బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో ప్రెస్‌మీట్ నిర్వహించడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేశారని, ఆమెపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
ప్రకాశం జిల్లా కనిగిరిలో ఎంఎస్‌ఎంఈ పార్కును ప్రారంభించారు సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి 20 లక్షల ఉద్యోగాలు తెచ్చేందుకు పెట్టుబడులు తీసుకొస్తున్నామని తెలిపారు. ఇంటికో పారిశ్రామికవేత్త ఉండాలనేది తమ లక్ష్యమన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ఏపీ బ్రాండ్‌ను పునరుద్ధరిస్తామని చెప్పారు.
జూబ్లీహిల్స్ బై పోల్‌లో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ఏ పార్టీ వారినైనా కేసు నమోదు చేయాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం కానీ నాయకులు ఎవరైనా పోలింగ్ జరిగే ఏరియాలో తిరిగితే చర్యలు తీసుకోవాలన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి ఓటమి భయంతో కాంగ్రెస్ అభ్యర్థిపై, పార్టీపై విషం చిమ్ముతున్నారని ఆరోపించారు.
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లిలో పాఠ్యపుస్తకాలు తరలించేందుకు ఉపాధ్యాయులు విద్యార్థులను హమాలీలుగా వాడారు. 9వ తరగతి చదివే నలుగురు విద్యార్థులు ఆటోలో పుస్తకాలు తరలిస్తుండగా, ప్రమాదవశాత్తు బోల్తా పడి గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
డ్రోన్ కెమెరా సాయంతో బాపట్ల జిల్లా చీరాల రూరల్ పోలీసులు పేకాటరాయుళ్ల భరతం పట్టారు. గుట్ట చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట శిబిరాన్ని డ్రోన్ కెమెరాతో గుర్తించారు. నక్కలవారిపాలెం పొలాల్లో పేకాట ఆడుతున్న శిబిరాన్ని గుర్తించి పేకాట ఆడుతున్న 14 మందిని ఈపూరుపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి లక్ష 69వేల నగదు, 14 సెల్ ఫోన్లు, 3 బైకులను స్వాధీనం చేసుకున్నారు.
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం టేకుమంద గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. రైతులకు చెందిన పంటపొలాలను ఏనుగులు ధ్వంసం చేశాయి. సుమారు 5 ఎకరాల్లో వరి, అరటి, మామిడి పంటలను తొక్కి నాశనం చేశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
భోగాపురం మండలం చెరుకుపల్లిలో పాఠశాల భవనం లేక విద్యార్థులు 8 ఏళ్లుగా దాతలు చెల్లించే అద్దె భవనంలో చదువుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే లోకం మాధవి ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోలేదని పెదవి విరుస్తున్నారు.
హన్మకొండ జిల్లా శాయంపేట ఐకేపీ సెంటర్లలో రబీ ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడిన 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఐకేపీ ఇన్‌ఛార్జ్, ఆపరేటర్లు నకిలీ రైతులతో కుమ్మక్కై 2.10 కోట్ల నిధులను పక్కదారి పట్టించారు. నిందితుల నుంచి 1.07 కోట్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నామని డీసీపీ అంకిత్ కుమార్ తెలిపారు.
జనగామలోని సిరి లేడీస్ హాస్టల్‌లో వరంగల్ జిల్లాకు చెందిన మౌనిక అనే యువతి భవనం రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. స్పాట్‌లో సూసైడ్ లెటర్ లభించింది. తీవ్ర గాయాలైన యువతిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.
గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ పర్యటించారు. 1.20 కోట్లతో పునరుద్ధరించిన వెంగళాయపాలెం చెరువును ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. దీని ద్వారా భూగర్భ జలాలు, మత్స్య సంపద పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
ఏపీఐఐసీకి సంబంధించి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేశారు మంత్రి పయ్యావుల కేశవ్. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు మంత్రి. అనంతపురంలోని జెఎన్టీయూ మార్గంలో ఉన్న సెరికల్చర్ ఆఫీస్ ప్రాంగణంలో 4 ఎకరాల విస్తీర్ణంలో ఈ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సుమారు 16 కోట్ల నిధులు కేటాయించారు.
