Cherlapally Railway Terminal: హైదరాబాద్ చర్లపల్లిలో నిర్మించిన నూతన రైల్వే టెర్మినల్ ను ఈనెల 28న రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. సుమారు రూ. 413 కోట్ల వ్యయంతో విమానాశ్రయాన్ని తలదన్నేలా ఈ రైల్వే టెర్మినల్ ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలలో ప్రయాణీకుల రద్దీ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో అత్యాధునిక సౌకర్యాలతో చర్లపల్లి టెర్మినల్ ను నిర్మించారు.
ఎయిర్ పోర్టును తలదన్నేలా సౌకర్యాలు
సౌత్ సెంట్రల్ రైల్వే సంస్థ 2వ ఎంట్రీ, రైల్వే టెర్మినల్ స్టేషన్ భవనం నిర్మించారు. స్టేషన్ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఆరు బుకింగ్ కౌంటర్లు, మహిళలు, సీనియర్ సిటిజన్స్ కోసం స్పెషల్ వెయిటింగ్ హాల్స్, హై క్లాస్ వెయిటింగ్ లాంజ్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ లో రెస్టారెంట్, రెస్ట్ లాంజ్ ఏర్పాటు చేశారు. విశాలమైన కాన్కోర్స్ ఏరియాలు, అద్భుతమైన లుక్, అదిరిపోయే లైటింగ్, ఆధునిక ఎలివేషన్ తో నిర్మించారు. రెండు విశాలమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేశారు. వీటిలో ఒకటి 12 మీటర్ల వెడల్పు, మరొకటి 6 మీటర్ల వెడల్పు ఉంటాయి. మొత్తం తొమ్మిది ప్లాట్ ఫారమ్‌లు నిర్మించారు. ఆయా ఫ్లాట్ ఫారమ్స్ కు చేరుకునేలా ఎస్కలేటర్లు, లిఫ్టులను ఏర్పాటు చేశారు. మొత్తం ఏడు లిఫ్టులు, ఆరు ఎస్కలేటర్లు నిర్మించారు. ఈ రైల్వే స్టేషన్ లోకి అడుగు పెట్టగానే విమానాశ్రయంలోకి అడుగు పెట్టిన అనుభూతి పొందేలా అద్భుతంగా రూపొందించారు.
మొత్తం 19 రైల్వే లైన్లు ఏర్పాటు
చర్లపల్లి రైల్వే టెర్మినల్ 15 జతల రైలు సర్వీసులను నిర్వహించే కెపాసిటీ ఉంటుంది. ఈ స్టేషన్ లో నాలుగు అదనపు హై-లెవల్ ప్లాట్ ఫారమ్‌లు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఐదు ప్లాట్ ఫారమ్‌లు కూడా పూర్తి రైళ్లను ఉంచడానికి విస్తరించారు. అదనంగా 10 లైన్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్ లో 19 రైల్వే లైన్లు ఉన్నాయి. ఇక రేపు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చేతులు మీదుగా ప్రారంభం అయ్యే ఈ వేడుకలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా పలువురు ప్రజా ప్రతినిధులుల, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొనే అవకాశం ఉంది.
Read Also: కేబుల్ బ్రిడ్జిపై రైలు.. చరిత్రలో ఇదే తొలిసారి, వీడియో చూస్తే మైండ్ బ్లాకే!
ప్రయాణీకులు లేక ప్రత్యేక రైళ్లు రద్దు
అటు అయ్యప్ప భక్తుల కోసం సౌత్ సెంట్రల్ రైల్వే ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లకు ప్రయాణీకుల నుంచి అనుకున్న స్థాయిలో ఆదరణ లభించడం లేదు. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 14 ప్రత్యేక రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 24 నుంచి ఫిబ్రవరి 2 వరకు షెడ్యూల్ ప్రకారం మౌలాలి-కొట్టాయం, కొల్లం-మౌలాలి, నర్సాపూర్-కొల్లం, సిర్పూర్ కాగజ్‌నగర్- కొల్లం, కొట్టాయం-సికింద్రాబాద్, హైదరాబాద్-కొట్టాయం వంటి పలు స్టేషన్ల మధ్య ఈ రైళ్లు తమ సర్వీసులను కొనసాగించనున్నాయి.
Read Also: వందేభారత్ స్లీపర్ ట్రైన్ ట్రయల్ రన్ సక్సెస్, పట్టాలు ఎక్కేది అప్పుడేనా?