E-Paper
Advertisement

Top 20 News Today: మావోయిస్టుల లొంగుబాటుపై కీలక ప్రకటన, రాజమౌళికి బీజేపీ నేత మాధవీ లత కౌంటర్

Top 20 News Today: మావోయిస్టుల లొంగుబాటుపై కీలక ప్రకటన, రాజమౌళికి బీజేపీ నేత మాధవీ లత కౌంటర్

1. సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో మోదీ

ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో జరిగిన సత్యసాయి శతాబ్ది ఉత్సవాలకు హాజరయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ. సత్యసాయి మహాసమాధిని సందర్శించి నివాళులర్పించారు. ముందుగా ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు సీఎం చంద్రబాబు, పవన్‌, లోకేష్‌ ఘన స్వాగతం పలికారు.

2. శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో ఐశ్వర్యరాయ్

పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో నటి ఐశ్వర్యరాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని గౌరవించినందుకు ప్రధాని మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు. మోదీ ఉనికి.. సత్యసాయి బాబా చెప్పిన సేవ దేశానికి పవిత్రతను, ప్రేరణను జోడిస్తుందని ఆమె అన్నారు.

3. మావోయిస్టుల లొంగుబాటుపై ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా కీలక ప్రకటన

మావోయిస్టుల లొంగుబాటుపై ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా కీలక ప్రకటన చేశారు. ఎన్‌కౌంటర్ల భయమున్న మావోయిస్టులు మీడియా ముందు లొంగిపోవాలని సూచించారు. మావోయిస్టులు లొంగిపోవడానికి వస్తే స్వాగతిస్తామని వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులలో ఒక్కరిని కూడా తాము ఎన్‌కౌంటర్‌ చేయలేదన్నారు.

4. సౌదీ అరేబియాలో మరణించినవారి కుటుంబ సభ్యులు ఉమ్రాకు..

సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో మరణించిన వారి దహన సంస్కారాల కోసం 39 మంది కుటుంబ సభ్యులు ఉమ్రాకు బయలుదేరారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి వెళ్లిన వీరి ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. వారం రోజులు వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని, మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

5. రాజమౌళికి బీజేపీ నేత కౌంటర్

దర్శకుడు రాజమౌళికి కౌంటర్ ఇచ్చారు బీజేపీ నేత మాధవీ లత. బాహుబలి సినిమాలో ప్రభాస్‌తో శివలింగాన్ని ఎత్తించి కోట్లు సంపాదించారు.. అప్పుడేమైనా ఏ శివాలయానికైనా దానధర్మాలు చేశారా అని ప్రశ్నించారు. ఆరోజు చేసింది లేదు కానీ ఈరోజు ఆంజనేయ స్వామిని తిట్టడం ఎందుకు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

6. నాగర్‌కర్నూల్ జిల్లాలో పత్తి రైతులకు తీరని కష్టాలు..

నాగర్‌కర్నూల్ జిల్లాలో పత్తి రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. దళారులు సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద మాటు వేసి రైతుల నుంచి తక్కువ ధరకు విక్రయించి.. వేరే రైతుల సహకారంతో అధిక రేటుకు అమ్ముకుంటున్నామని ఆరోపించారు.

7. తొర్రూరులో మహిళ వాటర్ ట్యాంక్ ఎక్కి హల్‌చల్

తొర్రూరులో ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఒక మహిళ వాటర్ ట్యాంక్ ఎక్కి హల్‌చల్ చేసింది. తన ఫిర్యాదును పట్టించుకోలేదని, మూడు నెలలుగా ఇబ్బందులకు గురిచేశారని ఆమె ఆరోపించింది. పోలీసులు, స్థానికులు నచ్చజెప్పడంతో ఆమె కిందకు దిగింది.

8. విజయవాడలో మావోయిస్టులు.. భయాందోళనలో ప్రజలు

విజయవాడ కొత్త ఆటోనగర్‌లో ఓ బిల్డింగ్‌లో మావోయిస్టులు ఉన్నారని తెలిసి భయాందోళనకు గురయ్యామని భవనం ఎదురుగా ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు తెలిపారు. పది రోజుల క్రితం భవనంలో అద్దెకు ఉండటానికి కొంత మంది వస్తున్నారని సెక్యూరిటీ తెలిపారన్నారు. ప్రతీ రోజూ ఓ వ్యక్తి భోజనాలను మూడో ఫ్లోర్‌కు తీసుకెళ్లేవాడని వారు చెప్పారు.

9. పత్తి కొనుగోళ్లు తిరిగి మొదలు

ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు తిరిగి మొదలయ్యాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలం కావడంతో సీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. సమస్యను పది రోజుల్లోగా పరిష్కరిస్తామని సీసీఐ సీఎండీ హామీ ఇవ్వడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.

10. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న దత్తాత్రేయ, శశిధర్ రెడ్డి

కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో కొలువుతీరిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని బండారు దత్తాత్రేయ, మర్రి శశిధర్ రెడ్డి దర్శించుకున్నారు. వీరికి ఆలయ డిప్యూటీ కమిషనర్, ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు స్వామివారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

11. మోడ్రన్ హరిదాసులు బైక్‌లపై ఇంటింటికి తిరుగుతూ సందడి..

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మోడ్రన్ హరిదాసులు బైక్‌లపై ఇంటింటికి తిరుగుతూ సందడి చేశారు. తమ కుటుంబం నాలుగు తరాల నుంచి ధనుర్మాస సమయంలో హరిదాసులుగా ఇంటింటికి వెళ్తున్నామని తెలిపారు. హరిదాసులను ప్రభుత్వం గుర్తించి వారికి సహాయం అందించే విధంగా చేయాలని కోరారు.

