Homemade Oil For Hair: జుట్టుకు తగినంత పోషకాహారం అందనప్పుడు అది బలహీనంగా, నిర్జీవంగా కనిపించడం ప్రారంభిస్తుంది. దీంతో పాటు బలమైన సూర్యకాంతికి గురికావడం, జుట్టును ఎప్పుడూ విరబోసి ఉంచడం, జుట్టుపై శ్రద్ద తీసుకోకపోవడం వల్ల కూడా జుట్టు నిర్జీవంగా మారుతుంది. ఇలాంటి సమయంలోనే సరైన జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అంతే కాకుండా జుట్టు రాలడాన్ని కూడా నివారించవచ్చు.
జుట్టుకు తరచుగా నూనె రాయడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుందని పెద్దవాళ్లు చెప్పడం మీరు వినే ఉంటారు. బయట దొరికే హెయిర్ ఆయిల్స్ కాకుండా ఇంట్లో తయారు చేసిన ఆయిల్స్ మీ జుట్టు బలంగా మార్చడమే కాకుండా పొడి బారకుండా కాపాడతాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న హోం మేడ్ హెయిర్ ఆయిల్స్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి నూనె, ఉసిరి:
ఈ హెయిర్ తయారు చేయడానికి మీకు 1 కప్పు కొబ్బరి నూనె, 2 టేబుల్ స్పూన్ల ఎండిన ఉసిరి పొడి లేదా 5-6 ఉసిరి ముక్కలు అవసరం అవుతాయి. ముందుగా గ్యాస్ పై మందపాటి గిన్నె పెట్టి అందులో ముందుగా తీసుకున్న కొబ్బరి నూనె వేడి చేయండి. తర్వాత అందులో ఉసిరి ముక్కలు లేదా పొడి వేసి మరగనివ్వండి. 15 నిమిషాల పాటు మరిగించండి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసి గాజు సీసాలో నిల్వ చేయండి. ఈ నూనె జుట్టు త్వరగా తెల్లబడకుండా చేస్తుంది. అంతే కాకుండా జుట్టుకు కూడా బలాన్ని ఇస్తుంది.
మెంతులు, ఆవ నూనె:
ఈ హెయిర్ ఆయిల్ తయారు చేయడానికి మీకు 1 కప్పు ఆవాల నూనె , 2 టీస్పూన్ల మెంతులు అవసరం అవుతాయి. ముందుగా గ్యాస్ పై మందపాటి గిన్నె పెట్టి ఆవ నూనెను తక్కువ మంట మీద వేడి చేయండి. అందులోనే మెంతులు వేసి లేత గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. 15 నిమిషాల పాటు ఇలా మరిగించిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి నూనెను చల్లారిన తర్వాత వడకట్టి వాడండి. ఈ నూనె జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా జుట్టును మందంగా కూడా చేస్తుంది.
ఉల్లిపాయ, కొబ్బరి నూనె:
ఈ హెయిర్ ఆయిల్ తయారు చేయడానికి మీకు 1 కప్పు కొబ్బరి నూనె , 2 మీడియం సైజు ఉల్లిపాయలు అవసరం అవుతాయి. ముందుగా ఉల్లిపాయను మెత్తగా కోసి రసం తీయండి. తర్వాత గ్యాస్ పై గిన్నె పెట్టి కొబ్బరి నూనె వేడి చేసి దానికి ఉల్లిపాయ రసం కలపండి. దీన్ని 5-7 నిమిషాలు వేడి చేసి చల్లారిన తర్వాత ఫిల్టర్ చేయండి. ఈ నూనె జుట్టు పెరుగుదలను వేగంగా పెంచుతుంది. అంతే కాకుండా చుండ్రును కూడా తగ్గిస్తుంది.
Also Read: కాఫీ పౌడర్‌తో ఫేషియల్.. మిలమిల మెరిసే చర్మం మీ సొంతం
కరివేపాకు, నువ్వుల నూనె:
ఈ నూనె తయారు చేయడానికి మీకు 1 కప్పు నువ్వుల నూనె , 10-15 కరివేపాకులు అవసరం అవుతాయి. ముందుగా ఒక గిన్నె పెట్టి అందులో నువ్వుల నూనె వేడి చేసి దానిలో కరివేపాకు వేయండి. తక్కువ మంట మీద 5-10 నిమిషాలు ఉడికించాలి. చల్లారిన తర్వాత వడకట్టి వాడండి. ఈ నూనెను ఉపయోగించడం వల్ల జుట్టు తెల్లబడకుండా నిరోధిస్తుంది.