మనం ఇష్టపడే వారితో కలిసి జీవించడం అనేది ఒక అద్భుతమైన అనుభూతి. వారితో జీవించే ప్రతి నిమిషం కొత్తగా ఉంటుంది. భారతీయ సంప్రదాయం ప్రకారం ఒకప్పుడు వివాహం చేసుకున్నాకే ఒక స్త్రీ పురుషుడు కలిసి జీవించేవారు. ఇప్పుడు ఆధునిక సమాజంలో ఎంతో మార్పు వచ్చింది. ఇద్దరూ ఇష్టపడితే వివాహంతో సంబంధం లేకుండా ముందే సహజీవనంలో ఉంటున్నారు. ఇలా కొన్నేళ్ల పాటు లేదా కొన్ని నెలల పాటు లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉన్నవారు వివాహం చేసుకుంటే… ఆ వివాహం కలకాలం నిలుస్తుందనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. ఇది విడాకులను తగ్గిస్తుందని కూడా చెప్పుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం.
విడాకులకు ప్రస్తుతం కనిపిస్తున్న కారణాలు… మనుషుల్లో తగ్గుతున్న సహనం, మారిన జీవనశైలి. ఈ రెండింటి కారణంగానే పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు లేదా ప్రేమించుకుంటున్న వారు త్వరగా విడిపోతున్నారు. ఒకప్పుడు ప్రేమికులు కలుసుకోవడానికి ఏళ్ల పాటు వేచి ఉండాల్సి వచ్చేది. వారు తమ తల్లిదండ్రులను ఒప్పించేవరకు ప్రేమ లేఖలు రాసుకునేవారు. ఇప్పుడు ఆ రోజులు లేవు. కేవలం ఒక ఫోన్ కాల్ తోనే ప్రేమలో పడిపోతున్నారు.
విడాకులకు ఆర్థిక ఒత్తిడి కూడా ప్రధాన కారణమే. ఇద్దరు భాగస్వాములు పనిచేస్తూ, సంపాదిస్తూ బిజీగా మారిపోతున్నారు. అలాగే వారి అలవాట్లు, ఆర్థిక సమస్యలకు కారణం అవుతున్నాయి. దీంతో ఆ జంటలు వివాహం చేసుకున్నాక కూడా ఆర్థిక లక్ష్యాలను చేరుకోలేక విభేదాలతో విడిపోతున్నారు.
భార్యాభర్తల మధ్య పెరిగిపోతున్న విడాకులు సమాజంలో ఎంతో ఇబ్బందికర పరిస్థితులను సృష్టిస్తున్నాయి. పెళ్లి పైనే నమ్మకాన్ని యువత కోల్పోతుంది. అయితే పెళ్లికి ముందే సహజీవనంలో ఉంటే విడాకుల తగ్గే అవకాశం ఉందనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. అందుకే పెళ్లికి ముందే కలిసి జీవించి… ఒకరి ఇష్టాలు మరొకరు తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే అధ్యయనాలు మాత్రం ఈ విషయంలో మిశ్రమ ఫలితాలను చూపిస్తోంది. వివాహానికి ముందు కలిసి జీవించే జంటలు కూడా విడిపోయిన సందర్భాలు ఎదురవుతున్నాయి. అయితే వారిలో అవగాహన, స్థిరత్వం కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయి. జంటలు తాము కలిసి ఉండలేక పోతే పెళ్లికి ముందే ఒకరికొకరు బ్రేకప్ చెప్పుకొని వెళ్లిపోతున్నారు. దీనివల్ల విడాకులు అనే పదం వారి మధ్యకు రావడం లేదు.
సహజీవనం అనేది పూర్తిగా విడాకులను తగ్గిస్తుందని చెప్పలేము. కానీ ఒకరంటే ఒకరికి పూర్తిగా అర్థం అయ్యేలా చేస్తుంది. కొందరు రూమ్ మేట్స్‌గా ఉండి ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకుంటారు. అలా అర్థం చేసుకోవడం వల్ల రాబోయే 50 ఏళ్ల పాటు వారు సహచరులుగా కలిసి ఉండే అవకాశం ఉంటుంది. దీనికి ముందుగా మానసిక సంసిద్ధత కీలకం. దానికి సమజీవనం అనేది ఎంతో ఉపయోగపడుతుంది.
కలిసి జీవించడం వల్ల పెళ్లికి ముందే జంటలు ఒకరి దినచర్యలు, అలవాట్లను మరొకరు తెలుసుకుంటారు. వారికి నచ్చని విషయాలను చెప్పుకుంటారు. నచ్చే విషయాలను నేర్చుకుంటారు. దీనివల్ల కొంతమేరకు ఉపయోగం ఉంది. అయితే పూర్తిగా లివింగ్ రిలేషన్షిప్ అనేది విడాకులను ఆపుతుందని మాత్రం చెప్పే అవకాశం లేదు.
సహజీవనంలో కూడా ఆర్థిక వ్యవహారాలు, బాధ్యతలు, ఒత్తిడితో కూడిన జీవితం బ్రేకప్‌కు కారణం అవుతుంది. ఆ బ్రేకప్ ను ఎవరూ పెద్దగా పరిగణనలోకి తీసుకుపోవడం లేదు. అదే భార్యాభర్తలు విడాకులు తీసుకుంటే మాత్రం అది రెండు కుటుంబాల్లో పెద్ద కలవరాన్ని సృష్టిస్తోంది.
Also Read: అమ్మాయిల కంటే ముందు అబ్బాయిలే ప్రేమ ప్రపోజ్ చేస్తారు, ఎందుకు?
సహజీవనంలో అయినా వివాహంలో అయినా గొడవలు రాకుండా ఉండాలంటే ఇద్దరు భాగస్వాములు కూర్చొని స్పష్టంగా మాట్లాడుకోవాలి. ఆర్థిక సమస్యలు రాకుండా జీతాన్ని విభజించుకోవాలి. అద్దె, కిరాణా సామాగ్రి, ఆహారపు ఖర్చులు అన్నింటినీ సమగ్రంగా ఒక దగ్గర రాసుకొని దానికి తగ్గట్టు డబ్బులను ఖర్చు పెట్టాలి. ఇద్దరికీ నచ్చితేనే ఏ పనైనా చేయాలి. అధిక లక్ష్యాలను, అంచనాలను ముందుగానే కలిసికట్టుగా జాబితాలో చేర్చుకోవాలి.