12. సూర్యాపేట జిల్లాలో పుల్లయ్య గౌడ్ కల్లుకు విపరీతమైన డిమాండ్

సూర్యాపేట జిల్లా మాచిరెడ్డిపల్లిలో నాతి పుల్లయ్య గౌడ్ గీస్తున్న జీలుగు కల్లుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీన్ని తాగితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయని, బీపీ, షుగర్ వంటివి నివారించవచ్చని గౌడన్న చెబుతున్నారు. దీని కోసం జనాలు క్యూ కడుతున్నారు.

13. టీటీడీ కల్లీ నెయ్యి కేసులో సిట్‌ దర్యాప్తు వేగవంతం

టీటీడీ కల్లీ నెయ్యి కేసులో సిట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. టీటీడీ మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్నప్పన్‌ను విచారణ చేస్తుంది. గత రెండ్రోజులుగా చిన్నప్పన్‌ను విచారణ చేస్తున్న సిట్‌ అధికారులు.. మూడో రోజు విచారణకు తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌ నుంచి సిట్‌ కార్యాలయానికి తరలించారు.

14. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన సోనియా, రాహుల్..

నేడు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలోని శక్తిస్థల్‌ను సందర్శించి, నివాళులర్పించారు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ. వారితో పాటు మల్లికార్జున ఖర్గే, కేసి వేణుగోపాల్ పలువురు కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. ఇందిరా గాంధీ ధైర్యం, దేశభక్తి, నైతికత.. అన్యాయానికి వ్యతిరేకంగా, దృఢంగా నిలబడటానికి తనను ప్రేరేపిస్తూనే ఉన్నాయన్నారు రాహుల్.

15. తల్లి ప్రాణాలను నిలిపిన ఘనత భారతదేశానికే దక్కుతుంది-సాజిబ్‌ వాజేద్‌

తన తల్లి ప్రాణాలను నిలిపిన ఘనత భారతదేశానికే దక్కుతుందని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజిబ్‌ వాజేద్‌ తెలిపారు. హసీనాపై హత్యాయత్నాన్ని భారత్ నిరోధించిందని అన్నారు. భారత్ ఎల్లప్పుడూ మంచి మిత్రదేశంగా ఉందని, సంక్షోభ సమయంలో ఆమె ప్రాణాలు కాపాడినందుకు ప్రధాని మోదీకి ఎల్లప్పుడూ కృతజ్ఞుడినై ఉంటానని తెలిపారు.

16. పశ్చిమాసియా పవర్‌ బ్యాలెన్స్‌లో కీలక మార్పు

పశ్చిమాసియా పవర్‌ బ్యాలెన్స్‌లో కీలక మార్పు రాబోతోంది. ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు అమెరికా నుంచి F-35 యుద్ధ విమానాలను పొందిన ఏకైక దేశం ఇజ్రాయెల్‌. ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సౌదీ అరేబియాకు కూడా ఈ జెట్‌లను అమ్మడానికి సిద్ధమయ్యారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా చర్చ మొదలైంది.

17. మెడ నొప్పితో బాధపడుతున్న శుభ్‌మన్ గిల్

మెడ నొప్పితో బాధపడుతున్న టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. ఈనెల 22 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే రెండో టెస్టులో ఆడే అవకాశాలు కనిపించట్లేదు. ట్రావెల్ చేయడం వల్ల గాయం తీవ్రత పెరిగి, దీర్ఘకాలిక సమస్యగా మారే అవకాశం ఉందని.. మెడికల్ టీమ్ ఆయనకు ప్రయాణాలు చేయొద్దని సూచించింది.

18. బాక్సింగ్‌ కప్‌లో భారత బాక్సర్ల హవా

ప్రపంచ బాక్సింగ్‌ కప్‌లో భారత బాక్సర్ల హవా కొనసాగుతోంది. మహిళల 54 కేజీల సెమీఫైనల్‌లో ప్రీతి ప్రపంచ ఛాంపియన్‌ హంగ్‌ హిసావోని కంగు తినిపించి తుది పోరుకు అర్హత సాధించింది. ప్రపంచ ఛాంపియన్‌ మీనాక్షి హుడా కూడా ఫైనల్‌ చేరింది.

19. సనాతన హైందవ ధర్మం శక్తిని అఖండ 2లో చూస్తారు- బాలకృష్ణ

మన సనాతన హైందవ ధర్మం శక్తిని.. పరాక్రమాన్ని.. గౌరవాన్ని ‘అఖండ 2 తాండవం’లో చూస్తారని అన్నారు కథానాయకుడు బాలకృష్ణ. ఆయన.. సంయుక్తా మేనన్‌ జంటగా నటించిన ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని బోయపాటి శ్రీను తెరకెక్కించారు.ఈ సినిమా డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రంలోని ‘జాజికాయ జాజికాయ’ అనే పాటను వైజాగ్‌లో విడుదల చేశారు.

20. గ్లోబ్‌ ట్రాటర్‌ ఈవెంట్‌‌ను యూట్యూబ్‌ వేదికగా చిత్రబృందం

ఇటీవల జరిగిన గ్లోబ్‌ ట్రాటర్‌ ఈవెంట్‌‌ను యూట్యూబ్‌ వేదికగా చిత్రబృందం విడుదల చేసింది. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’. నవంబర్‌ 15న ఈ చిత్రం టైటిల్‌ గ్లింప్స్‌ లాంఛ్ ఈవెంట్‌ జరిగిన విషయం తెలిసిందే. జియో హాట్‌స్టార్‌ వేదికగా లైవ్‌లో దీన్ని చూసే అవకాశం కల్పించింది.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×