Contact Lens : సాధారణంగా కాంటాక్ట్ లెన్స్ ఎందుకు ధరిస్తారు? ఏవైనా కంటి సమస్యలు ఉన్నవారే కదా! ఇక కంటి రంగు మార్పు ఫ్యాషన్ కోసం సినిమాల్లో ధరించడం చూస్తుంటాం. అంటే మామూలు కళ్లున్నవారు పిల్లి కళ్లలాంటి కాంటాక్ట్ లెన్స్ ధరించడం చూస్తుంటాం. ఇదంతా అవసరం కోసం కావచ్చు.. సరదా కోసం కావచ్చు. కానీ లేటెస్ట్ గా వచ్చిన కాంటాక్ట్ లెన్స్ లు ధరిస్తే ప్రపంచమే మీ కళ్లముందుకు వస్తుంది. అది ఎంతగా అంటే మీ ఎదుట కంప్యూటర్ లేకపోయినా,
ఎల్ఈడీ టీవీ లేకపోయినాసరే… కావల్సిన సమాచారం కళ్లముందే ప్రత్యక్షమవుతుంది. అదే ఆగ్మెంటెడ్ రియాలిటీ. ఇదంతా కేవలం అతి సూక్ష్మమైన మైక్రో ఎల్ఈడీ డిస్ ప్లే ద్వారానే సాధ్యమంటే నమ్మశక్యం కాదు. కానీ ఇదే నిజం. కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేసే మోజో విజన్ అనే కంపెనీ నెక్ట్స్ జనరేషన్ కాంటాక్ట్ లెన్స్ ను మోజో లెన్స్ పేరుతో అత్యాధునిక టెక్నాలజీని జోడించి తయారు చేసింది. ప్రపంచంలో ఇదే అత్యంత సూక్ష్మమైన ఎల్ఈడీ డిస్ ప్లే అంటోంది మోజో విజన్ కంపెనీ. దీని డయామిటర్ 0.5 మిల్లీమీటర్లు మాత్రమే. ఒక్కో ఇంచ్ లో 14 వేల పిక్సెల్స్ ఉంటాయి. కళ్ల కదలికలను ట్రాక్ చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ఒకరకంగా చెప్పాలంటే ఇది స్మార్ట్ వాచ్ లాగా పనిచేస్తుంది.
కంటి చూపు లోపాలనున్నవారికి ఇది వరంగా మారనుందని అంటోంది ఆ కంపెనీ. అంతేకాదు ఏదైనా ఘటన జరిగిన తర్వాత మనకు వివరాలు అందుతాయి. కానీ ఈ కాంటాక్ట్ లెన్స్ ద్వారా జరగబోయేదాన్ని కూడా తెలుసుకునే వీలుందట. సాధారణంగా ఎక్కడైనా కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు ప్రొజెక్టర్ ద్వారా తెరపైన వివరాలను ప్రదర్శిస్తారు. అయితే ఈ కాంటాక్ట్ లెన్స్ ధరించినవారు ఆ తెరవైపునకు చూడాల్సిన పనికూడా లేదు. ఎందుకంటే ఆ సమాచారాన్నంతా ఈ కాంటాక్ట్ లెన్స్ కళ్లముందు ప్రదర్శిస్తాయి. అంటే ఈ లెన్స్ ధరించినవారు కిందికి చూస్తూ కూడా అల్లంత దూరాన ఉన్న తెరపైన ఏం ఉందో తెలుసుకోవచ్చన్నమాట. ఈ లెన్స్ ధరించినవారి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామంటోంది ఆ కంపెనీ.