సీఎం చంద్రబాబు నాయుడుతో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ దాదాపు గంటపాటు సమావేశమయ్యారు. మోంథా తుఫాన్ నష్టం, మైనర్ ఇరిగేషన్ అంశాలపై చర్చించారు. రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి 695 కోట్లు, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద 100 కోట్లు ఇవ్వాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
సూర్యపేట జిల్లా కొమ్మాల గ్రామంలో భూమి వాటా ఇవ్వడం లేదంటూ కన్నెబోయిన ఉపేందర్ తన భార్యాపిల్లలతో కలిసి తల్లి ఇంటి ముందు నిరసనకు దిగాడు. తల్లి మంగమ్మ, తమ్ముడు కిరణ్ తనకు ద్రోహం చేస్తున్నారని ఉపేందర్ ఆవేదన వ్యక్తం చేశాడు. న్యాయం చేయాలని, లేదంటే ఆత్మహత్యే గతి అని వేడుకున్నారు.
పలమనేరు పర్యటనలో గాయపడిన హేమలతకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో గిఫ్ట్ పంపారు. వైసీపీ ట్రోల్స్‌ను ఖండించిన జనసేన జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్, పవన్ కళ్యాణ్ తరఫున ఆమెకు నిత్యావసరాలు, 10వేలను ఆర్థిక సహాయం అందించారు. హేమలతకు వితంతు పెన్షన్ కూడా ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో నటుడు విజయ్ దేవరకొండ సీఐడీ విచారణ గంటన్నర పాటు జరిగింది. తాను ప్రమోట్ చేసింది కేవలం గేమింగ్ యాప్ మాత్రమేనని, లీగల్‌గానే ప్రమోషన్లు చేశానని విజయ్ సీఐడీకి తెలిపారు. ఇకపై ఇలాంటి యాప్స్ ప్రమోట్ చేయనని చెప్పినట్లు తెలుస్తోంది.
తిరుపతి జిల్లా చంద్రగిరిలో వివాహేతర సంబంధం కారణంగా ఓ పసికందు ప్రాణాలు కోల్పోయింది. చంద్రగిరికి చెందిన ప్రసన్న అనే మహిళ సుబ్రమణ్యం అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. సుబ్రహ్మణ్యం భార్యకు తెలియడంతో బందువులతో కలిసి ప్రసన్నపై దాడి చేసింది. దాడిలో ప్రసన్న ఏడాది కూతురు దక్షితకు తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విఫలమయ్యారని మాజీ వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి విమర్శించారు. తీర ప్రాంత రైతులకు ఇచ్చిన ఇంటికో ఉద్యోగం హామీ ఏమైందని ఆయన నిలదీశారు. భూముల ధర గురించి అడిగిన రైతులను ఆయన కసురుకున్నారని ఆరోపించారు.
కడప జిల్లా కమలాపురాన్ని పట్టిపీడిస్తున్న రైల్వే గేట్ సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. తాజాగా ఓ పాల వ్యాన్ ఢీకొట్టడంతో గేటు ఇరిగిపోయి ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో డెమో రైలును నిలిపివేశారు. ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీలో పీఎం జన్మన్ పథకం కింద ఇళ్లు నిర్మించుకోవాలని భావించిన కోలం, పీవీటీజీ గిరిజనులను అటవీ అధికారులు అడ్డుకున్నారు. దీనికి నిరసనగా ఆదిమ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లోని అటవీ శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, ఐటీడీఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
రాజేంద్రనగర్ పరిధిలోని హైదర్‌గూడా, జీపీఆర్ ఆర్కిడ్ అపార్ట్‌మెంట్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసిన ఇంటిని గుల్ల చేసి, 13 తులాల బంగారం, నగదు అపహరించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, క్లూస్ టీంతో దర్యాప్తు చేపట్టారు.
