చికెన్ కుర్మా పేరు వింటే ఎంతో మందికి నోరూరిపోతుంది. భారతీయ వంటకాల్లో రుచికరమైన వంటల్లో చికెన్ వంటకాలు కూడా ఒకటి. మసాలాల సువాసన, కొబ్బరి, గసగసాలు, మసాలా పేస్ట్‌ల కలయికతో ఈ వంటకం ప్రత్యేక రుచిని ఇస్తుంది. చికెన్ కుర్మా సాధారణంగా రోటీ, పరాటా, పులావ్ లేదా రైస్‌తో తింటారు. దేనితో తిన్నా ఇది టేస్టీగా ఉంటుంది.
చికెన్ కుర్మా తయారీకి అవసరమైన పదార్థాలు
చికెన్ ముక్కలు – ఒక కిలో
ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు
గసగసాలు – ఒక స్పూను
ధనియాలు – రెండు స్పూన్లు
జీలకర్ర – ఒక స్పూను
కొబ్బరి తురుము – అర కప్పు
పచ్చి మిర్చి – నాలుగు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – రెండు స్పూన్లు
టమోటాలు – రెండు
లవంగాలు – నాలుగు
యాలకులు – రెండు
దాల్చినచెక్క – చిన్న ముక్క
బిర్యానీ ఆకులు – రెండు
కారం – ఒక స్పూను
గరం మసాలా – అర స్పూను
పెరుగు – పావు కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – మూడు స్పూన్లు
చికెన్ కుర్మా రెసిపీ
1. ముందుగా చికెన్ కుర్మా చేసేందుకు మసాలా పేస్టు సిద్ధం చేసుకోవాలి. చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. మసాలా పేస్టు చేసేందుకు గసగసాలు, కొబ్బరి తురుము, ధనియాలు, జీలకర్రను వేసి మిక్సీలో బాగా రుబ్బి పేస్టులా తయారు చేసుకోవాలి.
3. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి వేడి చేయాలి.
4. అందులో బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించాలి.
5. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయే వరకు వేయించాలి.
6. ఇప్పుడు చికెన్ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. అందులో ఉప్పు, పసుపు వేసి కలపాలి.
7. చికెన్ పది నిమిషాలు ఉడికిన తర్వాత టమోటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
8. తరువాత కారం, గరం మసాలా వేసి బాగా కలపాలి.
9. ముందుగా రుబ్బిన మసాలా పేస్ట్, కొబ్బరి తురుము, పెరుగు వేసి కొన్ని నిమిషాలు వేగించాలి.
10. తర్వాత ఒక కప్పు వేడి నీరు వేసి మూతపెట్టి చికెన్ ఉడికే వరకు ఉంచాలి.
11. చివరగా ఉప్పు, గరం మసాలా చూసి చికెన్ కర్రీ ఇగురులాగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే టేస్టీ చికెన్ కుర్మా సిద్ధమైనట్టే.
చికెన్ కుర్మా వడ్డించేటప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేయండి. ఇది రుచితో పాటు మంచి సువాసన కూడా వస్తుంది.
ఇంట్లోని ప్రత్యేక సందర్భాలలో, కుటుంబ విందుల్లో లేదా ఆదివారం వండుకోదగిన రుచికరమైన వంటకం. గసగసాల స్థానంలో జీడిపప్పు లేదా బాదం వేస్తే కుర్మాకు మరింత రుచి వస్తుంది. చికెన్ కుర్మా రాజవంటకంగా చెప్పుకుంటారు. అప్పట్లో చికెన్ కుర్మాను ధనవంతులు తినేవారని చెబుతారు. ఒక్కసారి ఇక్కడ చెప్పిన పద్ధతిలో వండి చూడండి… కూర అదిరిపోతుంది.