Varalakshmi Vratham : ఏటా శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సంపదలు సమకూర్చ దేవత లక్ష్మి. ధనం మాత్రమే కాదు శుభప్రదమైన ప్రతిదీ సంపదే. ఆ దేవిని ప్రసన్నం చేసుకునే పూజే వరలక్ష్మీ వ్రతం. ఆపదలో ధైర్యాన్ని, కష్టాల్లో ఉన్నప్పుడు ఓర్పును, ఆవేశంగా ఉన్న సమయంలో మాటతూలకుండా ఉండటం, నలుగురితో కార్యసాధనలో నేర్పు ఇలాంటి సుగుణాలన్నీ సిరులే. అవి చిరకాలం నిలవాలని, సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకోవడమే వరలక్ష్మి వ్రతం ముఖ్య ఉద్దేశం.
పూర్వం మగధ దేశంలో చారుమతి అనే గృహిణికి లక్ష్మీదేవి కలలో కనిపించారట. శ్రావణమాసంలో శుక్ల పక్ష పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం తనను పూజించాలని కోరారట. తనకు వ్రతం చేస్తే అనుగ్రహిస్తానని చెప్పారట. దీంతో చారుమతి లక్ష్మీదేవిని పూజించారు. అలా వరలక్ష్మీ వ్రతం మొదలైంది.
మహిళలు సుమంగళిగా ఉండాలని కోరుకుంటూ ఈ వ్రతం ఆచరిస్తారు. లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని హిందువుల విశ్వాసం. ఈ వ్రతాన్నిచేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షలు కలిగి ఐశ్వర్యం లభిస్తాయని నమ్మకం. సకల శుభాలుకలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. లక్ష్మీదేవికి సంపదలనిచ్చే తల్లిగా పేరు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద ఇలా అన్నీ ఇవ్వాలని వ్రతం ఆచరించిన కోరు కోరుకుంటారు.
వర అంటే శ్రేష్ఠమైన అని అర్థం. శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించాలి. ఏదైనా కారణాల వల్ల ఆ రోజు వ్రతం చేసుకోని మహిళలు ఆ తర్వాత రెండు శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని చేసుకుంటారు. ఇంట్లో వరలక్ష్మి పటం ముందు కలశం ఏర్పాటు చేస్తారు. ఫలాలు, పిండివంటలు , కొత్త చీర, బంగారు రూపును అమ్మవారి ముందు ఉంచి వ్రతం ఆచరిస్తారు. పూజ పూర్తైన తర్వాత ఆ రూపును మంగళసూత్రంలో ధరిస్తారు.