సోషల్ మీడియా ద్వారా యువతులతో పరిచయం పెంచుకుని, న్యూడ్ కాల్స్ రికార్డు చేసి బ్లాక్‌మెయిల్ చేస్తున్న వెంపటి జస్విన్‌ను ఏలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆడుదాం ఆంధ్రాలో క్రికెట్ ప్లేయర్‌గా ఉన్న జస్విన్, బంగారం, నగదు వసూలు చేశాడు. యువతులు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ శ్రావణ్ కుమార్ సూచించారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ఏపీలోని పల్నాడు జిల్లా, సీలేరు నుంచి మిర్యాలగూడకు అక్రమంగా రవాణా చేస్తున్నవారిని.. గంజాయి తీసుకుంటున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 15 మందిని అరెస్ట్ చేశారు. రెండున్నర కిలోల గంజాయి, ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అనంతపురంలోని తపోవనంలో చిన్న సిలిండర్ పేలి జిలాన్ భాష అనే వ్యక్తి మృతి చెందాడు. సిలిండర్లలో మోనో అమ్మోనియం నింపుతుండగా ప్రమాదం జరిగింది. భాషా మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి లడ్డూ ప్రసాదాన్ని అవమానించారని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు. కల్తీ నెయ్యి కేసు విచారణకు వచ్చిన.. భక్తుడిగా ఆయనకు లడ్డూ ఇస్తే తీసుకోకుండా పారిపోయారని చెప్పారు. కల్తీ నెయ్యి కేసులో కచ్చితంగా తప్పు జరిగిందని తెలిపారు.
ఏలూరు గణేష్ కాలనీకి చెందిన హరికృష్ణ హత్య కేసు నిందితుడు నాయక్ దీపక్ పోలీసులు అరెస్టు చేశారు. మద్యానికి డబ్బులు ఇవ్వమని వేధిస్తున్నాడని హరికృష్ణను దీపక్ హత్య చేశాడు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
అక్రమాస్తుల కేసులో ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు చుక్కెదురైంది. వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని జగన్ చేసిన అభ్యర్థనను సీబీఐ కోర్టు తిరస్కరించింది. దీంతో తాను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవుతానని జగన్ కోర్టుకు తెలిపారు.
జూబ్లీహిల్స్ గడ్డపై మూడు రంగుల జెండా రెపరెపలాడబోతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు 12 ఏళ్ల తర్వాత మరోసారి కాంగ్రెస్ గెలవబోతోంది. ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్నీ కాంగ్రెస్‌కే పట్టం కట్టాయి. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తాడని సర్వేలు చెబుతున్నాయి.
బిహార్‌లో మరోసారి ఎన్డీఏదే విజయంగా తేలింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ ఎన్డీఏ కూటమికే అనుకూలంగా వచ్చాయి. దైనిక్ భాస్కర్, మాట్రిజ్, పీపుల్స్ ఇన్‌సైట్, పీపుల్స్ పల్స్, జేవీసీ, పీ మార్క్ వంటి ఫేమస్ ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థలన్నీ ఎన్డీఏదే గెలుపు అని చెబుతున్నాయి.
మహారాష్ట్ర రాష్ట్రం కొల్హాపూర్‌లోని జనావాసంలోకి వచ్చిన చిరుతపులిని బంధించే క్రమంలో పోలీసులపై దాడికి యత్నించింది. చిరుత దాడి చేయడంతో పోలీసులు పరుగులు తీశారు. చాలాసేపు శ్రమించి చివరకు చిరుతను బోనులో బంధించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
నవంబర్ 14 నుంచి భారత్, దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ మొదలవుతుంది. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా చిత్రాలతో ముద్రించిన ప్రత్యేక బంగారు నాణెంను టాస్ కోసం ఉపయోగించనున్నారు. కోల్‌కతాలో తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుండగా.. కట్టుదిట్టమైన భద్రతకు అధికారులు సిద్ధమవుతున్నారు.
నటుడు అల్లరి నరేశ్ తొలిసారిగా పూర్తిస్థాయి సస్పెన్స్ థ్రిల్లర్ 12ఎ రైల్వే కాలనీలో నటిస్తున్నారు. ట్రైలర్ విడుదల సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ… పొలిమేర షోరన్నర్ అనిల్ విశ్వనాథ్ కథ అందించిన ఈ సినిమా స్క్రీన్‌ప్లే చాలా రేసీగా ఉంటుందన్నారు. ఎవరు విలనో చివరి వరకూ కనిపెట్టలేరని నరేశ్ తెలిపారు.