కరీంనగర్ జిల్లా కొండన్నపల్లి గ్రామంలో కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పంట పొలాలను నష్టం చేయడమే కాకుండా గ్రామంలోని ఇండ్లలోకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దీంతో కోతుల నివారణకు గ్రామ యువకులు ఓ చక్కటి ఆలోచనతో చింపాంజీ దుస్తులను ధరించి గ్రామం నుంచి కోతులను తరిమేస్తున్నారు. వానరాలను తరమడంలో కీలకపాత్ర పోషిస్తున్న యువకులను గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు.
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఘటనపై వీసీ యాక్షన్ తీసుకున్నారు. ర్యాగింగ్‌ను ప్రోత్సహించి… విద్యార్థినులను వేధిస్తున్నాడని సైకాలజీ విభాగాధిపతి, ప్రొఫెసర్ విశ్వనాథరెడ్డిపై ఆరోపణలు వినిపించాయి. విశ్వనాథ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ మూడు రోజుల నుంచి ఆందోళనకు దిగాయి విద్యార్థి సంఘాలు. దీంతో ప్రొఫెసర్ విశ్వనాథరెడ్డిని సస్పెండ్ చేశారు వీసీ.
సంగారెడ్డి పట్టణంలోని గురుద్వారాను సందర్శించారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. సిక్కుల భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కత్తి సాము చేస్తూ సందడి చేశారు. సిక్కుల కోసం ప్రత్యేకంగా కమ్యూనిటీ హాల్‌తో పాటు, గురుద్వారా రోడ్డులో కమాన్ నిర్మిస్తానని సర్దార్‌లకు హామీ ఇచ్చారు జగ్గారెడ్డి.
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ హరిజన వీధికి చెందిన కొత్తపల్లి లీలావతి అనే మహిళ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు ఫైర్ సిబ్బంది సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తమను ఆదుకోవాలని లీలావతి బోరున విలపిస్తోంది.
బిగ్ టీవీ ఎఫెక్ట్.. కాకినాడ జిల్లా పిఠాపురంలో కల్తీ నెయ్యి కేంద్రం మూతపడింది. కల్తీ నెయ్యి వ్యవహారంపై బిగ్ టీవీలో కథనాలు వచ్చాయి. దీనిపై స్పందించిన అధికారులు మాధవనగర్ పరిధిలోని నెయ్యి కేంద్రంపై చర్యలు తీసుకున్నారు. అక్కడ దొరికిన జంతు వ్యర్థాలను, ఆయిల్‌ని సీజ్ చేసి డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్. వాటి కొంతభాగాన్ని శాంపుల్ టెస్ట్‌కు పంపిస్తామని వివరించారు. ఈ ఘటనపై బిగ్ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు విశ్వ హైందవ పరిషత్ అధ్యక్షులు దువ్వ వెంకటేశ్వరరావు.
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు లంచం అడుగుతున్నట్లు.. పనులు జాప్యం చేస్తున్నట్లు ఏసీబీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచిర్యాల పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్. మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూముల వివరాలతో పాటు పలు రికార్డులను పరిశీలించారు.
కర్నూలు జిల్లా సిద్ధాపురంలో తీవ్ర విషాదం నెలకొంది. కరెంట్ షాక్‌తో సోమశేఖర్ అనే బాలుడు మృతి చెందాడు. ఇంట్లో కుళాయి మోటార్ పట్టుకోవడానికి వెళ్లిన క్రమంలో బాలుడికి షాక్ కొట్టింది. బాలుడిని బళ్లారి ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే మృతి చెందాడు. దీంతో బాలుడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
తిరుమల పరకామణి చోరీ కేసులో దర్యాప్తును వేగవంతం చేసింది సీఐడీ. 20 మంది సభ్యులతో ఐదు బృందాలుగా ఏర్పడి వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యర్ తెలిపారు. పరకామణి భవనం, సీసీటీవీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను పరిశీలించినట్టు చెప్పారు. డిసెంబర్ 2లోగా హైకోర్టుకు పూర్తి నివేదిక సమర్పిస్తామని స్పష్టం చేశారు డీజీ.
జనగామ జిల్లా కేంద్రంలో గానుగుపాడు, చిటకోడూరు గ్రామాల బ్రిడ్జి నిర్మాణం కోరకు నిరసన తెలిపిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన యువకులను విడుదల చేయాలంటూ బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో బీజేపీ నాయకులకు పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వారిపై పెట్టిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
SRM యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఘటనపై గుంటూరు కలెక్టర్ తమీమ్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసింది. అలాగే కమిటీ విచారణ అధికారిగా తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హాను ప్రభుత్వం నియమించింది. అయితే SRM యూనివర్సిటీలో విచారణ చేపట్టామని సబ్ కలెక్టర్ సిన్హా తెలిపారు. యూనివర్సిటీలోని 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యినట్లుగా గుర్తించామన్నారు. ఫుడ్ పాయిజన్ అవ్వడానికి గల కారణాలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు సబ్ కలెక్టర్ సిన్హా.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మట్టి టిప్పర్ల ఆగడాలు స్థానిక ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. అధిక లోడుతో, అతివేగంగా దూసుకుపోతున్న ఈ భారీ వాహనాలు రోడ్లపై భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. పాదచారులు, చిన్న వాహనదారులు తీవ్ర భయాందోళనలో ప్రయాణించాల్సి వస్తోంది. ప్రమాదాల ముప్పు పొంచి ఉందని స్థానికులు వాపోతున్నారు. స్థానికులు పలుమార్లు అధికారులకు మొరపెట్టుకున్నా, ఇప్పటికీ టిప్పర్ల వేగ నియంత్రణకు గట్టి చర్యలు కరవయ్యాయి.
