున్నారు. అంతర్జాతీయ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌తో పాటు, ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సత్వా గ్రూప్ తమ క్యాంపస్‌ల నిర్మాణానికి భూమి పూజ చేయనున్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా విశాఖలో 3వేల కోట్లకు పైగా పెట్టుబడులు రానుండగా, ప్రత్యక్షంగా 33 వేలకు పైగా ఉద్యోగాలు లభించనున్నాయి.

10. ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 30 మంది

అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మారేడుమిల్లి- భద్రాచలం ఘాట్ రోడ్డులో తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 9మంది మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న మోతుగూడెం పోలీసులు, స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు.

11. నంద్యాల జిల్లాలో తప్పిన ప్రమాదం..

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ దగ్గర భారీ ప్రమాదం తప్పింది. శిరివెళ్ళ మెట్ట సమీపంలో హైవేపై టూవీలర్‌ను ఢీకొట్టింది వాసవీ ట్రావెల్స్ బస్సు. అతివేగంతో వచ్చిన బస్సు.. టూవీలర్‌ను ఢీకొని 100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. దీంతో.. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.బస్సులోని 18 మంది ప్రయాణికులు సురక్షితం ఉన్నారు. హైదరాబాద్ నుంచి తిరుచ్చికి వెళ్తుంది వాసవీ ట్రావెల్స్ బస్సు. బస్సు డ్రైవర్ అప్రమత్తతతో కర్నూలు తరహా ప్రమాదం జరగకుండా బస్సులోని ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.

12. తిరుపతి జిల్లాలో ఏనుగుల బీభత్సం

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఏ.రంగంపేటలో రాత్రి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. దుర్గం ఎస్టీ కాలనీ సమీపంలో 12కి పైగా ఏనుగుల మంద చొరబడ్డాయి. కొబ్బరి చెట్లు, పశుగ్రాసాన్ని ధ్వంసం చేశాయి. దీంతో సమీప గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

13. కడప మేయర్‌గా పాకా సురేష్ ఏకగ్రీవం

కడప మేయర్‌గా పాకా సురేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మనోజ్ రెడ్డి సమక్షంలో ఆయన మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. మేయర్ ఛాంబర్‌లో పాకా సురేష్ బాధ్యతలు స్వీకరించారు. రాబోయే రోజుల్లో కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజల ఆకాంక్షల మేరకు పని చేస్తానని హామీ ఇచ్చారు పాకా సురేష్.

14. అఖండ-2 ప్రీమియర్ షో.. వాగ్వాదానికి దిగిన అభిమానులు..

చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని రంగ మహల్ థియేటర్ వద్ద గురువారం రాత్రి బాలకృష్ణ అఖండ-2 ప్రీమియర్ షో సందర్భంగా రగడ చోటుచేసుకుంది. ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులను లోపలికి పంపకపోవడంతో మొదలైన వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది.

15. అధికారుల నిర్లక్ష్యం తుఫాన్ బాధితులు ఆకలి కేకలు

శ్రీకాకుళం భావనపాడులో అధికారుల జాప్యంతో తుఫాన్ బాధితులకు పంపిణీ చేయాల్సిన నిత్యవసర వస్తువులు కుళ్లిపోయాయి. మోంథ తుఫాన్ సమయంలో మత్స్యకారులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రేషన్ డీలర్లకు అధికారులు బంగాళదుంపలు, ఉల్లిపాయలు, బియ్యం, నూనె అందించారు. అయితే తమకు కూడా నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలని స్థానికులంతా అడ్డుకున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక మత్స్యకారులకు కూడా నిత్యవసర వస్తువులు పంపిణీ చేయలేదు అధికారులు. నెలరోజులు దాటడంతో బంగాళదుంపలు, ఉల్లిపాయలు వృధాగా కుళ్లిపోయాయి.

16. డొనాల్డ్‌ ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడిన మోదీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ఫోన్‌లో మాట్లాడారు. ద్వైపాక్షిక ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడం సహా పలు అంశాలపై చర్చించారు. వాణిజ్యం, క్రిటికల్‌ సాంకేతికతలు, ఇంధనం, రక్షణ, భద్రత వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని విస్తరించుకోవడంపై సమాలోచనలు జరిపారు. ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాల్లో మరింత కలిసికట్టుగా పనిచేయాలని మోదీ, ట్రంప్‌ నిర్ణయించుకున్నారు. భారత్‌-అమెరికా సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిని వారు సమీక్షించారు. అన్ని రంగాల్లో ద్వైపాక్షిక సహకారం నిలకడగా బలోపేతమవుతుండటంపై సంతృప్తి వ్యక్తం చేశారు.

17. అమెరికాకు సిగ్గుచేటు

అమెరికాలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో చదువుకున్న భారత్, చైనావంటి దేశాలకు చెందిన విద్యార్థులు తిరిగి స్వదేశాలకు వెళ్లిపోవడం తమకే సిగ్గుచేటని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ‘అత్యుత్తమ కళాశాలల నుంచి గ్రాడ్యుయేట్లు అయినవారు స్వదేశాలైన భారత్‌కు, చైనాకు, ఫ్రాన్స్‌కు వెళ్లాల్సి వస్తోంది. మిగిలిన దేశాలవారూ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్లిపోతున్నారు. వారు ఇక్కడ ఉండటం చాలా కష్టంగా మారింది. ఇది మనకు సిగ్గుచేటు’ అని ఆయన పేర్కొన్నారు.

18. ప్రభుత్వ రంగ సంస్థలు తమ ఆస్తులను తిరిగి పొందడానికి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

ప్రభుత్వ రంగ సంస్థలు తమ ఆస్తులను తిరిగి పొందడానికి దోహదపడే కీలకమైన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు వెలువరించింది. ఏదైనా ఆస్తిపై వివాదం తలెత్తితే… రాష్ట్రాలు తీసుకొచ్చిన అద్దె చట్టాల కన్నా కేంద్ర ప్రభుత్వం 1971లో చేసిన ప్రభుత్వ ప్రాంగణాల శాసనానిదే పైచేయి అవుతుందని త్రిసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది.

19. భారత జట్టులో సింధు, లక్ష్యసేన్‌

చైనాలో ఫిబ్రవరి 3న ఆరంభమయ్యే ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో పోటీపడే భారత జట్టులో పి.వి.సింధు, లక్ష్యసేన్‌ ఆడనున్నారు. మహిళల విభాగంలో భారత్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలో దిగుతోంది. పురుషుల్లో గత టోర్నీలో కాంస్యం గెలిచింది. ‘‘ర్యాంకింగ్, ప్రదర్శన, అనుభవం ఆధారంగా భారత జట్లను ఎంపిక చేశాం. మహిళల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌కు సింధు కీలకం’’ అని భారత బ్యాడ్మింటన్‌ సంఘం వెల్లడించింది.

20. ‘ధురంధర్’ నిలిపివేత

రణ్‌వీర్‌ సింగ్, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ధురంధర్’. ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమా ఆదరణ సొంతం చేసుకుంటోంది. భారతదేశంలో ఈ సినిమా ఆకట్టుకుంటుండగా.. ఆరు దేశాల్లో దీనిపై నిషేధం విధించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆరు గల్ఫ్‌ దేశాల్లో ఈ ‘ధురంధర్‌’ ప్రదర్శనను నిలిపివేసినట్లు సమాచారం.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×