TPCC Committee Members: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గంపై కసరత్తు మొదలైందా? పీసీసీ కార్యవర్గంపై పార్టీ పెద్దలు ఫోకస్ పెడుతున్నారా? రాష్ట్రవ్యాప్తంగా పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు, యూత్ లీడర్లు పార్టీ పదవులపై ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తూన్నారు. పీసీసీ చీఫ్‌గా మహేష్ గౌడ్ బాధ్యతలు చేపట్టగానే కార్యవర్గంలో చోటు కోసం ఆశావహులంతా ప్రయత్నాలు ప్రారంభించారు. త్వరలోనే వారి ఎదురుచూపులకి ఎండ్ కార్డు పడే పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు పీసీసీ కార్యవర్గం ఏర్పాటు దిశగా స్పీడ్ పెంచారంటున్నారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గంపై రాష్ట్ర పార్టీ పెద్దలు కసరత్తు షురూ చేశారు. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న ఆశావహులకు కమిటీ, పార్టీ పదవులతో గుడ్ న్యూస్ త్వరలో చెప్పాలని రాష్ట్ర అధినాయకత్వం డిసైడ్ అయ్యిందంట. కొత్త పీసీసీ మహేష్ గౌడ్ బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తి అయినా ఇంకా కార్యవర్గం పై క్లారిటీ రాక పోవడంతో పదవులు ఆశిస్తున్న పార్టీ నేతల్లో ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాక, నామినేటెడ్ పదవులు దక్కక పార్టీ పదవులపై ఆశలు పెట్టుకున్న నాయకుల ఎదురుచూపులు తర్వలోనే ఫలిస్తాయంటున్నారు.
ఏడాది పాలన పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం నామినేడెట్, పార్టీ పదవుల భర్తీలో జాప్యం చేస్తుండటంపై కాంగ్రెస్ శ్రేణులు నారాజ్‌గా కనిపిస్తున్నాయి. విడతల వారీగా నామినేటెడ్ పదవుల భర్తీ జరుగుతున్నా.. ఇంత వరకు పాక్షికంగా వాటిని కేటాయించారన్న చర్చ జరుగుతోంది. వాటితో పాటు పార్టీ పరమైన పదవుల భర్తీ సంపూర్ణంగా చేయాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దానికి సంబంధించి పార్టీ పెద్దలు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, సీనియర్ మంత్రులు కసరత్తు మొదలు చేశారంట. పలుమార్లు సమావేశమైన ముఖ్యనేతలు.. పీసీసీ కార్యవర్గం కూర్పుని దాదాపు ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది. పార్టీ పెద్దల నిర్ణయాన్ని ఢిల్లీ అధినాయకత్వం ముందు ఉంచడమే లేటు.. కార్యవర్గంపై క్లారిటీ వస్తుందని పార్టీలో టాక్ వినిపిస్తుంది.
Also Read: భరతమాత ముద్దుబిడ్డను కోల్పోయాం.. మన్మోహన్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి
వారం రోజుల్లో రాష్ట్ర పెద్దలు ఫైనల్ చేసిన పీసీసీ కార్యవర్గం లిస్టును ఢిల్లీ పెద్దల ముందు పెడతారని అంటున్నారు. గత కొద్ది నెలలుగా ఢిల్లీ పెద్దల బిజీ షెడ్యూల్ కారణంగా ఫైనల్ డెసిషన్ డిలే అవుతుందన్న చర్చ జరుగుతుంది. ప్రస్తుతం కర్ణాటక సీడబ్ల్యూసీ సమావేశాల్లో ఢిల్లీ అగ్ర నేతలు బిజీగా ఉన్నారని, ఆ హడావుడి అయ్యాక అతి త్వరలోనే పార్టీ పెద్దలు కార్యవర్గం జాబితాతో ఢిల్లీ వెళ్లి ఆమోదముద్ర వేయించుకుని వస్తారని అంటున్నారు . ఆ క్రమంలో పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు మొదటి ప్రయారిటీ లభిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.