ప్రతి ఇంట్లోనూ కరివేపాకులు ఉంటాయి. పది రూపాయలు ఇస్తే చాలు పెద్ద కరివేపాకు కట్ట ఇస్తారు. దాంతో మీరు టేస్టీగా ఆరోగ్యకరమైన కరివేపాకు రైస్ చేయొచ్చు. దీన్ని చేయడం కూడా చాలా సులువు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వారానికి ఒక్కసారైనా కరివేపాకు రైస్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే జుట్టు పెరుగుదలకు కరివేపాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక కరివేపాకు రైస్ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
కరివేపాకు రైస్ రెసిపీకి కావలసిన పదార్థాలు 
వండిన అన్నం – రెండు కప్పులు
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – ఒక స్పూను
ఆవాలు – అర స్పూను
జీలకర్ర – అర స్పూను
వేరుశనగ పలుకులు – గుప్పెడు
ధనియాల పొడి – అర స్పూను
కారం – అర స్పూన్
పసుపు – పావు స్పూను
కరివేపాకులు – ఒక కప్పు
పచ్చి శెనగలు – రెండు స్పూన్లు
కరివేపాకు రైస్ రెసిపీ 
1. ముందుగానే అన్నాన్ని వండి ఒక ప్లేట్లో ఆరబెట్టాలి. అన్నం మొత్తం పొడిపొడిగా వచ్చేలా వండుకోవాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. ఆ నూనెలో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసి వేయించుకోవాలి.
3. అలాగే ధనియాల పొడి, కారం, పసుపు, కరివేపాకులు కూడా వేసి వేయించుకోవాలి. రెండు నిమిషాలు వాటిని వేయించాక స్టవ్ ఆఫ్ చేయాలి.
4. ఆ మొత్తం మిశ్రమాన్ని బాగా చల్లార్చాలి. తర్వాత వాటిని ఒక మిక్సీలో వేసి మెత్తగా పొడి లాగా రుబ్బుకోవాలి.
5. ఇప్పుడు వండిన అన్నంలో ఈ పొడి లేదా పేస్ట్ ను వేసి కలుపుకోవాలి.
6. ఇక స్టవ్ మీద కళాయి పెట్టి వేరుశెనగ పలుకులను నూనెలో వేయించాలి.
7. ఆ వేయించిన వేరుశెనగలు అన్నంలో కలుపుకోవాలి. అంతే టేస్టీ కరివేపాకు రైస్ రెడీ అయినట్టే.
8. ఇది వండడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడు కూడా కరివేపాకు రైస్ ప్రయత్నించవచ్చు.
కరివేపాకులు మన శరీరానికి అత్యవసరమైన పోషకాలు ఉంటాయి. రక్తహీనతతో బాధపడేవారు కరివేపాకును ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇది అధిక కొలెస్ట్రాల్ ను కూడా నియంత్రిస్తుంది. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మీరు ప్రతిరోజు కరివేపాకు పొడిని తినాల్సిందే. రక్తపోటును అదుపులో ఉంచడంలో కూడా కరివేపాకులు ఉపయోగపడతాయి.. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి శరీరంలోని ప్రీ రాడికల్స్ తో పోరాడే శక్తి వీటికి ఉంటుంది. కరివేపాకులు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. వీటిలో ఉండే ఐరన్ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి రక్తహీనత సమస్యను దూరం చేస్తాయి.
కరివేపాకులలో పొటాషియం అధికంగా ఉంటుంది. కాబట్టి అధిక రక్తపోటు కూడా అదుపులోనే ఉంటుంది. వీటి ధర తక్కువే.. కాబట్టి ప్రతిరోజు కరివేపాకును ఆహారంలో ఏదోలాగా భాగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదా నీటిలో కరివేపాకు ఆకులను వేసి నానబెట్టి మరిగించి టీలాగా తాగడానికి ప్రయత్నించండి. పచ్చి కరివేపాకు నమిలినా కూడా ఎంతో మంచిది. కూరలు, పప్పు ఇలాంటి వంటకాలు ఏవైనా కూడా కచ్చితంగా గుప్పెడు కరివేపాకులు వేసి.. వాటిని ఏరి పడేయకుండా తినేందుకు ప్రయత్నించండి.