సిద్దిపేట జిల్లా శంకర్ నగర్ వద్ద గజ్వేల్ MRO శ్రవణ్ కుమార్‌కు రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కల్వర్టును ఢీ కొట్టింది. శ్రవణ్ కుమార్‌కు గాయాలుకాగా.. ఆసుపత్రికి తరలించారు. ఆయన కరీంనగర్ నుండి గజ్వేల్‌కు వస్తుండగా ప్రమాదం జరిగింది.
స్కూల్ బస్ ఢీకొని రెండేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరసాలబోడు తండాలో చోటు చేసుకుంది. విద్యార్థుల కోసం వచ్చిన స్కూల్ బస్సు ఇంటిముందు ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడు దర్శిక్ నాయక్ పైనుంచి దూసుకెళ్లింది. కుమారుడి మరణంతో భూక్య గోపి, అఖిల దంపతులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
ఆదిలాబాద్‌లో రైతు సమస్యలపై బీజేపీ ధర్నా చేయడం హాస్యాస్పదమని డీసీసీబీ ఛైర్మన్ అడ్డి భోజారెడ్డి విమర్శించారు. కేంద్రం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు సీసీఐతో మాట్లాడి పత్తి సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదని నిలదీశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి సెంట్రల్ పార్క్ సమీపంలో అడవి పందుల గుంపు అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చింది. వాటిని ఢీకొని ఓ ప్యాసింజర్ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్ శాంతియుతంగా కొనసాగుతోంది. ఉదయం ప్రారంభమైన ఓటింగ్‌లో సాధారణ ఓటర్లతో పాటు సినీ ప్రముఖులు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తాజాగా నటుడు గోపిచంద్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. శ్రీనగర్ కాలనీలోని మహిళ సమాజం పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
ఒక వ్యక్తి పితృత్వాన్ని నిరూపించి తీరాల్సిన అవసరం లేని సాధారణ కేసుల్లో కోర్టులు డీఎన్‌ఏ పరీక్షకు తేలికగా ఆదేశాలు జారీ చేయరాదని కోర్టులకు సుప్రీం స్పష్టంచేసింది. డీఎన్‌ఏ పరీక్ష జరపాలన్న ఆదేశాలను అతి జాగ్రత్తగా అన్ని విషయాలూ పరిగణనలోకి తీసుకున్నాకే జారీ చేయాలని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర, జస్టిస్ విపుల్ పంచోలీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
తమిళనాడు రాష్ట్రం అరియలూర్ జిల్లా వారణవాసి వద్ద సిలిండర్ లారీ ప్రమాదం జరిగింది. లారీ దెబ్బతినడంతో, సిలిండర్లు పేలి కిలోమీటర్ల దూరం వరకు శబ్దాలు వినిపించాయి. డ్రైవర్ కనగరాజ్‌ను ఆసుపత్రికి తరలించారు. కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
కెనడియన్-హంగరియన్-బ్రిటిష్ రచయిత డేవిడ్ సలై ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ గెలుపొందారు. తన రచించిన ‘ఫ్లెష్’ నవలకుగానూ ఈ అవార్డు దక్కింది. 51 ఏళ్ల డేవిడ్ సలై తుదిపోరులో ఐదుగురు పోటీదారులను అధిగమించి బుకర్ ప్రైజ్‌కు ఎంపికయ్యారు. దీంతో అవార్డు గెలుచుకున్న డేవిడ్‌కు రూ.50,000 పౌండ్లు దక్కనున్నాయి.
పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. కోర్టు కాంప్లెక్స్‌లో జరిగిన ఈ పేలుడు ధాటికి 12 మంది స్పాట్‌లోనే మృతి చెందగా.. మరో 20 మందికి గాయాలయ్యాయి. అయితే కార్‌లో గ్యాస్‌ను పేల్చి ఈ పేలుడుకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు.