BigTV English

Anthrobots : ఆంత్రోబాట్స్‌తో మానవ కణాల రిపేర్!

Anthrobots : ఆంత్రోబాట్స్‌తో మానవ కణాల రిపేర్!
Anthrobots

Anthrobots : వ్యాధులను నయం చేయగల అతి సూక్ష్మ రోబోలను శాస్త్రవేత్తలు సృష్టించారు. మానవ కణాల సాయంతో ఈ మైక్రోస్కోపిక్ రోబోలకు ఊపిరిపోశారు. భవిష్యత్తులో ఏదో ఒక రోజు ఇవి మన శరీరం అంతటా సంచరిస్తూ పహరా కాయొచ్చు. వ్యాధిసోకిన కణాలను, దెబ్బతిన్నకణజాలాన్ని శోధించడమే కాకుండా అక్కడికక్కడే నయం కూడా చేసేస్తాయట!


ఆంత్రోబాట్స్‌గా వ్యవహరించే ఈ సూక్ష్మ రోబోలు మెదడు కణాలకు సైతం మరమ్మతు చేస్తాయని మసాచుసెట్స్‌లోని టఫ్ట్స్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దెబ్బతిన్న కణాలు, కణజాలాన్ని మరమ్మతు చేసే ఈ సాంకేతికతతో భవిష్యత్తులో అల్జీమర్స్ వంటి వ్యాధుల నుంచి గట్టెక్కవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే దీనిపై మరింత విస్తృతంగా పరిశోధనలు జరగాల్సి ఉందని తెలిపారు.

తాజా పరిశోధన ఫలితాలు అడ్వాన్స్డ్ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఆంత్రోబాట్స్ అంటే హ్యూమన్ రోబోలని అర్థం. మనం పీల్చే గాలిలో హానికారక పదార్థాలను వడబోసే ఎయిర్ వే సెల్స్ నుంచి వీటిని తయారు చేశారు కాబట్టి హ్యూమన్ రోబోలుగా పిలుస్తున్నారు. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ మరింత విస్తృతమయ్యే పక్షంలో.. ఆస్పత్రుల్లోనే వీటిని తయారు చేసేయొచ్చు.


ఓ వ్యక్తి సొంత కణాలు, అతని డీఎన్ఏ నుంచే బాట్స్‌ను సృష్టిస్తారు కాబట్టి.. అవి శరీరంలో ఇమిడిపోగలవని టఫ్ట్స్ యూనివర్సిటీ బయాలజీ ప్రొఫెసర్, ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన మైఖేల్ లెవిన్ వివరించారు. అంటే మన శరీరం ఆ బాట్స్‌ను తిరస్కరించేందుకు రవ్వంత అవకాశం కూడా ఉండదన్నమాట. ఏదైనా అవయవ మార్పిడి జరిగిన అనంతరం ఇమ్యూనో సప్రెస్సెంట్స్ వాడాల్సి ఉంటుంది. ఆంత్రోబాట్స్ విషయంలో అలాంటి డ్రగ్స్ అవసరం కూడా ఉండదని లెవిన్ స్పష్టం చేశారు.

ఆంత్రోబాట్స్ నిర్మాణానికి ఆయన, సహచర బృందం తొలుత ఊపిరితిత్తుల లైనింగ్‌లోని కణాల శాంపిల్స్ సేకరించారు. అవి విభజితమై.. ఓ డిష్‌లో కణాలు మరింతగా వృద్ధి అయి గుత్తిలా పెరిగేలా చూశారు. జన్యుమార్పిడి ద్వారా కణాలను వృద్ధి చేసే పద్ధతి ఇప్పటికే ఉన్నప్పటికీ.. శరీరం వాటిని తిరస్కరించే అవకాశం ఉంది.

దీంతో శాస్త్రవేత్తలు కణ వృద్ధికి అవసరమైన పరిస్థితులనే మార్చేశారు. తద్వారా వృద్ధి చెందిన కణసమూహం.. ఎలాంటి సాయం లేకుండా తమంతట తామే సంచరించగలిగేలా చేసే విధానాన్ని అనుసరించారు. అనంతరం ఈ సెల్ఫ్ ప్రొపెల్డ్ ఆంత్రోబాట్స్‌‌ను పరీక్షించారు. కృత్రిమ పద్ధతుల్లో దెబ్బతిన్న మెదడు కణాల గుండా ఆంత్రో‌బాట్ కదిలినప్పుడు వాటి మధ్య తాత్కాలిక అనుసంధానాన్ని ఏర్పరచడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. అంతే కాదు.. నాడీ కణాలు తిరిగి పెరగడం ఆరంభించాయి.

గతంలో ఈ శాస్త్రవేత్తల బృందమే కప్ప పిండ కణాల నుంచి జెనోబాట్స్‌ను నిర్మించే పరిశోధన చేపట్టింది. దాని ఆధారంగానే తాజాగా ఆంత్రోబాట్స్ పరిశోధన సాగింది. డిమెన్షియా లాంటి వ్యాధుల్లో ఆంత్రోబాట్స్ పనితీరు ఎలా ఉంటుందన్నదీ తదుపరి పరిశోధనల్లో పరిశీలించే అవకాశం ఉంది. ఏది ఏమైనా వైద్యరంగంలో ఆంత్రోబాట్స్ కీలక పాత్ర పోషించే తరుణం సమీపంలో ఉందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Fenugreek Seeds Sprouts: మొలకెత్తిన మెంతులు తింటే.. ఈ సమస్యలు దూరం !

Avocado For Hair: అవకాడోతో మ్యాజిక్.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×