ప్రొద్దుటూరులో జరుగుతున్న అనేక అసాంఘిక కార్యకలాపాలకు, బెట్టింగ్‌లకు ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి మద్దతిస్తున్నారని రాచమల్లు ఆరోపించారు. కేవలం స్థానిక బెట్టింగ్ మాత్రమే కాకుండా, ప్రొద్దుటూరు ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో వ్యక్తులను గోవాకు తరలించి, అక్కడ క్యాసినోలు ఆడిస్తున్నారని రాచమల్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో ఒడిశా RTC బస్సులో మంటలు చెలరేగాయి. విశాఖ నుంచి జయపుర వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో తృటిలో ప్రమాదం తప్పింది. ప్రయాణికులను కిందకు దించేసి బస్సును పక్కకు ఆపేశాడు డ్రైవర్. ఈ ఘటనలో బస్ పూర్తిగా దగ్ధం అయింది.
జనగామ జిల్లాలో కుల బహిష్కరణ వివాదం నెలకొంది. దళితుల ఇళ్లల్లో పెళ్లిళ్లకు కుమ్మరి కులస్తులు కుండలు ఇవ్వడంతో బీసీ, అగ్రకుల సంఘాలు తమను బహిష్కరించారని కుమ్మరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కుమ్మరి కులస్తులు డీసీపీకి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా రోళ్ళ ఎంపీడీవోపై దాడి చేశారు వైసీపీ మాజీ ఎంపీపీ కవిత భర్త విజయరంగ గౌడ్. తాము చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు మంజూరు చేయాలని ఎంపీడీవో నాగేశ్వరశాస్త్రితో వాగ్వాదం చేసుకున్నాడు. ఎంపీడీవో తన ఛాంబర్ నుంచి బయటకు వెళుతుండగా నెట్టేశాడు. దీంతో నాగేశ్వర శాస్త్రి కాలుకు గాయం అయ్యింది. దీంతో విజయరంగా పై రోళ్ళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు ఎంపీడీవో.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడవుల్లో సుడిగాలులపై అటవీశాఖ అధికారుల ఆరా తీస్తున్నారు. లెంకలగడ్డ అడవుల్లో సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. వందల సంఖ్యలో చెట్లు విరిగిపడ్డాయి. పంటపొలాలు ధ్వంసమయ్యాయి. రాకాసి గాలులు పంటలను, చెట్లను నేలమట్టం చేశాయి. ధ్వంసమైన పంటలను చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఫారెస్ట్ అధికారులు అడవుల్లో విచారణ జరుపుతున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. వలసేతర వీసాలపైనా ఉక్కుపాదం మోపుతూ, 2025 జనవరి నుంచి 80 వేలకు పైగా వీసాలను రద్దు చేశారు. సోషల్ మీడియా వెట్టింగ్, స్క్రీనింగ్‌లను విస్తరించారు. వీసా రద్దులు గతంతో పోలిస్తే రెట్టింపు అయ్యాయి. దీనికి సంబంధించి అమెరికా వార్తా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించగా.. వైట్‌హౌస్ దీన్ని ధ్రువీకరించింది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ 8న వారణాసిలో పర్యటించనున్నారు. 4 కొత్త వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లను ప్రారంభించనున్నారు. ఈ ట్రైన్లు బనారస్-ఖజురహో, లఖ్‌నవూ-సహరన్‌పుర్, ఫిరోజ్‌పుర్-దిల్లీ, ఎర్నాకుళం-బెంగళూరు దారుల్లో నడవనున్నాయి. భారత రైల్వే ఆధునికీకరణలో ఇది మరో ముఖ్యమైన మైలురాయిగా నిలవనుందని పీఎంఓ ఓ ప్రకటన తెలిపింది.
సైన్స్ ఎక్స్ ఫోజర్ టూర్‌లో భాగంగా ఏపీ విద్యార్థులు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఏపీ సైన్స్ సిటీ, సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో జిల్లాకు ఇద్దరు చొప్పున 52 మంది విద్యార్థులు ఢిల్లీకి చేరుకున్నారు. అలాగే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును విద్యార్థులు కలవనున్నారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ ప్యాలస్‌లో ఈ జంట వివాహం అంగరంగ వైభవంగా చేసేందుకు ఇరు కుటుంబాలు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.