Traditional Hair Care: కొబ్బరి నూనెను ఎన్నో ఏళ్లుగా జుట్టు సంరక్షణ(Hair Care)కు ఉపయోగిస్తున్నాము. ఇందులో ఉండే లారిక్ ఆమ్లం జుట్టులోని ప్రోటీన్‌ను రక్షించి, జుట్టు చిట్లిపోవడాన్ని నివారిస్తుంది. కానీ.. కొన్ని సహజ పదార్థాలను కొబ్బరి నూనె(Coconut Oil)తో కలిపి ఉపయోగించడం వల్ల దాని ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. ఈ పదార్థాలు మీ జుట్టును మెరిసేలా.. బలంగా , ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఇంతకీ జుట్టు ఒత్తుగా, నల్లగా పెరగడానికి ఎలాంటి పదార్ధాలు కొబ్బరి నూనెలో కలపాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మందార పువ్వులు, ఆకులు:
మందార పువ్వులు, ఆకులలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. కొన్ని మందార పువ్వులు, ఆకులను కొబ్బరి నూనె (Coconut Oil)లో వేసి వేడి చేసి, చల్లార్చిన తరువాత ఆ నూనెను జుట్టుకు పట్టించాలి. ఇది జుట్టును నిగనిగలాడేలా చేస్తుంది. అంతే కాకుండా చుండ్రు సమస్యను కూడా తగ్గిస్తుంది.
2. ఉసిరి పొడి:
ఉసిరి అనేది విటమిన్ సి కి పర్యాయపదం అని చెప్పొచ్చు. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి జుట్టు మూలాలను బలోపేతం చేస్తుంది. రెండు చెంచాల ఉసిరి పొడిని కొబ్బరి నూనెలో కలిపి వేడి చేసి, ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. ఇది జుట్టు అకాలంగా నెరిసిపోకుండా నివారిస్తుంది. అంతే కాకుంవడా జుట్టు పెరుగుదల(Hair growth)కు సహాయపడుతుంది.
3. కరివేపాకు:
కరివేపాకులో బీటా-కెరోటిన్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. అందుకే కొన్ని కరివేపాకులను కొబ్బరి నూనెలో వేసి నల్లగా మారే వరకు వేడి చేయాలి. ఈ నూనెను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం ఆగి, జుట్టు బలంగా తయారవుతుంది.
4. ఉల్లిపాయ రసం:
ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జుట్టు మూలాలను బలపరుస్తుంది. రెండు చెంచాల ఉల్లిపాయ రసాన్ని కొబ్బరి నూనెతో కలిపి తలకు పట్టించడం వల్ల జుట్టు చిక్కగా పెరుగుతుంది. ఈ మిశ్రమాన్ని వారానికి ఒకటి లేదా రెండుసార్లు వాడడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
5. కలబంద గుజ్జు:
కలబంద గుజ్జులో ఎంజైమ్‌లు, యాంటీమైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి చుండ్రును తగ్గించి, తల చర్మాన్ని చల్లబరుస్తాయి. రెండు చెంచాల కలబంద గుజ్జును కొబ్బరి నూనెతో కలిపి మసాజ్ చేసుకోవడం వల్ల జుట్టు మృదువుగా.. మెరిసేలా తయారవుతుంది.
Also Read: ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.. కొరియన్ గ్లాస్ స్కిన్ గ్యారంటీ !
6. కలోంజి విత్తనాలు:
కలోంజి విత్తనాలలో థైమోక్వినోన్ అనే పదార్థం ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయ పడుతుంది. ఒక చెంచా కలోంజి విత్తనాలను కొబ్బరి నూనెలో వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత ఈ నూనెను తలకు పట్టించడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
ఈ చిట్కాలను పాటించడం ద్వారా.. రసాయనాలు లేని పద్ధతిలో మీ జుట్టును ఆరోగ్యంగా , అందంగా మార్చుకోవచ్చు. ఇలా తయారు చేసిన హోం రెమెడీస్ తలకు పట్టించి ఒక గంట లేదా రాత్రంతా ఉంచి.. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.