ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు కర్ణాటకలో పర్యటించనున్నారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి కర్ణాటక వెళ్లనున్నారు. అక్కడ ఆయన ఉడిపిలోని ప్రముఖ శ్రీకృష్ణ మఠం ఆలయాన్ని సందర్శించనున్నారు. నెల రోజుల పాటు జరిగిన బృహత్ గీతోత్సవం ముగింపు వేడుకల్లో సాయంత్రం 4 గంటలకు ముఖ్య అతిథిగా పాల్గొంటారు పవన్ కళ్యాణ్.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్‌కు లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్ రావు. స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయినా.. అసెంబ్లీ నిర్వహణలో తీవ్ర వైఫల్యాలు, నిబంధనల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రూల్ 12 ప్రకారం సభా కార్యకలాపాలకు అవసరమైనన్ని రోజులు సభను నిర్వహించాల్సి ఉన్నా, అది జరగడం లేదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా సర్పంచులు చేసిన పనులకు పెండింగ్ బిల్లులు చెల్లించలేదని విమర్శించారు ఎంపీ ఈటల రాజేందర్. హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో స్థానిక ఎన్నికల అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. గ్రామాల్లో కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులతోనే అభివృద్ధి జరుగుతోందని చెప్పారు ఈటల.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌లో సినీ రంగంపై ప్రత్యేక చర్చ జరగనుంది. సినీ రంగంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో తెలంగాణను మెదటి స్థానంలో నిలపాలన్న లక్ష్యంతో ఉన్న ప్రభుత్వం.. ఈనెల 9న జరిగే సదస్సులో వన్ కంట్రీ – మెనీ సినిమాస్ పేరుతో ప్యానల్ డిస్కషన్స్ చేయాలని నిర్ణయించింది.
నేడు తెలంగాణ బీజేపీ మహాధర్నా నిర్వహించనుంది. మహాధర్నాలో కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేయనున్నారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో హామీలు, వైఫల్యాలను నిరసిస్తూ.. అధ్యక్షుడు రామచంద్రరావు నేతృత్వంలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ధర్నా నిర్వహించనున్నారు.
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం అగరాల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శబరిమలై నుంచి తమ స్వగ్రామం కోడూరుకు తిరిగి వెళుతున్న ఆరుగురు అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులకు గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్త చేస్తున్నారు పోలీసులు.
తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో త్వరలో మరికొన్ని అరెస్టులు ఉంటాయని సిట్.. టీటీడీ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చింది. ఇప్పటికే ఈ కేసులో టీటీడీ కొనుగోలు విభాగం మాజీ ఈఈ సుబ్రహ్మణ్యం అరెస్ట్ అయ్యారు. సర్వీసులో ఉండి ఈ కేసులో ప్రమేయం ఉన్న మరికొంత మంది టీటీడీ ఉద్యోగులను నిందితులుగా చేరుస్తూ మెమో దాఖలు చేసింది సిట్.
సిద్దిపేట జిల్లా జిల్లెల్లగడ్డ పోలీస్ చెక్‌పోస్ట్ వద్ద పెను ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి వేళ హన్మకొండ నుండి హుస్నాబాద్ వైపు వస్తున్న చేపల లోడ్ లారీ జిల్లెల్లగడ్డ చెక్‌పోస్ట్ వద్ద ఆగి ఉన్న పోలీస్ జీప్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. లారీ ఢీకొనడంతో పోలీస్ జీప్ సుమారు 200 మీటర్ల మేర పంట పొలాల్లోకి దూసుకుపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో పోలీస్ జీప్‌లో సిబ్బంది ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కుటుంబ పెద్దను కోల్పోయి, ఆర్థిక ఇబ్బందులతో నిస్సహాయ స్థితిలో ఉన్న మహబూబ్‌నగర్ కుటుంబానికి.. పోలీసులు, స్వచ్ఛంద సంస్థ సహాయం అందించారు. అంత్యక్రియలు పూర్తి చేసి, అనాథ ఆశ్రమంలో షెల్టర్ కల్పించారు.
తిరుపతిలోని నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఫస్ట్ ఇయర్ విద్యార్థిని గర్భం దాల్చడానికి కారణమయ్యాడు ఓ కీచక అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్. విద్యార్థినితో లక్ష్మణ్ కుమార్ ఏకాంతంగా ఉన్న దృశ్యాలను మరో అసిస్టెంట్ ఫ్రొఫెసర్ రికార్డు చేశాడు. ఆ వీడియోతో బాధిత విద్యార్థినిని లోబరుచుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం.
