2015-16 గ్రూప్-2ను హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు సంచలన తీర్పు ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. TGPSC పరిధి దాటి వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా నాటి ఎంపిక జాబితాను కొట్టివేసింది. జవాబు పత్రాల్లో ట్యాంపరింగ్ జరిగిందని స్పష్టంగా కనిపిస్తున్నపుడు వాటిని పక్కన పెట్టకపోవడం కమిషన్ వైఫల్యమేనని తేల్చి చెప్పింది హైకోర్టు.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం 73,74 సవరణ ప్రకారం ఎన్నికలు జరిపితేనే 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు రాష్ట్రానికి వస్తాయని తెలిపారు. 4వేల కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నాయని, పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. స్థానిక సంస్థలు ఎన్నికల్లో అన్నిచోట్ల బీజేపీ పోటీ చేస్తుందన్నారు.
వైకుంఠ ఏకాదశిపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల 30 నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు జరగనున్నట్లు తెలిపింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు ప్రాధాన్యతను ఇవ్వనుంది. ఈ సందర్భంగా టీటీడీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టింది.
ఇవాళ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపట్టింది. కోటి మంది మహిళలకు కోటి చీరలను ఉచితంగా పంపిణీ చేయనుంది. ఇందిరమ్మ చీరల పంపిణీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర అందించాలని సూచించారు.
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో సముద్రంలో తెప్ప బోల్తా పడడంతో మత్స్యకారుడు మృతి చెందాడు. పోలాకి మండలం గుప్పిడిపేట నుంచి ముగ్గురు మత్స్యకారులతో వేటకు బయలుదేరిన చెక్క రాజయ్య తెప్పపై సముద్రంలోకి వెళ్తుండగా బోల్తా పడింది. స్థానికులు మృతదేహాన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు.
ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలన్నారు నిర్మాత సి.కల్యాణ్. కడుపు మంట, బాధతో మాట్లాడుతున్నట్లు చెప్పారు. ఒకవేళ అదే జరిగితే ఇలాంటి పనులు చేయాలంటే మరొకరు భయపడతారని అన్నారు. ఇక రవిని పట్టుకున్న పోలీసు అధికారులను ఛాంబర్ తరఫున త్వరలో సత్కరిస్తామని నిర్మాత చెప్పారు.
హైదరాబాద్‌లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ప్రముఖ హోటళ్ల ఛైర్మన్‌లు, డైరెక్టర్‌ల ఇళ్లల్లో రైడ్స్ చేస్తున్నారు. సుమారు 600 మంది ఐటీ అధికారులు 30 బృందాలుగా ఏర్పడి నగరంలో 15 చోట్ల ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు, లెక్కల్లో చూపని.. లావాదేవీలకు సంబంధించిన ఆరోపణలతో ఐటీ అధికారులు రంగంలోకి దిగారు.
తెలుగు రాష్ట్రాలను చలి గజగజ వణికిస్తోంది. తెలంగాణలో 10 డిగ్రీలకంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నవంబర్‌లో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం చాలా అరుదు. సాధారణంగా డిసెంబర్ నెలాఖరు, జనవరి ఆరంభంలో కొద్ది రోజులపాటు 10 కంటే తక్కువ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ ఈ సంవత్సరం నవంబర్ నెలలో ఉన్నఫలంగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి.
జిన్నింగ్ మిల్లర్లు, CCI సీఎండీతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో ఇవాళ్టి నుంచి కొనుగోళ్లను పునఃప్రారంభించేందుకు మిల్లర్లు అంగీకరించారు. జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై కేంద్రానికి నివేదిక సమర్పించాలని వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్‌ను తుమ్మల ఆదేశించారు. నేటి నుంచి యథావిధిగా పత్తి కొనుగోళ్లు కొనసానున్నాయి.
ఏపీలో మావోయిస్టుల అరెస్టుల పర్వం ముమ్మరంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 50 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు పోలీసులు. ఇవాళ మావోయిస్టుల అరెస్టులపై వివరాలు వెల్లడించనున్నారు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా కమిషనర్, ఐజీ ఎస్వీ రాజశేఖర్ బాబు.
విశాఖ గోమాంసం అక్రమ నిల్వల వివాదంపై భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్పందించారు. ఆనందపురం మిత్ర కోల్డ్ స్టోరేజ్‌ను పరిశీలించారు. ఫిష్ ఓవర్‌సీస్ ఎండీ ఫరీద్ ఉమర్ లీజు భాగంలో అక్రమాలను ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారన్నారు. కంటైనర్‌లో గోమాంసం బయటపడటంతో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారని చెప్పారు.
