ఏ రుచికరమైన వంటకం అయినా నూనె లేనిదే చేయడం కుదరదు. చికెన్ నుంచి ఆలూ చిప్స్ వరకు ప్రతిదీ నూనెలో వేగాల్సిందే. సలాడ్ డ్రెస్సింగ్ కి కూడా పైన ఒక స్పూను నూనె చల్లాల్సిందే. అయితే కొన్ని నూనెలు శరీరానికి మేలు చేస్తాయి. కానీ కొన్ని నూనెలు మాత్రం ఎంతో హానికరం. అయితే ఏ నూనె అయినా కూడా అధికంగా తీసుకుంటే మాత్రం ఆ ప్రభావం గుండెపై నేరుగా పడుతుంది.
కార్డియాలజిస్టు ఆయన డాక్టర్ అలోక్ చాప్రా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని నూనెలు గుండెకు హానికరమని వివరించారు. వాటిని అధికంగా వాడడం ప్రమాదకరమని చెప్పారు. అతను ఎలాంటి నూనెలు వాడకూడదో, ఏ నూనెలను అధికంగా వాడాలో వివరించారు.
ఈ నూనెలు ప్రమాదకరం
సాధారణంగా ఇళ్లల్లో పొద్దుతిరుగుడు అంటే సన్ ఫ్లవర్ ఆయిల్ అధికంగా ఉంటుంది. సన్ఫ్లవర్ ఆయిల్, సోయా, మొక్కజొన్న వంటి వాటితో తయారు చేసిన నూనెలు సహజ ఆహార పదార్థాల కిందకు రావని డాక్టర్ చోప్రా చెబుతున్నారు. ఈ నూనెలను అధిక వేడికి రసాయనాలకు గురిచేసి అధిక పీడనాన్ని ఉపయోగించి కర్మగారాల్లో తయారు చేస్తారని వివరించారు. ఈ తయారీ ప్రక్రియలో నూనె ఆక్సీకరణానికి గురవుతుంది. దానివల్ల నూనెలోని సహజ నిర్మాణాలు చెడిపోతాయని చెప్పారు. కాబట్టి అలాంటి నూనెలు వాడడం శరీరానికి హానికరంగా మారుతాయి అని చెబుతున్నారు.
డాక్టర్ చోప్రా చెబుతున్న ప్రకారం ఇలాంటి ఆక్సిడైజ్డ్ నూనెలు… ఫ్రీ రాడికల్స్ ను శరీరంలో ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. దీనివల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది. గుండె జబ్బులు, ఊబకాయం, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు నూనెలు కారణమవుతాయి. ఇలాంటి నూనెలో ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు, అలాగే లినోలెయిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. దీనివల్ల శరీరంలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాల మధ్య సమతుల్యత దెబ్బతింటుంది. ఇది డయాబెటిస్ కు, చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం అవుతుంది. అలాగే శరీరంలో ఇన్ఫ్లమేషన్ కూడా పెరిగిపోతుంది.
రెస్టారెంట్లలో ఒకే నూనెను పదేపదే ఉపయోగిస్తూ ఉంటారు. అధిక ఉష్ణోగ్రత వద్దకు నూనె స్మోకింగ్ పాయింట్ పదే పదే చేరుకోవడం వల్ల ఆ నూనె విషపూరితంగా మారుతుంది. ఆ నూనెలో విషపూరిత ఆల్డిహైడ్లు, రసాయన సమ్మేళనాలు పుట్టుకొస్తాయి. ఇలాంటి వాటిని తినడం వల్ల డిఎన్ఏ కూడా ప్రభావితం అవుతుంది. శరీరంలో మంట, వాపు వంటివి పెరిగిపోతాయి.
ఈ నూనెలు ఆరోగ్యకరం
అయితే ఎలాంటి నూనెలను అధికంగా వాడాలో అని ఎంతో మంది ఆలోచిస్తారు. దానికి కూడా వైద్యులు సరైన సమాచారాన్ని అందించారు. ఇంట్లో కొబ్బరి నూనె, ఆవనూనె, నెయ్యి వంటివి వాడితే మంచిది. ఎందుకంటే ఇవన్నీ కోల్డ్ ప్రెస్డ్ నూనెలు. తక్కువ ప్రాసెస్ కు గురయ్యే నూనెలు. అలాంటి నూనెలను వాడడం వల్ల దీర్ఘకాలికంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో ఒమేగా 6, ఒమేగా 3 సమతుల్యత కూడా ఉంటుంది. కాబట్టి ప్రాసెస్ చేసి తయారైన నూనెలకు బదులుగా కోల్డ్ ప్రెస్డ్ నూనెలను వాడడం ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది.