Bomb Threat: హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో.. సోమవారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. లండన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు ఇమెయిల్ రావడంతో భద్రతా వ్యవస్థ ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది. వెంటనే అధికారులు అత్యవసర భద్రతా చర్యలు చేపట్టి, విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేయించారు.ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టగా.. ఎలాంటి ప్రమాద సూచనలు లేవని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.
సోమవారం ఉదయం బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ BA-277 ఫ్లైట్ లండన్ హీత్రో నుంచి.. హైదరాబాద్ శంషాబాద్‌కు వస్తుండగా మధ్యలో బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. సమాచారం తెలుసుకున్న అధికారులు వెంటనే పైలట్‌కు సమాచారం అందించారు.
పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి, భయాందోళన లేకుండా విమానాన్ని సురక్షితంగా శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. ఆ సమయంలో విమానంలో సుమారు 180 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు వెల్లడించారు.
బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ (BDS), స్నిఫర్ డాగ్ టీంలు విమానం అంతటా సుదీర్ఘంగా తనిఖీ నిర్వహించారు. సుమారు రెండు గంటలపాటు సాగిన తనిఖీల అనంతరం విమానంలో ఎలాంటి బాంబులు లేవని అధికారులు స్పష్టంచేశారు.
బాంబు బెదిరింపు ఇమెయిల్ విషయమై బ్రిటిష్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇమెయిల్ పంపిన వ్యక్తి గుర్తించేందుకు సైబర్ క్రైమ్ విభాగం సహకారంతో ట్రేసింగ్ ప్రక్రియ ప్రారంభమైందని సమాచారం. ఇమెయిల్ యూరప్ సర్వర్ నుండి పంపబడినట్టు ప్రాథమిక సమాచారం అందిందని తెలిసింది.
Also Read: గొడ్ల కాపరి నుంచి.. గేయ రచయితగా.. ప్రజాకవి అందెశ్రీ బయోగ్రఫీ
ఈ ఘటన అనంతరం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భద్రతా తనిఖీలను మరింత కఠినతరం చేశారు. లగేజ్ స్క్రీనింగ్, ఎంట్రీ పాయింట్ల వద్ద పాస్ చెకింగ్, స్నిఫర్ డాగ్ పర్యవేక్షణను పెంచారు.