Wasting Money: నేటి ఆధునిక జీవనశైలిలో వచ్చిన మార్పుల వల్ల కొందరు అవసరం ఉన్నా, లేకపోయినా వారికి నచ్చింది కొనేస్తుంటారు. విలాసాల కోసం విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటారు. అయితే, మీ సంపాదన అధిక మొత్తంలో ఉన్నాకూడా.. ఖర్చుల విషయంలో మాత్రం ఇలాంటి దుబారా ఖర్చులు తగవంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇలా.. ఇష్టం వచ్చినట్లు ఖర్చుపెడుతుంటే.. అప్పటికప్పుడు సంతోషాన్నిచ్చినా.. భవిస్యత్తులో ఆర్థికంగా అనేక సమస్యల్ని ఎదుక్కోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి.. మొదటి నుంచే విలాసవంతమైన కోరికలకు కళ్లెం వేయమంటున్నారు. దీనికోసం కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవడం తప్పనసరి అంటున్నారు. అవేంటంటే..
నిత్యావసరాల కోసం మార్కెట్‌కు వెళ్లినప్పుడో.. లేదా షాపింగ్‌కు వెళ్లినప్పుడే అవసరానికి మించి కొనడం మానేయాలి. ఒకవేళ బయటికి వెళ్లకపోయినా ఆన్‌లైన్ ఆర్డర్ పెట్టినా అనవసరమైనవి కొనాలనిపిస్తుంటుంది. ఇంటి అలంకరణ కోసం ఏదిపడితో అవి కొనేయడం, తర్వాత వాటి ఉపయోగం లేదని మూలన పెట్టడం.. ఇవన్నీ దుబారా ఖర్చుల కిందకే వస్తాయి. తెలిసి తెలిసి అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడం ఎందుకు? కాబట్టి.. చేతినిండా డబ్బుందని మనసులో తలెత్తే ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తే.. వృథా ఖర్చుల్ని చాలావరకు తగ్గించుకోవచ్చు.
ఈ టెక్ యుగంలో డబ్బుకు సంబంధించిన లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లోనే పే చేస్తుంటారు చాలామంది. కొంతమంది వీటిని వాళ్లే స్వయంగా చెల్లించేలా ఆప్షన్ పెట్టుకుంటే.. మరికొంతమంది ఒక నిర్ణీత టైంలో ఆటో పేమెంట్ అయ్యే ఆప్షన్ పెట్టకుంటారు. డబ్బు విషయంలో వృథా ఖర్చులు చేసే వారికి ఈ రెండో తరహా పద్ధతే బెస్ట్. ఎందుకంటే.. నెలనెలా ఒక నిర్ణీత సమయంలో ఆయా చెల్లింపుల కోసం డబ్బు ఆటోమేటిక్‌గా కట్ అయిపోతుందన్న ఆలోచన ఉన్నప్పుడు.. అకౌంట్లో చెల్లింపులకు సరిపడినంత డబ్బును ఉంచేలా వీళ్లు జాగ్రత్తపడతారని.. తద్వారా విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టే పద్ధతికి క్రమంగా కళ్లెం వేయవచ్చు.
కొన్ని రకాల ఒత్తిడి, ఆందోళనల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో కొంతమంది.. షాపింగ్ చేస్తే అంతా సెట్ అయిపోతుంది అనుకుంటారు. ఇలా.. షాపింగ్‌తో ఒత్తిడిని దూరం చేసుకోవాలని డబ్బులు ఖర్చుపెడితే.. ఇదీ ఒక రకమైన వృథా ఖర్చే అంటున్నారు నిపుణులు. అంతేకాదు, ఈ క్రమంలో మానసిక సంతృప్తి కోసం విచ్చలవిడిగా జంక్ ఫుడ్స్ కొనుక్కుని తినేస్తున్నారు. దీని ప్రభావం ఆరోగ్యంపై పడుతుంది. కాబట్టి.. ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించుకోవడం ఉత్తమం.
డబ్బు సంపాదిస్తే సరిపోదు.. ఆర్థికంగా మనకున్న బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తించినప్పుడే భవిష్యత్తులో ముందుకెళ్లగలము. అనవసరమైన ఖర్చుల్ని అదుపు చేసుకోవడానికి మీకొచ్చిన జీతంలో నుంచి 50% డబ్బును.. ఇంటి అద్దె, లోన్, ఇన్సూరెన్స్, ఇతర నెలవారీ చెల్లింపుల కోసం వాడుకోవాలి. ఇక నెలనెలా అయ్యే నిత్యావసర ఖర్చుల్నీ ఇందులో నుంచే బ్యాలన్స్ చేసుకోవాలి. ఇక 30% డబ్బును మన వ్యక్తిగత అవసరాలు కోసం వెచ్చించేలా చూసుకోవాలి. ఇక మిగిలిన 20% డబ్బును లాభదాయకంగా ఉండే పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టడం, అందులో నుంచే కొంత మొత్తాన్ని అత్యవసర నిధిగా జమ చేసుకోవడం.. ఇలా నిపుణుల సలహాతో పొదుపు-మదుపు చేస్తే.. వృథాగా డబ్బు ఖర్చు పెట్టే సమస్యకు చెక్ పెట్టచ్చు.