ములుగు జిల్లా రామప్ప సరస్సు ఐలాండ్‌లో నిర్మించబోయే కట్టడాల నమూనాను టూరిజం అధికారులు విడుదల చేశారు. ఇందులో భారీ శివుడి విగ్రహం, అంతర్జాతీయ జ్ఞాన కేంద్రం, చిల్డ్రన్ పార్క్, కాటేజెస్, పిక్నిక్ ఏరియాను అత్యంత సుందరంగా తీర్చిదిద్దనున్నారు. ఐలాండ్ అభివృద్ధికి ప్రభుత్వం 13 కోట్లు విడుదల చేయగా.. మంత్రి సీతక్క పనులకు శంకుస్థాపన చేశారు.
ఏపీలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తం అయ్యారు. అల్లూరి సీతారామరాజు జిల్లా భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి. మారేడుమిల్లి అటవీ ప్రాంతం టైగర్ జోన్‌కు సమీపంలో సెర్చింగ్ చేస్తున్నారు అధికారులు. ఎన్‌కౌంటర్ సమయంలో తప్పించుకున్న వారి కోసం గాలింపు చేపట్టారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణ శిక్షను వ్యతిరేకిస్తూ.. హసీనా మద్దతుదారులు బంగ్లాదేశ్‌లో ఆందోళనలు చేపట్టారు. దీంతో దేశంలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. ఈ నిరసనల్లో ఇద్దరు మృతి చెందగా పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో యూనిస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో పోలీసులను మోహరించింది.
ఢిల్లీ పేలుడు ఘటనలో NIA దర్యాప్తు ముమ్మరం చేసింది. జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌లో NIA సోదాలు కొనసాగుతున్నాయి. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. అటు ఢిల్లీ పేలుడు ఘటనలో మరో కీలక నిందితుడు అరెస్ట్ అయ్యాడు. కారు బాంబు తయారు చేసిన జసీర్ బిలాల్‌ను NIA అరెస్ట్ చేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో మైన్ కూలిన ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఏడుగురి మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. కృష్ణా మైనింగ్ వర్క్స్ నిర్వహించే క్వారీలో కొంత భాగం కూలి ప్రమాదం చోటు చేసుకుంది.
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా.. ప్రపంచ దేశాలు సహించకూడదని భారత్ పేర్కొంది. దాన్ని ఎవరూ సమర్థించకూడదని సూచించింది. రష్యాలోని మాస్కోలో జరిగిన షాంఘై సహకార సంస్థ సమావేశంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ మాట్లాడారు. ఉగ్రవాదం నుంచి మా ప్రజలను రక్షించుకోవడానికి భారత్‌కు హక్కుంది. అందుకు అనుగుణంగా ఇప్పటికే గట్టి చర్యలు తీసుకుందని అన్నారు.
భారత్‌లో టెస్టు క్రికెట్ నాశనమైందని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మండిపడ్డాడు. బౌలర్లకు అత్యధిక సహకారం ఇచ్చే ఈడెన్ గార్డెన్స్ వంటి పిచ్‌లు క్రికెటర్ల అభివృద్ధిని అడ్డుకుంటాయన్నాడు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో 124 పరుగుల లక్ష్యం ఛేదించలేక ఓటమి చవిచూసిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పేలవ పిచ్‌లతో జట్టు గెలిచినా క్రికెటర్లు ఎదగరని విమర్శించారు.
పుట్టపర్తిలో నేడు జరగనున్న శ్రీసత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఎదురుచూస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. సమాజ సేవ, ఆధ్యాత్మిక కోసం సత్యసాయి బాబా చేసిన కృషి తరతరాలకు మార్గదర్శకంగా ఉంటుందన్నారు. బాబాతో సంభాషించడానికి, ఆయన నుంచి నేర్చుకోవడానికి గతంలో తనకు పలు అవకాశాలు లభించాయని.. ఆ అనుభవాలు తన జ్ఞాపకాల్లో పదిలంగా ఉన్నాయని మోడీ ట్వీట్ చేశారు.
కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కేశవ గ్రాండ్ హోటల్ సమీపంలోని.. హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారిపై ప్రమాదం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు స్పాట్‌లోనే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లారీ ఆపి రిపేరు చేసుకుంటున్న సమయంలో మరో లారీ వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. లారీ డ్రైవర్ అతివేగమా.. మద్యం మత్తులో డ్రైవింగ్ చేశాడా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.