మనదేశంలో పాడి పరిశ్రమ ఎంతో పెద్ది. ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా మనదేశమే ముందు స్థానంలో ఉంది. ప్రపంచ పాల ఉత్పత్తిలో 23 శాతం వాటా మన దేశానిదే. అయితే ఇప్పుడు అమెరికా మన పాల మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నం చేస్తుంది. తాము తయారు చేసిన నాన్ వెజ్ పాలను భారత దేశంలో అమ్మాలని ప్రయత్నిస్తోంది. నాన్ వెజ్ పాలు అంటే ఏమిటి? దాన్ని భారతదేశం ఎందుకు వ్యతిరేకిస్తుందో తెలుసుకోండి.
నాన్ వెజ్ పాలు అంటే ఏమిటి?
నాన్ వెజ్ పాలు కూడా ఆవుల నుండే వస్తాయి. అయితే ఆవులు మన దేశంలోలాగా గడ్డి తినవు. వాటికి ప్రత్యేకంగా మాంసం, జంతువు ఆధారిత ఉత్పత్తులను తినిపిస్తారు. కాబట్టే అది ఇచ్చే పాలను నాన్ వెజ్ పాలు అంటారు. వివిధ నివేదికలు చెబుతున్న ప్రకారం అమెరికాలోని పశువులకు ఇచ్చే ఆహారంలో జంతు ఉత్పత్తులు కూడా ఉన్నాయి. పందులు, చేపలు, కోళ్లు, గుర్రాలు, పిల్లులు, కుక్కల మాంసాన్ని ఆవులకు తినిపిస్తారు. వాటి ద్వారా ప్రోటీన్ పశువులకు అందుతుందని చెబుతారు. కానీ మన దేశంలో మాత్రం ఆవులు పూర్తి శాకాహారులు.
మనదేశంలో దొరుకుతాయా?
అమెరికా భారతదేశంలోని పాల మార్కెట్లోకి ఈ నాన్ వెజ్ పాలను ప్రవేశపెట్టాలని కోరుకుంటోంది. ట్రంప్ ఈ విషయంపై ఇప్పటికే భారతదేశంతో తీవ్రంగా చర్చిస్తున్నారు. భారతదేశం మాత్రం ఈ నాన్ వెజ్ పాలుకు అనుమతి ఇచ్చేందుకు సిద్ధంగా లేదు. ఎందుకంటే మన దేశంలో మతపరమైన ఆచారాలు ఎక్కువ. పాలను నెయ్యిని ఎంతో పవిత్రంగా చూస్తారు. ఇలాంటి నాన్ వెజ్ పాలు భారతదేశంలో అడుగుపెడితే సాంస్కృతిక, మతపరమైన ఆందోళనలు పెరిగే అవకాశం ఉంది. ఆవుపాలతో శివునికి అభిషేకం చేయడం, ఆ పాలతో చేసిన నెయ్యితో దీపాలు వెలిగించడం వంటివి చేస్తాము. కానీ నాన్ వెజ్ పాలను మాత్రం అలాంటి వాటికి వాడలేము. కాబట్టి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని భారతదేశం ప్రతినిధులు వారిస్తున్నారు.
అంతేకాదు అమెరికా పాల దిగుమతులను అనుమతిస్తే భారతదేశంలో ఏటా ఒక లక్ష కోట్ల రూపాయలను నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ నాన్ వెజ్ పాలను అమెరికా చౌక ధరకే భారత్ లో అమ్మాలని చూస్తోంది. అలా అయితే భారత్ లోని పాడి పరిశ్రమ నుంచి వచ్చే పాలను కొనేవారి సంఖ్య తగ్గవచ్చు. ఇది రైతులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది.
భారతదేశంలో పాల ఉత్పత్తులను అధికంగా వాడతారు. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, జున్ను ఇలా అనేక రకాల అనేక రూపాలలో వినియోగిస్తారు. పాల నుంచి మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు అందుతాయి. అలాగే మన దేశంలో శాఖాహారుల సంఖ్య కూడా ఎక్కువే. కాబట్టి నాన్ వెజ్ పాలన మన దేశంలోకి అనుమతించే అవకాశాలు చాలా తక్కువనే చెప్పుకోవాలి.