E-Paper
Advertisement

Top 20 News Today: నటుడు విశాల్‌పై మద్రాసు హైకోర్టు ఆగ్రహం, శ్రీవారి సేవలో దర్శకుడు శైలేశ్ కొల‌ను

Top 20 News Today: నటుడు విశాల్‌పై మద్రాసు హైకోర్టు ఆగ్రహం, శ్రీవారి సేవలో దర్శకుడు శైలేశ్ కొల‌ను

1. జీజీహెచ్‌లో ఆకస్మిక తనిఖీలు..

గుంటూరు జీజీహెచ్‌లో ఆకస్మిక తనిఖీలు చేశారు ఆసుపత్రి సూపరింటెండెంట్ SSV రమణ. గత కొంతకాలంగా జీజీహెచ్‌ వైద్యులు, సిబ్బందిపై కొంత కాలంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వృద్ధుడి వేషంలో హాస్పిటల్‌కు వెళ్లి.. తనకు వైద్యం చేయాలని వైద్యులను కోరారు సూపరింటెండెంట్. ఆసుపత్రిలోని పలు విభాగాల వద్దకు వెళ్లి సిబ్బంది పనితీరును పరిశీలించారు.

2. కొన్ని గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలకు అడ్డంకిగా మారిన కోర్టు కేసులు

నిన్న తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. అయితే అనూహ్యంగా కొన్ని గ్రామ పంచాయతీ ఎన్నికలకు కోర్టు కేసులు అడ్డంకిగా మారాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 32 పంచాయతీలలో ఎన్నికలు నిలిచిపోయాయి.

3. బ్యాంక్‌లో అగ్ని ప్రమాదం..

కృష్ణా జిల్లా గుడివాడ యూనియన్ బ్యాంక్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. బైపాస్ రోడ్డులోని బ్యాంక్ నుంచి పొగలు రావడంతో.. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. బ్యాంక్ అద్దాలు పగల కొట్టి మంటలను అదుపు చేశారు.

4. హైదరాబాద్‌ను మెగా మెట్రోపాలిటన్ సిటీగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ కీలక నిర్ణయం..

హైదరాబాద్‌ను మెగా మెట్రోపాలిటన్ సిటీగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓఆర్‌ఆర్‌ లోపల, బయట, అలాగే దానికి ఆనుకుని ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని డెసిషన్ తీసుకుంది. అయితే.. ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

5. సత్యసాయి జిల్లా గోరంట్లలోని గిరిజన సంక్షేమ స్కూల్లో ఫుడ్ పాయిజన్..

శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలోని గిరిజన సంక్షేమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఆరుగురి విద్యార్థినులు ఫుడ్ తిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జ్వరం, విరేచనాలతో బాధపడుతున్నారు. వెంటనే వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు.. స్కూల్లో వంటలు వండే ప్రాంతాలను తనిఖీ చేస్తున్నారు.

6. మద్యం మత్తులో యువకుల వీరంగం

వరంగల్ జిల్లా నర్సంపేటలో మద్యం మత్తులో ఇద్దరు యువకులు వీరంగం సృష్టించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి చేశారు. నర్సంపేటలో దిగాల్సి ఉండగా.. నిద్రపోతున్న యువకులను డ్రైవర్ లేపాడు. తమపై చేయి చేసుకుంటావా..? అంటూ ఆగ్రహంతో డ్రైవర్‌పై దాడి చేశారు. దీంతో డ్రైవర్.. ఆ యువకులను పోలీసులకు అప్పగించాడు.

7. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవం

అంబేద్కర్ కోనసీమ జిల్లా కడలి కపోతేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరిగింది. సుబ్రమణ్య షష్టి సందర్భంగా వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకను చూడటానికి భక్తులు భారీగా తరలివచ్చారు.

8. ఆర్.కృష్ణయ్య మండిపాటు

తెలంగాణ ప్రభుత్వం జీవో 46ను తీసుకొచ్చి బీసీలకు అన్యాయం చేసిందన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య. మొదటి నుంచి 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని బీసీలకు ఆశచూపి, ఇప్పుడు 22శాతానికి పరిమితం చేశారంటూ మండిపడ్డారు. నిరాహార దీక్షలు, రహదారులు దిగ్బంధం చేస్తామన్నారు.

9. పరకామణి కేసులో దర్యాప్తు ముమ్మరం

టీటీడీ పరకామణి కేసు దర్యాప్తును సీఐడీ వేగవంతం చేసింది. సీఐడీ డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌ ఇన్వెస్టిగేషన్ టీమ్ పలువురిని విచారించింది. ఇప్పటికే తిరుమల, తిరుపతిలో పర్యటించి కేసుకు సంబంధించిన వివరాలను సేకరించింది. డిసెంబర్‍ 2 లోపు కేసుకు సంబంధించిన నివేదికను హైకోర్టుకు అందజేయాల్సిన నేపథ్యంలో విచారణ ముమ్మరం చేశారు.

