Google pay: డిజిటల్ చెల్లింపులు మన జీవితంలో ఎంతగానో కలిసిపోయాయి. ముఖ్యంగా గూగుల్ పే వాడకం రోజువారీ పనిలో తప్పనిసరి అయింది. డబ్బు పంపడం, బిల్లులు చెల్లించడం, షాపింగ్ చేయడం లాంటివి చాలా సులభంగా ఈ యాప్ ద్వారా చేసేస్తున్నాం. కానీ, మనం చేసే ప్రతి లావాదేవీ యాప్‌లో హిస్టరీ రూపంలో రికార్డ్ అవుతూనే ఉంటుంది. ఈ వివరాలు ఎవరి చేతిలోనైనా మన రహస్య లావాదేవీలు అంతరాయం కలగొచ్చు. అలాగే యాప్‌లో ఎక్కువ డేటా పేరుకుపోతే స్థలం కూడా ఆక్రమిస్తుంది. అందుకే గూగుల్ పే హిస్టరీని డిలీట్ చేయడం చాలా అవసరం అవుతుంది.
బ్యాంక్ ఖాతా రికార్డులపై ఎలాంటి ప్రభావం ఉండదు
దీనికి ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, గూగుల్ పే అనేది యూపిఐ ఆధారంగా నడిచే యాప్. మీరు చేసే ప్రతి లావాదేవీ రికార్డ్ అవుతుంది. ఈ రికార్డులు బ్యాంక్ స్టేట్‌మెంట్‌లా అధికారికంగా ఉండవు. కేవలం యాప్‌లో మాత్రమే కనిపిస్తాయి. కాబట్టి వాటిని డిలీట్ చేస్తే మీ బ్యాంక్ ఖాతా రికార్డులపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఇది కేవలం యాప్‌లోని డేటాను మాత్రమే తొలగించే ప్రక్రియ.
Also Read: RBI-KYC Rules: సెప్టెంబర్ 30 లోపు కెవైసి పూర్తి చేయకపోతే ఖాతా ఫ్రీజ్.. ఆర్‌బిఐ హెచ్చరిక
డిలీట్ చేయాలంటే ఏం చేయాలి?
హిస్టరీని డిలీట్ చేయాలంటే ముందుగా మీ ఫోన్‌లో గూగుల్ పే యాప్‌ను తెరవాలి. పైభాగంలో కనిపించే ప్రొఫైల్ ఫోటో లేదా ఐకాన్‌పై నొక్కితే సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ ప్రైవసీ & సెక్యూరిటీ అనే విభాగం ఉంటుంది. దానిని ఎంచుకుని డేటా & పెర్సొనలైజేషన్‌లోకి వెళ్లాలి. అక్కడ గూగుల్ అకౌంట్ లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే గూగుల్ పే ట్రాన్సాక్షన్ హిస్టరీ అనే విభాగం తెరుచుకుంటుంది. ఇక్కడ మీరు చేసిన అన్ని లావాదేవీలు చూపిస్తాయి. వాటిలో ఏదైనా ఒక లావాదేవీని విడిగా తొలగించుకోవచ్చు. లేకపోతే టైమ్ పీరియడ్ ఆధారంగా గత వారం, గత నెల లేదా మొత్తం హిస్టరీని కూడా ఒకేసారి డిలీట్ చేసే అవకాశం ఉంటుంది.
ఒకసారి డిలీట్ చేస్తే.. ఆ వివరాలు మళ్లీ రావు
అయితే ఇందులో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒకసారి డిలీట్ చేసిన తర్వాత ఆ వివరాలు తిరిగి పొందలేరు. కాబట్టి భవిష్యత్తులో ఏదైనా లావాదేవీ రిఫరెన్స్ అవసరం ఉంటే ముందుగానే స్క్రీన్ షాట్ తీసుకోవడం లేదా వేరే చోట సేవ్ చేసుకోవడం మంచిది. అలాగే ఈ ప్రక్రియలో ఇంటర్నెట్ కనెక్షన్ తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే డేటా గూగుల్ సర్వర్‌లతో సింక్ అవుతుంది. మీరు వాడుతున్న యాప్ తాజా వెర్షన్‌లో ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. పాత వెర్షన్‌లో ఆప్షన్లు వేరేగా ఉండే అవకాశం ఉంటుంది.
హిస్టరీని డిలీట్ చేయడం వల్ల లభించే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మీ ఫోన్ ఎవరి చేతిలో పడినా వారు మీ వ్యక్తిగత లావాదేవీలను చూడలేరు. అంతేకాకుండా యాప్‌లో స్థలం ఖాళీ అవుతుంది. పాత డేటాను తొలగిస్తే యాప్ వేగంగా పనిచేస్తుంది. ఈ సులభమైన ప్రక్రియను కొన్ని సెకన్లలో పూర్తి చేసుకోవచ్చు. ఒకసారి ప్రయత్నిస్తే ఇది ఎంత సులభమో మీకు తెలుస్తుంది.