East Godavari Crime: భార్యాభర్తల మధ్య సమస్యలు ఉండొచ్చు. కానీ పొడుచుకునే వరకు తెచ్చుకోవడం ఘోరం. అదీ పెళ్లయి రెండు దశాబ్దాల తర్వాత కూడా. చివరకు చాకుతో భార్యపై దాడి చేశాడు. ఆ కత్తి.. భార్య కంటి నుంచి నోటి వరకు దూసుకుపోయింది. ప్రస్తుతం ఆపరేషన్ చేసి చాకును తొలగించారు డాక్టర్లు. సంచలనం రేపిన ఈ ఘటన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు చూసింది.
భార్యభార్తల మధ్య విభేదాలు
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం అడ్డపుంత ప్రాంతంలో ఊహించని ఘటన జరిగింది. రెండు దశాబ్దాల కిందట గంగరాజు- పళ్లాలమ్మలు ప్రేమించుకున్నారు. ఇద్దరిదీ ఒకటే గ్రామం, ఆపై మనసులు కలవడంతో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
భార్యాభర్తలు అన్న తర్వాత మాటామాటా సహజం. కానీ ఈ దంపతుల మధ్య ఏం జరిగిందో తెలీదు. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో కూర్చొని మాట్లాడుకుంటే సమస్య కొంతైనా సద్దుమణిగేది. పంతాలకు పోయారు.. దంపతుల మధ్య అగాధం పెరిగిపోయింది. ఆ తర్వాత తరచూ గొడవలు పడేవారు. ఇంతవరకు బాగానే జరిగింది.
కంటి నుంచి పళ్ల వరకు దూసుకుపోయిన చాకు
సరిగ్గా దీపావళి పండగ వేళ అయ్యింది. సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో భార్యాభర్తల మధ్య చిన్నపాటి మాటలు యుద్ధం సాగింది. ఆవేశంతో చేయి చేసుకున్నాడు భర్త. పట్టరాని కోపంతో భార్యపై గంగరాజు చాకుతో హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆమె తప్పించుకోవడంతో ఆ చాకు భార్య ఎడమ కంటి పైభాగం నుంచి లోతుగా దిగిపోయింది. కంటి నుంచి నోటి వరకు గుచ్చుకుంది.
ALSO READ: మద్యం మత్తులో తండ్రిని చంపిన కొడుకు, మేటరేంటి?
ఈ ఘటన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు భర్త గంగరాజు. దీపావళి సందడిలో ఉన్న కూతుళ్లు, గదిలో అరుపులు మొదలుకావడంతో ఇంట్లోకి పరుగెత్తారు. రక్తస్రావంతో అపస్మారక స్థితికి చేరింది పళ్లాలమ్మ. వెంటనే బంధువులు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వెంటనే డాక్టర్లు ఆపరేషన్ చేసి చాకును తొలగించారు. ప్రస్తుతానికి పళ్లాలమ్మ ట్రీట్‌మెంట్ తీసుకుంటోంది. మాట్లాడటానికి ఇంకా సమయం పడుతుందని వైద్య బృందాలు తెలిపాయి. పరారైన గంగరాజుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. తల్లిదండ్రులు కూతుర్ని ఆ స్థితిలో చూసి కన్నీరుమున్నీరు అవుతున్నారు తల్లిదండ్రులు. గంగరాజు అరెస్టయితే అసలు విషయాలు బయటకు వస్తాయని అంటున్నారు పోలీసులు.