Trial Separation: వివాహం.. మనసులు కలిసిన ఇద్దరు వ్యక్తుల నిండు నూరేళ్ల బంధం. అయితే, ఈ రోజుల్లో వివిధ కారణాల వల్ల భార్యాభర్తల అనుబంధం భారంగా మారుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటున్నారు. కారణం ఏదైనా సరే.. ఈ భావన భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచుతుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో విడాకుల దాకా వెళ్లే జంటలూ లేకపోలేదు. అయితే, ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు.. ఆఖరి ప్రయత్నంగా ఒక్కసారి ‘ట్రయల్ సెపరేషన్’ పద్ధతిని పాటించడం ఉత్తమం. ఇది దంపతుల మధ్య పెరిగిన దూరాన్ని దగ్గర చేసి.. తిరిగి అనుబంధాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఏంటీ ట్రయల్ సెపరేషన్? బంధాన్ని రిపేర్ చేసేందుకు ఇదెలా సహకరిస్తుంది? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
భార్యాభర్తల బంధంలో చిన్న చిన్న గొడవలైనా, ఏ విషయంలోనైనా ఇద్దరి మధ్య పొరపచ్చాలు దొర్లినా, విడాకులే ఏకైక పరిస్కారం అనుకుంటున్నాయి కొన్ని జంటలు. కానీ, ఇలా వివాహ బంధాన్ని తెగతెంపులు చేసుకోవడం కంటే.. కాస్త ఓపికగా ఉండి రిపేర్ చేసుకోవడం మంచిది. ఈ క్రమంలోట్రయల్ సెపరేషన్ పద్ధతి మేలంటున్నారు నిపుణులు. భేదాభిప్రాయాలు వచ్చిన పార్ట్‌నర్స్
విడాకులు తీసుకోకుండా.. కొన్నిరోజుల పాటు దూరంగా ఉండటమే ఈ పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశం.
ట్రయల్ సెపరేషన్‌లో భాగంగా.. ఇద్దరూ వేర్వేరు ఇళ్లలో నివసించవచ్చు. లేదంటే.. ఒకే ఇంట్లో వేర్వేరు గదుల్లోనూ ఉండవచ్చు. సాధారణంగా పార్ట్‌నర్స్ కొన్ని రోజులు దూరంగా ఉంటే, ప్రేమలు పెరుగుతాయంటారు. ట్రయల్ సెపరేషన్‌లోనూ ఇదే జరుగుతుంది. ఇద్దరూ ఇలా.. విడిపోయి కలిసుండటం వల్ల భాగస్వామి విలువేంటో, వారిని ఎంతగా మిస్సవుతున్నారో తెలిసొస్తుందని, మళ్లీ ఇద్దరూ కలుసుకునేందుకు దోహదం చేస్తాయంటున్నారు నిపుణులు. అంతేకాదు, వాళ్లిద్దరూ దూరమవ్వడానికి గల కారణాలు ఏంటి? వారి బంధంలో తలెత్తిన సమస్యలేంటి? వాటికి పరిష్కార మార్గాలేంటి? వంటి అనుమానాలు వారిలో కలుగుతాయట. దీంతో వారి అనుబంధం తిరిగి కలిసే అవకాశాలు ఎక్కువట.
ఎన్నో ఆశలు, ఆశయాలతో వివాహ బంధంలోకి అడుగుపెడతాం. అయితే, ఏదో ఒక సమయంలో గొడవలతో ఇవన్నీ ఆవిరైపోతాయి. కాబట్టి.. ఈ ట్రయల్ సెపరేషన్ పద్ధతి ద్వారా తమ మనసులోని భావాలు పంచుకోవడం, తగిన ప్రణాళికలు రచించుకోవడం.. వంటివి చేయచ్చు. భార్యాభర్తలు తిరిగి కలవడానికి ఇది మంచి ప్రయత్నం. అనుబంధంలో ఉండకూడనిది మొండితనం. కొన్నిసార్లు భార్య, మరికొన్ని సందర్భాల్లో భర్త సర్దుకుపోవాలి. తమ పొరపాట్లు సరిదిద్దుకోవడంతో పాటు.. అవతలి వారిని క్షమించగలిగే నేర్పు ఇద్దరికీ ఉన్నప్పుడే దాంపత్య జీవితం సాఫీగా సాగుతుందంటున్నారు నిపుణులు.