పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పెద్దమైనివానిలంక వద్ద నల్లి క్రీక్ డ్రైన్ డ్రెడ్జింగ్ పనులను ప్రారంభించారు. 10 కోట్లతో చేపట్టిన ఈ పనుల వల్ల 11,430 ఎకరాల పంటకు, 8 గ్రామాలకు ముంపు సమస్య తగ్గుతుందని మంత్రి తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల మరమ్మత్తులకు రూ.404 కోట్లు మంజూరు చేశామని తెలిపారు.
దిత్వా తుపానుపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు హోం మంత్రి అనిత. నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇవాళ రేపు అలెర్ట్‌గా ఉండాలని అధికారులను ఆదేశించారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ.. ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
హైదరాబాద్‌లోని కొత్తపేట చౌరస్తా వద్ద విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ అప్పారావుపై బైకర్ భరత్ రాయితో దాడి చేశాడు. హెల్మెట్ లేనందుకు చలాన్ విధించగా.. భరత్ 15 నిమిషాల తర్వాత తిరిగి వచ్చి, కానిస్టేబుల్‌పై రాయితో దాడి చేశాడు. దీంతో కానిస్టేబుల్ టాబ్ ధ్వంసమై, అతనికి స్వల్ప గాయాలయ్యాయి.
తిరుపతిలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ‘ఐబొమ్మ’లో సినిమాలు ఫ్రీగా చూశానని ఆయన అన్నారు. “ఆరేడు వందలు పెట్టి ఎలా చూసేది అని చూశా… అద్భుతమైన తెలివితేటలు ఉన్న రవి అలా మారడానికి ఈ వ్యవస్థలే కారణమని చెప్పారు నారాయణ.
కీలక వ్యాఖ్యలు
జగిత్యాల జిల్లా కొండగట్టులో అగ్నిప్రమాద స్థలాన్ని పరిశీలించారు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఈ సందర్భంగా.. 30 దుకాణాలు, ఇళ్లు కాలిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. తక్షణ సహాయం కింద ఒక్కొక్క బాధిత కుటుంబాలకు 20 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం దూళ్లిపాళ్ళ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి తల్లీ, కొడుకుపై కత్తితో దాడి చేసి గొంతులు కోశారు. ఈ దాడిలో కొడుకు సాంబశివరావు అక్కడికక్కడే మృతి చెందగా, తల్లి కృష్ణకుమారి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో బైక్ దొంగలు హల్ చల్ చేశారు. కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిపై ఉన్న మేడపి గ్రామంలో గ్రామ సచివాలయం ఉద్యోగి ముత్తలూరి బ్రహ్మం బైక్‌ను దర్జాగా ఎత్తుకెళ్లారు దొంగలు. బైక్ ఎత్తకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. బాధితుడు బ్రహ్మం ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
దిత్వా తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలో మోస్తారు వర్షం కురుస్తోంది. బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు సహా పలు మండలాల్లో స్వల్ప గాలులతో వర్షం, చలి తీవ్రత పెరిగింది. దీంతో చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. తుపాను ప్రభావం రేపు ఎక్కువగా ఉంటుందని హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
డిజిటల్ అరెస్ట్ కేసులో ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన పండు వినీత్‌రాజ్, తిరుపతయ్య, గౌని విశ్వనాథంలను పోలీసులు అరెస్టు చేశారు. వీరు సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు సరఫరా చేశారు. నిందితులు సీబీఐ అధికారులమని చెప్పి, ఆధార్ దుర్వినియోగంతో కేసు నమోదైందని బెదిరించి, బాధితుడు చాగంటి హనుమంతరావు నుంచి రూ.1.92 కోట్లు కాజేశారు.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని 7 మండలాల పరిధిలో రెండవ విడత స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. డిచ్‌పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి, సిరికొండ, జక్రాన్‌పల్లి, మోపాల్, నిజామాబాద్ మండలాల్లోని మొత్తం 170 గ్రామ పంచాయతీలు, 1530 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో చేరికలు జోరు అందుకున్నాయి. అశ్వారావుపేట మండలం అనంతారం గ్రామంలో టీడీపీ సహా పలు పార్టీల నుంచి 150 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలం అమడాల గ్రామం శివారులోని రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. తల, మొండెం వేరై ఉన్న మృతదేహంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇది ఆత్మహత్యా లేక హత్యా అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
భద్రాద్రి కొత్తగూడెం పాండు రంగాపురంలో రెండవ దశ పంచాయతీ నామినేషన్లు ప్రారంభం అయ్యాయి. అయితే ఎస్టీలు లేకుండానే ఎస్టీ రిజర్వేషన్‌తో కూడిన సర్పంచి పదవి ఇవ్వడంతో గ్రామస్తులు పంచాయతీ ఎలక్షన్లను బహిష్కరించారు. ఇది పార్టీలకు అతీతంగా మేము తీసుకున్న నిర్ణయమని తెలియజేశారు.
