Vitamin D Deficiency: శరీరానికి విటమిన్స్ చాలా ముఖ్యం. విటమిన్లు శరీరంలో తగినంత ఉన్నప్పుడు మాత్రమే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాము. ఇక వేళ విటమిన్లు లోపిస్తే పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.
మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్ డి కూడా చాలా ముఖ్యం. దీని లోపం వల్ల ఎముకల నొప్పితో పాటు జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా వస్తాయి. అంతే కాకుండా ఇది ఎముకలు, కండరాలు, రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. ఇది సూర్య కాంతి నుండి లభించే ప్రధానమైన విటమిన్ . ఇది కాల్షియం శోషణలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది.
మారుతున్న జీవనశైలి కారణంగా మనం తక్కువ సూర్యకాంతికి గురవుతుంటాం. విటమిన్ బి లోపం ప్రస్తుతం చాలా మందిలో కనిపిస్తుంది. శరీరంలో దీని పరిమాణం తగ్గితే కొన్ని లక్షణాలు మనలో కనిపిస్తాయి. మరి ఆ లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్ డి లోపం వల్ల కలిగే లక్షణాలు:
ఎముకలు, కీళ్ల నొప్పి:
విటమిన్ డి లోపం వల్ల శరీరంలో కాల్షియం సరిగ్గా శోషించబడదు. దీని కారణంగా ఎముకలు కూడా బలహీనపడతాయి. దీని వల్ల వెన్ను నొప్పి సమస్య కూడా పెరుగుతుంది. అంతే కాకుండా ఈ లోపం చాలా కాలం పాటు కొనసాగితే మాత్రం ఆస్టియోపోరోసిస్ ప్రమాదం కూడా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అలసట, బలహీనత:
మీరు ఎలాంటి పని చేయకున్నా కూడా త్వరగా అలసిపోయినట్లు అనిపించడంతో పాటు శరీరం అంతా బలహీనంగా ఉంటే అది విటమిన్ డి లోపం కావచ్చు. ఈ విటమిన్ శక్తిని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. అంతే కాకుండా దీని లోపం శరీరాన్ని నీరసంగా , అలసిపోయేలా చేస్తుంది.
తరచుగా అనారోగ్యానికి గురి కావడం:
విటమిన్ డి మన రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది . అంతే కాకుండా దీని లోపం వల్ల శరీరంలో ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉంటుంది. దీని వలన తరచుగా జలుబు, దగ్గు, ఇతర అనారోగ్యాలు కూడా వస్తాయి.
జుట్టు రాలడం:
మీ జుట్టు వేగంగా రాలిపోతుంటే, దానికి మరే ఇతర కారణం లేనట్లు అనిపిస్తే, అది విటమిన్ డి లోపానికి సంకేతం కావచ్చు. ఈ విటమిన్ జుట్టు మూలాలను బలంగా ఉంచుతుంది . దీని లోపం వల్ల జుట్టు సన్నగా, బలహీనంగా మారుతుంది.
మానసిక కల్లోలం, నిరాశ:
విటమిన్ డి మన మెదడులోని సంతోష హార్మోన్ (సెరోటోనిన్) స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీని లోపం వల్ల మానసిక స్థితిలో మార్పులు, ఆందోళన , నిరాశ వంటి సమస్యలు వస్తాయి. మీరు ఎటువంటి కారణం లేకుండా విచారంగా లేదా ఒత్తిడికి గురైతే దానికి ఒక కారణం విటమిన్ డి లోపం కావచ్చు.
విటమిన్ డి లోపాన్ని తగ్గించే మార్గాలు:
విటమిన్ డి కి ఉత్తమ సహజ వనరు సూర్యకాంతి. ప్రతిరోజూ ఉదయం 7 నుండి 10 గంటల మధ్య 15-20 నిమిషాలు ఎండలో కూర్చోవడం ద్వారా శరీరం తగినంత విటమిన్ డి పొందవచ్చు. ముఖ్యంగా అర చేతులు, పాదాలు, ముఖంపై సూర్యకాంతి పడటం ప్రయోజనకరంగా.
సరైన ఆహారం తీసుకోవడం:
విటమిన్ డి అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల దాని లోపాన్ని అధిగమించవచ్చు. దీని కోసం పాలు, జున్ను, పెరుగు, గుడ్డు పచ్చసొన, పుట్టగొడుగులు, సోయా ఉత్పత్తులు, నారింజ , చేపలు (సాల్మన్, ట్యూనా) తీసుకోవడం మంచిది.
సప్లిమెంట్లు తీసుకోవడం:
శరీరంలో విటమిన్ డి లోపం తీవ్రంగా ఉంటే డాక్టర్ సలహా మేరకు విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవచ్చు. ఈ సప్లిమెంట్లు టాబ్లెట్లు, క్యాప్సూల్స్ , సిరప్‌ల రూపంలో లభిస్తాయి. కానీ వాటిని తీసుకునే ముందు ఖచ్చితంగా డాక్టర్ల సలహా తీసుకోండి.
Also Read: బొప్పాయి రసం తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు !
వ్యాయామం, యోగా:
క్రమం తప్పకుండా వ్యాయామం , యోగా చేయడం వల్ల శరీరం విటమిన్ డి బాగా గ్రహించబడుతుంది. సూర్య నమస్కారం, తడసానం, భుజంగాసనం వంటి యోగా భంగిమలు కూడా ఇందుకు ప్రయోజనకరంగా ఉంటాయి.
ఆరోగ్యకరమైన జీవనశైలి:
సిగరెట్ తాగడం, అధికంగా మద్యం తాగడం విటమిన్ డి శోషణను ప్రభావితం చేస్తాయి. అందుకే ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు మంచి దినచర్యను అవలంబించడం చాలా ముఖ్యం.