Muscle Growth Food: శరీర సౌష్ఠవాన్ని పెంచడానికి, కండరాలను బలోపేతం చేసుకోవడానికి కేవలం వ్యాయామం చేస్తే సరిపోదు. సరైన పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. కండరాల నిర్మాణంలో ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా.. ప్రోటీన్ అంటే వెంటనే మాంసం, గుడ్లు లేదా పన్నీర్ వంటివి గుర్తుకొస్తాయి. కానీ వెజిటేరియన్స్ కూడా కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నాన్ వెజ్ కంటే ఎక్కువ మోతాదులో ప్రొటీన్ అందించే శాకాహారం కూడా ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. పచ్చి సోయాబీన్స్: పచ్చి సోయాబీన్స్ అత్యధిక ప్రోటీన్ కలిగిన కూరగాయల్లో ఒకటి. ఒక కప్పు ఉడికించిన ఎడమామేలో సుమారు 17-18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది అన్ని అవసరమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉన్న ‘సంపూర్ణ ప్రోటీన్’ కావడం వల్ల కండరాల పెరుగుదలకు అద్భుతంగా పనిచేస్తుంది.
2. పప్పులు: పప్పులను చాలా మంది ఆహార పదార్థాల తయారీలో నిత్యం ఉపయోగిస్తుంటారు. ఒక కప్పు ఉడికించిన పప్పుల్లో సుమారు 18 గ్రాముల వరకు ప్రోటీన్ లభిస్తుంది. ఇవి కండరాల మరమ్మత్తుకు సహాయ పడటంతో పాటు, జీర్ణక్రియను మెరుగు పరిచే ఫైబర్‌ను కూడా అందిస్తాయి. వీటి వల్ల శరీరానికి అవసరం అయిన ప్రొటీన్ అందుతుంది.
3. బ్లాక్ బీన్స్: నల్ల బీన్స్‌లో కూడా ఒక కప్పుకు సుమారు 15 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇందులో ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, శక్తినిచ్చే కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి కండరాల పనితీరుకు మద్దతు ఇస్తాయి. అంతే కాకుండా వ్యాయామం తర్వాత కోలుకోవడానికి తోడ్పడతాయి.
4. చిక్కుడు కాయలు : చిన్నవిగా కనిపించినా.. పచ్చి బఠాణీలు ప్రోటీన్‌తో నిండి ఉంటాయి. ఒక కప్పుకు దాదాపు 8 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. వీటిని సలాడ్లలో.. కూరలలో లేదా సూప్‌లలో సులభంగా ఉపయోగించవచ్చు. పీ ప్రోటీన్ కూడా కండరాల పెంపుదలకు ప్రసిద్ధి చెందింది.
5. బ్రోకలీ : బ్రోకలీలో ప్రతి 100 గ్రాములకు సుమారు 2.8 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇందులో విటమిన్ సి, కె, ఫైబర్ అధికంగా ఉంటాయి. విటమిన్ సి కండరాల మరమ్మత్తుకు అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయ పడుతుంది.
Also Read: రోజుకు ఎంత నీళ్లు తాగాలి ? అతిగా తాగితే ఏమవుతుంది ?
6. బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ : ఈ చిన్న క్యాబేజీల వంటి కూరగాయలలో ప్రతి కప్పుకు సుమారు 4 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇవి ఫైబర్, విటమిన్ కె లను కూడా అందిస్తాయి. ఇవి కండరాల సంకోచానికి సహాయపడతాయి.
7. పాలకూర : ఆకుకూరలలో పాలకూర చాలా ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది. ఇందులో ప్రతి కప్పుకు దాదాపు 5 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. పాలకూరలో ఐరన్, ఫోలేట్, కాల్షియం అధికంగా ఉంటాయి. ఫలితంగా ఇవి కండరాల పనితీరు, శక్తి ఉత్పత్తికి చాలా అవసరం.
8. మొలకలు : పెసలు లేదా శనగల మొలకలు ప్రోటీన్ , ఎంజైములకు అద్భుతమైన వనరు. మొలకెత్తినప్పుడు వాటిలోని ప్రోటీన్ కంటెంట్ పెరుగుతుంది. అంతే కాకుండా ఇది జీర్ణం చేసుకోవడం సులభం అవుతుంది. ఇవి కండరాల ఆరోగ్యానికి వేగంగా శక్తిని అందిస్తాయి.
9. శనగలు : ఒక కప్పు ఉడికించిన శనగలలో సుమారు 14-15 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. వీటిలో జింక్, మెగ్నీషియం, ఫోలేట్ వంటి పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి కండరాల పెరుగుదలను వేగవంతం చేస్తాయి.
కండరాల పెరుగుదలకు సరైన ప్రోటీన్ తీసుకోవడం తప్పనిసరి. కేవలం మాంసాహారంపై ఆధారపడకుండా.. ఈ ప్రోటీన్ అధికంగా ఉండే కూరగాయలు, చిక్కుళ్లను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కండరాల నిర్మాణానికి బలం చేకూరుతుంది.