అల్లూరి జిల్లా పర్యాటక కేంద్రమైన అరకులోయ పర్యాటకలతో కిటకిట లాడుతోంది. అరకులోయ సందర్శిత ప్రాంతాలు పర్యాటకులతో సందడి చేశాయి. వీకెండ్ కావడంతో పర్యాటకులు అరకులోయ అందాలను తిలకించడానికి క్యూకట్టారు.
తిరుపతి జిల్లా చిల్లకూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అధిక వేగం కారణంగా రైటర్ సత్రం వద్ద శౌర్యన్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది. బస్సు గుంటూరు నుంచి శబరిమలైకి అయ్యప్ప భక్తులతో వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 35 మంది అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నట్లు సమాచారం.
అనంతపురం జిల్లా కూడేరు మండలం జల్లిపల్లి సమీపంలో పీఏబీఆర్ కుడి కాలువకు గండి పడింది. దీనితో నీరు పంట పొలాల్లోకి వృథాగా పోయి, రైతులకు తీవ్ర నష్టం జరిగింది. అధికారులు కాలువ గట్టు బలం గురించి పట్టించుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు.
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. వృద్ధురాలు కుర్రె లక్ష్మీని ఆమె ఇద్దరు కొడుకులు ఆస్తి తగాదాల నేపథ్యంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సమస్య పరిష్కారం కోసం వస్తానని నమ్మించి, చిన్న కొడుకు శ్రీనివాస్ ఆమెను ఆర్డీవో కార్యాలయం వద్ద వదిలి వెళ్లిపోయాడు. రోజంతా తిండి, నీళ్లు లేకుండా చలికి వణుకుతున్న వృద్ధురాలిని చూసి ఆర్డీవో మధుకర్ స్పందించి.. కొడుకులకు ఫోన్ చేసి, తల్లిని తీసుకెళ్లాలని సూచించారు.
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో గుర్తుతెలియని దుండగులు రెచ్చిపోయారు. మైపాడు కృష్ణ మందిరం పూజారి చింతకింద రామ్మూర్తి ఇంట్లో చోరీ జరిగింది. వృద్ధులు ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో దుండగులు ఇంట్లోకి ప్రవేశించి, సుమారు 5 సవర్ల బంగారాన్ని అపహరించారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు
ఉత్తర గోవా జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణనష్టంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర బాధ వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు ద్రౌపది ముర్ము.
ఇండిగో విమాన సర్వీసుల్లో తీవ్ర అంతరాయంపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్.. ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ప్రణాళిక, పర్యవేక్షణ లోపాలపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని పేర్కొంది. దీనిపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
మనాలీలో సందర్శకుల తాకిడి గణనీయంగా పెరిగింది. శీతాకాలం నేపథ్యంలో అక్కడి ప్రకృతి అందాలను తిలకించేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణం, స్వచ్ఛమైన గాలిని అనుభూతి చెందడానికి ఇక్కడికి వస్తున్నట్లు పర్యాటకులు తెలిపారు.
విజయం-వైఫల్యం అనే భావన నుంచి దూరం చేసుకున్నానని అన్నారు హీరోయిన్ రాశీ ఖన్నా. రూ.100కోట్ల సినిమాల్లో నటించినా.. అవకాశాల కోసం ఎదురుచూసే రోజులు ఉన్నాయని చెప్పారు. కొన్ని సార్లు పరాజయాలు వచ్చినప్పుడు కూడా మంచి ఆఫర్లను అందుకున్నానని తెలిపారు. ఈ విషయంలో చాలా గందరగోళంగా ఉన్నానని తెలిపారు రాశీ.
భారత యువ షూటర్ సురుచి సింగ్ షూటింగ్ ప్రపంచకప్ ఫైనల్లో పసిడితో మెరిసింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో స్వర్ణం సొంతం చేసుకుంది. మరో భారత షూటర్ సంయమ్ సింగ్ రజతం గెలుచుకుంది. ఈ ఏడాది ప్రపంచకప్‌లో నాలుగు స్వర్ణాలు సొంతం చేసుకున్న సురుచి ప్రపంచకప్ ఫైనల్లోనూ అంచనాలను అందుకుంది.