ఢిల్లీతో సహా నార్త్ అంతటా ప్రస్తుతం చలిగాలుగు మొదలయ్యాయి. శీతాకాలం ఇప్పుడిప్పుడే షురూ అవుతోంది. ఈ సమయంలో రైలు ప్రయాణం చేసే వాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా స్లీపర్ కోచ్ లో ప్రయాణించేందుకు ప్లాన్ చేస్తుంటే, చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అయితే, ఈ సందర్భంగా రైల్వే అందిస్తున్న ఓ క్రేజీ సౌకర్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. దీని ప్రకారం.. మీరు స్లీపర్ కోచ్‌లో టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ AC కోచ్‌లో ప్రయాణించే అవకాశం ఉంటుంది. IRCTC తన కస్టమర్లకు ఈ ప్రయోజనం అందించేందుకు ఒక ప్రత్యేక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే, ఆటో అప్‌గ్రేడేషన్ స్కీమ్. ఇంతకీ ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే..
వాస్తవానికి, ఎక్కువ ఛార్జీల కారణంగా, రైళ్లలోని టాప్ క్లాస్ కోచ్ లు అయిన AC1, AC2 తరచుగా ఖాళీగా ఉంటాయి. ఈ ఖాళీ బెర్తుల కారణంగా రైల్వేకు పెద్ద మొత్తంలో నష్టం కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ నష్టాన్ని నివారించేందుకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఆటో అప్‌గ్రేడ్ పథకాన్ని ప్రారంభించాయి. ఈ పథకం ప్రకారం ఏసీ కోచ్ లో బెర్త్ ఖాళీగా ఉంటే, దిగువ తరగతి నుంచి ప్రయాణీకుడిని పై తరగతికి అప్ గ్రేడ్ చేస్తారు.
ఈ పథకం ఎలా పని చేస్తుంది? అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం.. ఒక రైలులో ఫస్ట్ ACలో నాలుగు ఖాళీ సీట్లు, సెకండ్ ACలో రెండు ఖాళీ సీట్లు ఉన్నాయని అనుకుందాం. సెకండ్ ACలోని కొంతమంది ప్రయాణీకులను ఫస్ట్ ACకి అప్‌గ్రేడ్ చేస్తారు. థర్డ్ ACలోని ప్రయాణీకులను సెకండ్ ACకి అప్‌గ్రేడ్ చేస్తారు. దీని వలన థర్డ్ ACలో కొన్ని సీట్లు ఖాళీగా ఉంటాయి. ఇది థర్డ్ ACలో వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ప్రయాణీకులకు మేలు కలిగిస్తుంది. ఈ విధంగా రైలులోని ఏ కోచ్‌లోనూ బెర్తులు ఖాళీగా ఉండవు. రైల్వేకు నష్టం కలగదు.
టికెట్ బుక్ చేసుకునేటప్పుడు, ప్రయాణీకుడిని ఆటో అప్ గ్రేడ్‌ను అనుమతించడానికి సిద్ధంగా ఉన్నారా? అని IRCTC అడుగుతుంది. ‘అవును’ అనే ఆప్షన్ ను ఎంచుకుంటే మీ టికెట్ అప్ గ్రేడ్ చేయబడుతుంది. మీరు ‘లేదు’ సెలెక్ట్ చేస్తే పైతరగతులకు పంపే అవకాశం ఉండదు.
అప్ గ్రేడ్ తర్వాత ప్రయాణీకుడి PNR స్టేటస్ లో ఎలాంటి మార్పు ఉండదు. ప్రయాణీకులు ఏదైనా ప్రయాణ సంబంధిత సమాచారం కోసం వారి అసలు PNR స్టేటస్ ను ఉపయోగిస్తారు. అయితే, అప్ గ్రేడ్ తర్వాత వారు తమ టికెట్‌ను రద్దు చేసుకుంటే, అప్ గ్రేడ్ చేసిన తరగతి ఆధారంగా కాకుండా వారి అసలు టికెట్ ఆధారంగా వారికి రీఫండ్ లభిస్తుంది.
Read Also: అబ్బాయి, అమ్మాయికి కలిపి RAC సీటు.. చివరికి ఏం జరిగిందంటే?