ఆధునిక యుగంలో అంతా మారిపోయింది. ఒక నెల పరిచయమైతే రెండో నెలలోనే డేటింగ్‌కి వెళ్లి, మూడో నెలలో పెళ్లి చేసుకునే వారి సంఖ్య ఎక్కువైపోయింది. అందుకే అలా పెళ్లి చేసుకున్న వారు త్వరగా విడిపోతున్నారు. ఆరు నెలలు కూడా కలిసి ఉండలేక విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. తొలిచూపులోనే ప్రేమలో పడిపోవడం అనేది ఇప్పటి కాన్సెప్ట్ కాదు. ఎప్పటినుంచో జరుగుతున్నది. అయితే తొలిచూపులో ప్రేమలో పడిపోయి కొన్ని రోజుల్లోనే ప్రేమించుకుని పెళ్లికి సిద్ధమైపోవడం వల్లే ఇద్దరి మధ్య అవగాహనరాహిత్యం అధికంగా ఉంటున్నట్టు మానసిక తత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పెళ్లి చేసుకోవాలనుకునేవారు స్లో డేటింగ్ పద్ధతిని అనుసరించాలనీ, అప్పుడే ఒకరికొకరు అర్థం చేసుకుంటారనీ.. వారు పెళ్లి వరకు వెళ్లాలో లేక మధ్యలోనే బ్రేకప్ చెప్పుకోవాలో తేలిపోతుందని అంటున్నారు.
ఇది ఇంటర్నెట్ కాలం. ఆన్‌లైన్లోనే భాగస్వామి వెతుక్కుంటున్నారు. వాట్సాప్ లో రెండు మెసేజులు పెట్టుకుని మూడో మెసేజ్‌కి బయట కలుసుకుంటున్నారు. విపరీతమైన స్వేచ్ఛ వల్ల ఎప్పటికప్పుడు డేటింగ్ పేరుతో ప్రతిరోజూ కలిసి తిరగడం కూడా ఎక్కువైపోయింది. అలా కలిసి తిరిగే క్రమంలో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ సినిమాలు, రెస్టారెంట్లకు వెళ్లి ఆ క్షణాలను ఎంజాయ్ చేసి వచ్చేస్తున్నారు. అందుకే ఇలాంటి ప్రేమలు పెళ్లి పీటల వరకు చేరిన తర్వాత కొనసాగలేకపోతున్నాయి.
స్లో డేటింగ్ ఉపయోగాలు
డేటింగ్ అనేది మంచిదే. ఇద్దరు ప్రేమికులు ఒకరి గురించి ఒకరు తెలుసుకునేందుకు ఉపయోగపడే ప్రక్రియ ఇది. కానీ దాన్ని కూడా దుర్వినియోగం చేసే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. డేటింగ్‌లో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. రెండు మూడు రోజుల్లోనే కలిసి నాలుగో రోజే పెళ్లికి సిద్ధం అవ్వడం మంచి పద్ధతి కాదు. వాళ్ళ ప్రవర్తన తెలుసుకోవాలంటే కొన్ని ఏళ్ల పాటు డేటింగ్ చేయాల్సిందే. మీకు ఆ వ్యక్తి నచ్చినా కూడా మీరు వారితో కొన్నేళ్లు ప్రయాణం చేయాలి.
కనీసం ఏడాది పాటు ప్రయాణం చేస్తేనే ఒక మనిషిలోని లోపాలు బయటపడతాయి. వారి అభిప్రాయాలు, అభిరుచులు ఎలాంటివో తెలుస్తాయి. వారి చుట్టూ ఉండే మనుషులు ఎలాంటి వారో, ఎలాంటి స్నేహితులను వారు ఎంపిక చేసుకుంటారో అర్ధం అవుతుంది. అలాగే వారి కుటుంబంలో ఉండే సమస్యలు కూడా తెలుస్తూ ఉంటాయి. కానీ రెండు మూడు నెలల్లోనే డేటింగ్ చేసి పెళ్లికి సిద్ధమైతే ఆ తర్వాత నిజ నిజాలు తెలిశాక బాధపడే వారి సంఖ్య ఎక్కువైపోయింది.
స్లో డేటింగ్‌లో ఒకరికొకరు బాగా అర్థమవుతారు. ఒకరి సమస్యలు ఒకరికి తెలుస్తాయి. ఒకరి కుటుంబం గురించి మరొకరు తెలుసుకుంటారు. అలాగే లోటుపాట్లను కూడా అర్థం చేసుకుంటారు. తాము ఆ కుటుంబంలో ఇమడగలమో లేదో, ఆ వ్యక్తితో జీవించగలమో లేదో తేల్చుకుంటారు. అనుబంధం శాశ్వతంగా నిలవాలంటే ఈ మాత్రం సమయాన్ని తీసుకోవాల్సిందే. ఎన్నో విషయాల్లో ఒకరికొకరు స్పష్టంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకున్నట్టే, ప్రేమను పంచుకున్నట్టే… జీవితంలోని లోటుపాట్లను కూడా ముందే చెప్పుకోవాలి. పెళ్లయిన తర్వాత కొన్ని విషయాలు తెలిస్తే అవి ఎదుటివారి మనసును ముక్కలు చేస్తాయి. కాబట్టి ఒకరిపై ఒకరికి పూర్తిగా నమ్మకం కలిగే పెళ్లి బంధానికి చేరుకోవడం మంచిది.
Also Read: భార్యతో వెళ్లాల్సిన హనీమూన్‌కు నా ఫ్రెండ్‌తో వెళ్లాల్సి వచ్చింది, దానికి కారణం?
కొంతమంది ముఖాలు చూసుకోకుండా ఆన్లైన్లో ప్రేమించుకుంటారు. అది చివరికి మోసానికే గురవుతుంది. పెళ్లయిన తర్వాత కూడా ఆ జీవితం సుఖంగా ఉండకపోవచ్చు. కొన్ని రోజుల్లోనే విడిపోవాలని ఆలోచన కలుగుతుంది. కాబట్టి ఓసారి స్లో డేటింగ్ పద్ధతిని అనుసరించి చూడండి. ఇది ఎంతో మంచి ప్రక్రియ. అయితే ఈ డేటింగ్ ప్రక్రియలో శారీరకంగా ఒకరికి ఒకరు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. డేటింగ్ పేరుతో శారీరకంగా కలిసే వారు ఎంతోమంది. అభిరుచులను తెలుసుకోకుండా ఇలాంటి పనులకు దిగడం వల్ల జీవితంలో నష్టపోతారు. ఎదుటి వ్యక్తి జీవితం చేతిలో మోసపోయే అవకాశాన్ని మీకు మీరే ఇచ్చుకున్న వారు అవుతారు. కాబట్టి స్లో డేటింగ్ చేశాక అతనితో మీరు జీవించగలరు అనిపిస్తేనే తల్లిదండ్రులకు చెప్పండి. లేకపోతే పద్ధతిగా విడిపోవడమే మంచిది.