నంద్యాలలో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ సంస్థాగత కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమావేశమైయ్యారు. అనంతరం ముఖ్య అతిథులుగా కర్నాటక ఎమ్మెల్యే, నంద్యాల పార్లమెంటు అబ్జర్వర్ హరీష్ అధ్వర్యంలో జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ నియామకంపై అభిప్రాయాలను సేకరించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నూతన నాయకత్వంతో ముందుకు వెళ్తామని చెప్పారు.
కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామిని డాక్టరేట్ అవార్డు వరించింది. ఆఫ్రికా దేశానికి చెందిన మైలేస్ లీడర్ షిప్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవి ఆచార్యులు చేతుల మీదుగా డాక్టరేట్ అవార్డును ప్రదానం చేసి సన్మానించారు. గతంలోను గుల్బార్గ, బళ్లారి యూనివర్సిటీలు వేర్వేరుగా రెండు డాక్టరేట్లు అందించారు.
12 రాష్ట్రాల్లో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణకు గడుపు పెంచింది కేంద్ర ఎన్నికల సంఘం. ప్రస్తుత మున్న గడువుకు మరో 7 రోజులు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 4 వరకు జరగాల్సిన ఓటర్ల సవరణ డిసెంబర్ 11 వరకు జరగనున్నట్టు ప్రకటించింది.ఓటర్లు తమ పేర్లను ఎలక్టోరల్ రోల్స్‌లో తనిఖీ చేసుకొనేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకొంది కేంద్ర ఎన్నికల సంఘం.
ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో డ్రామాటిక్ రెస్క్యూ జరిగింది. రోడ్డుపైకి అకస్మాత్తుగా వచ్చిన చిన్నారిని తప్పించబోయిన కారు నియంత్రణ కోల్పోయి.. పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. అదే సమయంలో కారు నడుపుతున్న శుభమ్ తివారీ స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత అంతా సినిమాను తలపిస్తూ చాలా డ్రామాటిక్‌గా జరిగింది.
ఢిల్లీలో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కొత్తగా 10 కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో నాలుగు ఆర్థిక బిల్లులతో పాటు, కాలం చెల్లిన 120 చట్టాలను రద్దు చేసే బిల్లు ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. అణుశక్తి వినియోగం, జాతీయ రహదారుల భూసేకరణ, ఉన్నత విద్యలో భారత ఉన్నత విద్య కమిషన్ ఏర్పాటు వంటి అంశాలపై చట్ట సవరణ బిల్లులు కీలకంగా ఉన్నాయి.
రష్మిక ప్రధానపాత్రలో నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రం డిసెంబర్ 5 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 7న విడుదలైంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా డిసెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఇది అందుబాటులోకి రానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
వివాహం తర్వాత కూడా నాజూకుతనాన్ని మెయింటైన్ చేస్తున్న హీరోయిన్లలో రకుల్ ఒకరు. గతేడాది బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత హీరోయిన్ల కెరీర్ ముగిసిపోతుందనే భావన తప్పని, తన విషయంలో అలా జరగడం లేదని రకుల్ అన్నారు. అందాల ఆరబోత అనేది వ్యక్తిగతమని, పెళ్లి అందం హద్దులను చెరిపేయదని, పైగా ప్రోత్సహించే నిచ్చెనలా పనిచేస్తుందని ఆమె పేర్కొన్నారు.