10. అవినీతి కుంభకోణం- మల్లిఖార్జున రావు

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని గుంటూరు జిల్లా డీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లిఖార్జున రావు ఆరోపించారు. ఇటీవల మంగళగిరి, నల్లపాడు సహకార బ్యాంకులలో బయపటపడ్డ అవినీతి కుంభకోణంపై స్పందించారు. బ్యాంకులో పనిచేసే ఉద్యోగే నకిలీ డిపాజిట్ పత్రాలు సృష్టించి రైతులను మోసం చేశాడని అన్నారు.

11. గోలింగేశ్వర స్వామివారి ఆలయంలో ప్రారంభమైన షష్టి వేడుకలు

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులోని 8వ శతాబ్దం నాటి ప్రాచీన శ్రీ గోలింగేశ్వర స్వామివారి ఆలయంలో కొలువై ఉన్న శ్రీకుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్టి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

12. దారుణం.. విద్యార్థిపై దాడి..

నెల్లూరు జిల్లాలో విద్యార్థి జయంత్‌పై టీచర్ వల్లేపు అంజయ్య దాడి చేశారు. ఉదయగిరిలోని ప్రతిభా నవోదయ కోచింగ్ సెంటర్‌లో ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో గాయపడిన విద్యార్థిని హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న విద్యార్థి తల్లిదండ్రులకు కోచింగ్ సెంటర్‌కు చేరుకొని టీచర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

13. కామారెడ్డి జిల్లాలో రోడ్డుపై మహిళ నిరసన

కామారెడ్డి జిల్లా అశోక్ నగర్ కాలనీ కూరగాయల మార్కెట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. రోడ్డుకు ఇరువైపులా కూరగాయలు విక్రయిస్తున్నారంటూ మున్సిపల్ సిబ్బంది వాటిని తొలగించారు. దీంతో ఓ మహిళా విక్రయదారు తన జీవనోపాధిని కోల్పోతున్నానంటూ రోడ్డుపై పడుకుని నిరసన తెలిపింది.

14. శ్రీవారి సేవలో దర్శకుడు శైలేశ్ కొల‌ను

ప్రముఖ సినీ దర్శకుడు శైలేశ్ కొల‌ను నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందించారు. త్వరలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రారంభం కానున్న కొత్త సినిమా కోసం స్వామివారి ఆశీస్సులు కోరానని శైలేశ్ తెలిపారు.

15. నటుడు విశాల్‌పై మద్రాసు హైకోర్టు ఆగ్రహం

తాను ధనవంతుడు కాదని చెప్పిన నటుడు విశాల్‌ దివాలా తీశారని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారా అని మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. లైకా సంస్థకు ఇవ్వాల్సిన 21 కోట్ల 29 లక్షలను 30 శాతం వడ్డీతో చెల్లించాలని విశాల్‌ను ఆదేశిస్తూ మద్రాసు హైకోర్టు గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్‌పై జస్టిస్‌ ఎస్‌ఎం సుబ్రహ్మణ్యం, జస్టిస్‌ ముహమ్మద్‌ షఫీక్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది.

16. అయోధ్యలో నిర్మించిన రామాలయం అన్ని పనులు పూర్తి- మోడీ

శతాబ్దాలుగా కలిగిన గాయాలు ఇప్పుడు తీరాయని.. 500 ఏళ్ల నాటి సంకల్పం పూర్తిస్థాయిలో రామాలయ పనులు అన్నివిధాలా పూర్తిస్థాయిలో సాకారమైందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. యూపీలోని అయోధ్యలో భారీస్థాయిలో నిర్మించిన రామాలయం పనులు అన్నివిధాలా పూర్తయినట్లు ప్రకటించారు.

17. హెచ్‌-1బీ వీసాపై మహవష్‌ సిద్దిఖీ సంచలన ఆరోపణలు

అధిక నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం అమెరికా కంపెనీలు అందించే హెచ్‌-1బీ వీసాపై గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ వీసాలు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపణలు రావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా భారతీయ- అమెరికన్‌ దౌత్యవేత్త మహవష్‌ సిద్ధిఖీ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. నకిలీ డిగ్రీలు, రాజకీయ ఒత్తిళ్లతో భారతీయులు ఈ హెచ్‌-1బీ వీసాలు పొందుతున్నారంటూ ఆమె ఆరోపించారు.

18. పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు..

అఫ్గానిస్థాన్ – పాకిస్థాన్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ.. ఉగ్రవాదంపై శాంతి చర్చలు విఫలమవడంతో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని, అవి తగ్గే అవకాశాలు లేవన్నారు. అయితే పాక్ దాడుల గురించి అఫ్గాన్ ప్రతినిధి చేసిన ప్రకటనను ఆయన ఖండించారు.

19. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన స్మృతి మంధాన తండ్రి

భారత మహిళల క్రికెట్ జట్టు సభ్యురాలు స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ గుండెపోటు లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ కారణంగా మంధాన అదేరోజు మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్‌తో తన వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

20. త్వరలో విజయ్‌ సేతుపతి మరో సినిమా

శక్తిమంతమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన ఖాతాలో ఇప్పుడు మరో చిత్రం చేరింది. శింబు ప్రధాన పాత్రలో అరసన్‌ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్‌ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో విజయ్‌ సేతుపతి భాగమైనట్లు తెలుపుతూ.. నిర్మాత కలైపులి ఎస్‌.థాను సామాజిక మాధ్యమాల వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×